Begin typing your search above and press return to search.

మ‌హిళ‌ల‌పై ఆ సీనియ‌ర్ న‌టుడి చీప్ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   6 July 2017 5:59 AM GMT
మ‌హిళ‌ల‌పై ఆ సీనియ‌ర్ న‌టుడి చీప్ కామెంట్స్‌
X
సుదీర్ఘ అనుభ‌వం, విశేష ప‌రిజ్ఞానంతో వ‌య‌సు పైబ‌డిన కొద్ది హుందాగా ఉండాల్సిన సినీ ప‌రిశ్ర‌మ‌లోని సీనియ‌ర్లు నోరు జారుతున్నారు. వారు ప‌రువు పోగొట్టుకోవ‌డమే కాకుండా ప‌రిశ్ర‌మ‌పై చెడు ముద్ర వేస్తున్నారు. ఇటీవ‌ల తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఓ ప్ర‌ముఖుడు ఇలా వివాదంలో ఇరుక్కోగా తాజాగా మ‌ళ‌యాళీ సీనియ‌ర్ నటుడు ఒక‌రు ఇలాగే త‌న నోటి దురుసును ప్ర‌ద‌ర్శించాడు. ప్రముఖ మలయాళ నటుడు, ఎంపీ ఇన్నోసెంట్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వివాదంగా మారాయి.

మలయాళం మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (అమ్మ) అధ్యక్షుడిగా ఉన్న ఇన్నోసెంట్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ సినీ అవకాశాల పేరిట లోబరుచుకోవడం(కాస్టింగ్‌ కౌచ్‌) పై స్పందించారు. త‌న‌దైన శైలిలో విశ్లేషించిన ఇన్నోసెంట్ ఈ క్ర‌మంలో తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు ఉప‌యోగించారు. కాస్టింగ్‌ కౌచ్ అనేది ప్ర‌స్తుతం మ‌ళ‌యాళ సినీ ప‌రిశ్ర‌మ‌లో లేద‌ని ఇన్నోసెంట్ తెలిపారు. గ‌తంలో ఇలాంటి ప‌రిస్థితి ఉండేద‌ని అయితే ఇప్పుడు అది మారిపోయింద‌ని తెలిపారు. మీడియా విస్తృతి పెర‌గ‌డంతో ఎవ‌రైనా త‌ప్పుగా ప్ర‌వ‌ర్తిస్తే వెంట‌నే ప్ర‌పంచానికి తెలిసిపోతుంద‌ని అన్నారు. అయితే మ‌హిళ‌లు చెడ్డ‌వారైతే వారు ప‌క్క‌లోకి వెళ్లే చాన్స్ ఉంద‌ని వ్యాఖ్యానించారు. దీంతో మ‌హిళ‌ల‌పై ఇన్నోసెంట్ చేసిన వ్యాఖ్య‌లు వివాదంగా మారాయి.

సాక్షాత్తు సినీ ప‌రిశ్ర‌మ‌లో కీల‌క సంఘం అధ్య‌క్షుడు చేసిన ఈ కామెంట్ల‌పై మళ‌యాళ మహిళా సినీ నటుల సంఘం ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్నోసెంట్ వ్యాఖ్య‌లు తీవ్ర అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని త‌ప్పుప‌ట్టింది. సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చే కొత్త నటులు పలురకాల లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారనేది ప‌లు సంద‌ర్భాల్లో జ‌రిగింద‌ని తెలిపారు. ఇటీవ‌లే పార్వతి - లక్ష్మీరాయ్ ఈ అంశం గురించి బ‌హిరంగంగా మాట్లాడిన సంద‌ర్భం ఉంద‌ని తెలిపారు. లైంగిక దోపిడీ జ‌ర‌గ‌డం లేదన్న విష‌యంలో నిజం లేద‌ని సంఘం స్ప‌ష్టం చేసింది. బాధ్య‌తాయుత‌మైన స్థానంలో ఉన్న ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించింది. కాగా, 2014 ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర్య అభ్య‌ర్థిగా నిల‌బ‌డిన ఇన్నోసెంట్ వామ‌ప‌క్షాల మ‌ద్ద‌తుతో ఎంపీగా గెలుపొందారు.