Begin typing your search above and press return to search.

సర్దార్ విడుదల ఎన్ని వార్తలయ్యాయో తెలుసా?

By:  Tupaki Desk   |   9 April 2016 4:26 AM GMT
సర్దార్ విడుదల ఎన్ని వార్తలయ్యాయో తెలుసా?
X
సినిమాలు విడుదల కావటం.. దానిపై కామెంట్లు రావటం మామూలే. కానీ.. పవన్ తాజాగా నటించి విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ యవ్వారమే వేరు. ఈ సినిమా అనుకున్న రోజు నుంచే విపరీతమైన హైప్ వచ్చింది. అప్పటి నుంచి సినిమా విడుదల వరకూ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించిన ప్రతి వార్త ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. భారీ అంచనాల్ని పెంచింది. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు.. మీడియాలో వచ్చిన వార్తలు చూస్తే.. సినిమా అంతిమ ఫలితం సంగతి తర్వాత.. ఒక సినిమా విడుదలైతే ఇన్నేసి వార్తలా? అన్న సందేహం కలగక మానదు.

ఒక సినిమా విడుదలైతే.. భారీ కలెక్షన్లు వస్తే అదో వార్త అవుతుంది. అంతకు మించి చెప్పుకునేందుకు పెద్ద విశేషాలు ఉండవు. కానీ.. తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ ఇందుకు పూర్తిగా భిన్నం. సినిమా రిలీజ్ అయిన శుక్రవారం ఒక్కరోజే ఈ సినిమాకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తల్ని చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.

= గబ్బర్ సింగ్ రిలీజ్ సందర్భంగా కర్ణాటకలోని తమకూరు జిల్లా పావుగడ పట్టణంలోని అలంకార్ థియేటర్ లో ఇద్దరు యువకుల మధ్య భారీగా ఘర్షణ జరిగింది. సినిమా బాగోలేదంటూ చేసిన వ్యాఖ్యలతో మొదలైన గొడవ.. చివరకు పవన్ అభిమాని రాకేశ్ నాయక్ హత్యకు గురైన పరిస్థితి. ధియేటర్ లో కత్తుల దాడితో అక్కడికక్కడే మృతి చెందాడు.

= ఖమ్మం జిల్లా భద్రాచలంలో సర్దార్ సినిమా బాగోలేదన్న ఒక వ్యక్తిపై పవన్ అభిమానులు దాడి చేసి.. ఒకరిని చితకబాదారు.

= నల్గొండ జిల్లా చౌటప్పల్ లో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ లో సాంకేతిక కారణంతో సినిమా ప్రదర్శనకు అడ్డంకి ఏర్పడటంతో.. ఆగ్రహం చెందిన ప్రేక్షకులు చెలరేగిపోయి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.

= అదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో సర్దార్ గబ్బర్ సింగ్ తొలిరోజు సినిమా చూసేందుకు టిక్కెట్టు దొరకపోవటంతో ఆత్మహత్య యత్నం చేశాడు. వంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు అతన్ని అడ్డుకున్నారు.

= సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ సందర్భంగా మేకను బలి ఇచ్చి.. దాని తలను సర్దార్ ఫ్లెక్సీ మీద పెట్టి ఊరేగించటం ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

= ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణంలోని పరమేశ్వరి ధియేటర్ అద్దాల్ని పవన్ అభిమానులు పగలగొట్టారు. సినిమా టిక్కెట్లను బ్లాక్ లో అమ్మటంపై పవన్ అభిమానులు ఆగ్రహంతో ఈ చర్యకు పాల్పడ్డారు.

= హైదరాబాద్ లోని వనస్థలి పురం విష్ణు థియేటర్ వద్ద సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టిక్కెట్టు కోసం ఒక యువకుడు వేలు పోగొట్టుకున్నాడు. సినిమా టిక్కెట్టు కోసం మొయిన్ గేట్ ఎక్కి లోపలకు దూకే క్రమంలో వాచ్ మెన్ తలుపు ఒక్కసారి తెరవటంతో వేలు గేటులో ఇరుక్కొని తెగి కింద పడిపోయింది. వైద్య సాయం కోసం ఏర్పాట్లు చేసే సమయానికి భయంతో సదరు వ్యక్తి పారిపోవటం గమనార్హం.

= నెల్లూరు జిల్లాలో ఈ సినిమా టిక్కెట్ల కోసం భారీగా తోపులాటలతో పాటు.. పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ క్రమంలో ఒక అభిమాని గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు.

= సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించి హిందీ రిపోర్ట్ లను మర్చిపొండి.. తెలుగులోని ఈ సినిమా ఆల్ టైం ప్లాప్ అన్న రివ్యూలు వస్తున్నాయి. పవన్ సార్.. మీరిప్పుడు రెండు రూపాయిల హీరో అయిపోయారు. మీరు కానీ నేను తీస్తున్నన దేశద్రోహ్ 2లో కానీ నటిస్తే మరోసారి సూపర్ స్టార్ గా ఎదగొచ్చు అంటూ.. బాలీవుడ్ అనలిస్ట్ గా పేరున్న కమాల్ ఖాన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

= సర్దార్ పై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. నెల క్రితం తాను చెప్పిన జోస్యం నిజమైందని.. బాహుబలితో పోలిస్తే రెండు శాతం కలెక్షన్లు కూడా రాలేదని.. సర్దార్ తో బాలీవుడ్ ఎంట్రీ సరికాదని తాను చెప్పింది నిజమైందని.. ఇప్పటికైనా పవన్ కళ్లు తెరవాలని.. తన చుట్టూ ఉండి తప్పు దారి పట్టిస్తున్న వారి విషయంలో జాగరూకత వహించాలని పేర్కొన్నారు.

= ఇలాంటి ఘటనలు ఒక పక్క.. మరోవైపు.. సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల సందర్భంగా థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. రంగులు జల్లుకుంటూ.. భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హడావుడి చేశారు.

= సర్దార్ గబ్బర్ సింగ్ కలెక్షన్ల లెక్కలోకి వస్తే.. తొలిరోజు అమెరికా కలెక్షన్ల వివరాలు బయటకు వచ్చాయి. బాహుబలి కలెక్షన్ల కంటే తక్కువ వచ్చినప్పటికీ.. తొలిరోజు ఒక్క అమెరికాలో 6.16 లక్షల డాలర్ల కలెక్షన్లతో దుమ్మురేపాడు. మన రూపాయిల్లో ఈ కలెక్షన్ మొత్తం రూ.4కోట్లకు పైనే ఉంటుందని చెప్పొచ్చు.

= సర్దార్ గబ్బర్ సింగ్ మరో రికార్డును సృష్టించాడు. రిలీజ్ కు ముందు వేసే బెనిఫిట్ షోలలో రికార్డు సృష్టించినట్లు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్దార్ సినిమాను భారీగా ఫ్యాన్స్ షోలు వేసినట్లుగా తెలుస్తోంది. ఇది ఆల్ టైం రికార్డుగా చెబుతున్నారు.