Begin typing your search above and press return to search.

'బాహుబలి' క్రేజ్ ఏమాత్రం ఉపయోగపడలేదా..?

By:  Tupaki Desk   |   30 Jun 2022 4:30 PM GMT
బాహుబలి క్రేజ్ ఏమాత్రం ఉపయోగపడలేదా..?
X
తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన చిత్రం 'బాహుబలి'. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ వెండితెర అద్భుతం.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేసింది. సౌత్ సినిమాలకు పాన్ ఇండియా అనే కొత్త దారిని చూపించింది.

భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డులకెక్కింది. 'బాహుబలి: ది బిగినింగ్' మరియు 'బాహుబలి: ది కన్‌క్లూజన్' అంటూ రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణ అందుకున్నాయి. మొదటి భాగం రూ. 650 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తే.. సెకండ్ పార్ట్ రూ. 1810 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.

'బాహుబలి' సినిమాలు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి భారీ క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. టాలీవుడ్ స్టార్ ని కాస్తా పాన్ ఇండియా స్టార్ ని చేసేశాయి. అయితే డార్లింగ్ తప్పితే ఈ చిత్రంలో భాగమైన ఇతర నటీనటులు మళ్లీ ఆ స్థాయిలో సినిమాలు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఈ సినిమాలో మహేంద్ర బాహుబలి - అమరేంద్ర బాహుబలి వంటి రెండు పాత్రల్లో ప్రభాస్ కనిపించారు. భల్లాల దేవుడిగా రానా - దేవసేనగా అనుష్క - అవంతికగా తమన్నా - శివగామిగా రమ్యకృష్ణ - కట్టప్ప గా సత్యరాజ్ - బిజ్జల దేవుడిగా నాజర్ నటించారు. వీరందరికీ మంచి పేరు వచ్చింది.

ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఇండియాలోనే నెంబర్ వన్ దిశగా దూసుకుపోతున్నాడు. అయితే శివగామిగా విశ్వరూపం చూపించిన రమ్యకృష్ణ.. ఆ తర్వాత ఎందుకనో పెద్ద సినిమాల్లో కనిపించలేదు. ఆమెకు ఆఫర్లు రాలేదా? ఒకవేళ వచ్చి ఉంటే ఎందుకు చేయలేదు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

బాహుబలితో ప్రభాస్ తో సమానంగా రానా దగ్గుబాటి కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అప్పటికే హిందీ తమిళ భాషల్లో నటించి ఉండటంతో.. అందరికీ ఈజీగా కనెక్ట్ అయిపోయాడు. అయితే ఆ తర్వాత రానా భారీ సినిమాల దిశగా ఆలోచించలేదు. 'అరణ్య' లాంటి సినిమా ట్రై చేసినా.. అది ఆ రేంజ్ మూవీ అయితే కాలేదు.

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి పరిస్థితి కూడా అలానే ఉంది. 'బాహుబలి 2' తర్వాత 'భాగమతి' వంటి మహిళా ప్రధాన చిత్రంతో హిట్టు కొట్టింది. కానీ ఈ నాలుగేళ్లలో స్వీటీ మళ్లీ అలాంటి పెద్ద సినిమా చేయలేకపోయింది. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో ఓ మూవీ చేస్తోంది అనుష్క.

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా వరుస ఆఫర్స్ అందుకుంటోంటి కానీ.. క్రేజీ సినిమాలైతే చేయడం లేదు. బాహుబలి రేంజ్ గుర్తింపు తెచ్చిపెట్టే పాత్ర చేయలేదు. 'సైరా నరసింహారెడ్డి' లో చేసిన రోల్ ఆమెకు పెద్దగా పేరు తెచ్చి పెట్టలేదు. ఇక వందల కోట్ల కలెక్షన్స్ అందుకున్న బాహుబలి నిర్మాతలు.. ఆ తర్వాత మరో పెద్ద సినిమా చేయడకపోడం ఆశ్చర్యకరమైన విషయమే.

ఇలా ప్రభాస్ మినహా మిగతా వారెవరూ 'బాహుబలి' తర్వాత క్రేజీ మూవీస్ చేయలేదు. దీనిని బట్టి ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ ఏ ఒక్క స్టార్ కు కూడా ఉపయోగపడినట్లు అనిపించడంలేదు. వారికి ఆఫర్లు రాలేదా? ఒకవేళ వచ్చినా ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోలేకపోయారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.