Begin typing your search above and press return to search.

'నాక్కూడా అవార్డ్స్ రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను'

By:  Tupaki Desk   |   17 Sep 2022 4:03 PM GMT
నాక్కూడా అవార్డ్స్ రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను
X
స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ "బబ్లీ బౌన్సర్". జాతీయ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ మధుర్ భండార్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. స్టార్ స్టూడియోస్ మరియు జంగిలీ పిక్చర్స్ సంస్థలు నిర్మించాయి.

మునుపెన్నడూ చూడని విధంగా తమన్నా ఈ సినిమాలో లేడీ బౌన్సర్‌ గా కనిపించనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది.

'బబ్లీ బౌన్సర్' సినిమా థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేసి, డైరెక్ట్ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ+ హాట్‌ స్టార్‌ లో సెప్టెంబర్‌ 23న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మధుర్ భండార్కర్ మాట్లాడుతూ.. "హైదరాబాద్ తో నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి. నా మొదటి సినిమా 'చాందిని బార్' హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో తియ్యడం జరిగింది. రాము గారితో కలసి 'రాత్రి' 'రంగీలా' 'గాయం' 'అంతం' 'గోవిందా గోవిందా' మొదలగు సినిమాలకు వర్క్ చేశాను. మళ్ళీ 23 సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.

"బబ్లీ బౌన్సర్ సినిమా విషయానికి వస్తే.. ఇక్కడ సౌత్ లో ఉండకపోవచ్చు కానీ.. నేను నార్త్ సైడ్ లో లేడీ బౌన్సర్ లను చూశాను. వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ సినిమా మెదలుపెట్టాను. ఇందులో హీరోయిన్ బబ్లీ గా ఫిజికల్ గా.. మెంటల్ గా మెచ్యూరిటీ చూపించాలి. ఈ విషయంలో తమన్నా ది బెస్ట్ అనిపించింది. 'బాహుబలి' లో తమన్నా చేసిన రోల్ ఆమెలోని నటిని బయటకు తీసుకువచ్చింది అనుకుంటాను"

"ఈ సినిమాకు తమన్నాను ఎందుకు తీసుకున్నావ్ అని చాలామంది అడిగారు. అలా అడిగిన వారందరూ ఈ ట్రైలర్ చూసిన తరువాత ఫోన్స్ చేసి మీ ఛాయిస్ వంద శాతం కరెక్ట్ అని చెప్పారు. మేము అనుకున్నట్టే ఈ సినిమాలో తమన్నా బౌన్సర్ గా చాలా చక్కగా నటించింది. ఈ నెల 23న డిస్నీ+ హాట్‌ స్టార్‌ లో విడుదల అవుతున్న ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తుంది" అని మధుర్ బండార్కర్ చెప్పుకొచ్చారు.

తమన్నా మాట్లాడుతూ.. "తెలుగు సినిమా అంటే నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా జర్నీ తెలుగు నుండే స్టార్ట్ అయ్యింది. రాజమౌళి - సుకుమార్ లు అందరూ మన ఇండియన్ రూట్స్ కథలు తీసుకొని చేస్తుంటారు. ఇప్పటికీ మన ఇండియన్ సినిమాను మన ఏమోషన్సే నడిపిస్తాయి. తొలి సారిగా లేడీ బౌన్సర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ స్క్రిప్ట్ నాకు దొరకడం నా అదృష్టం. పలుసార్లు జాతీయ అవార్డ్స్ పొందిన మధుర్ భండార్కర్ సర్ తో పనిచేసే అవకాశం వచ్చిందుకు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను" అని అన్నారు.

"ఈ సినిమాలో హరియాణాకు చెందిన యువతిగా నటించాను. తప్పకుండా ఇది నా కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుంది. మధుర్ బండార్కర్ సినిమాలో నటించిన హీరోయిన్స్ కు జాతీయ అవార్డ్స్ వస్తాయి. నాకు కూడా ఈ చిత్రానికి అవార్డ్స్ రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ నెల 23న డిస్నీ+హాట్‌ స్టార్‌ లో విడుదల అవుతున్న ఈ సినిమాను కుటుంబ సమేతంగా ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూడండి" అని తమన్నా చెప్పుకొచ్చింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.