Begin typing your search above and press return to search.

ఇంత జరిగినా శిష్యులు స్పందించరా?

By:  Tupaki Desk   |   14 Feb 2018 10:07 AM GMT
ఇంత జరిగినా శిష్యులు స్పందించరా?
X
ఎందరో నటులకు సినీ జీవితాన్ని ప్రసాదించిన దర్శక దిగ్గజం దివంగత కె.బాలచందర్ గారి ఆస్తులు వేలానికి వచ్చాయన్న వార్త అభిమానులకు తీవ్ర మనస్థాపం కలిగించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన శిష్యులు ఎవరు నేరుగా స్పందించిన దాఖలాలు ఇప్పటి దాకా లేవు. వారిలో అగ్రజులుగా చెప్పుకునే రజనికాంత్ - కమల్ హాసన్ సైతం ఇంకా నోరు విప్పలేదు. దీనికి తోడు అసలు ఈ వార్త నిజమా కాదా అనే అనుమానం వ్యక్తమవుతున్న తరుణంలో ఆయన కుమార్తె పుష్పా కందసామీ స్పందించారు. ఆస్తుల వేలం కోసం యుకో బ్యాంకు నోటీసు ఇచ్చిన మాట నిజమేనని ఒప్పుకున్న ఆవిడ 2010లో తీసుకున్న అప్పుతో మొదలు పెట్టిన సీరియల్ 2015లో ఆగిపోయిందని, అప్పుడు మైలాపూర్ ఇల్లు - ఆఫీస్ ని తాకట్టు పెట్టి తీసుకున్నట్టు చెప్పారు. కాని సకాలంలో తీర్చడంలో ఆలస్యం జరగడంతో పరిస్థితి ఇంత దాకా వచ్చిందని చెప్పారు.

ఏక మొత్తం రూపంలో వన్ టైం సెటిల్మెంట్ కోసం తాము ప్రయత్నించే లోపే బ్యాంకు వేలానికి పిలుపు ఇచ్చిందని, ఆయన ఆస్తులు కాపాడుకునే బాధ్యత తమదే అని స్పష్టం చేసారు. నాలుగేళ్ల క్రితం స్వర్గస్థులైన బాలచందర్ గారి విలువైన ఆస్తులకు ఈ పరిస్థితి రావడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కాని ఎవరు కూడా నేరుగా దీని గురించి బయట మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెలుగులో అంతు లేని కథ - ఇది కథ కాదు - రుద్రవీణ లాంటి అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన బాలచందర్ గారు తమిళ్ లోనే తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగించారు. అనారోగ్యం ఉన్న టైంలో సైతం కమల్ ఉత్తమ విలన్ సినిమాలో చిన్న పాత్ర శిష్యుడి మీద ప్రేమతో వేసారు. మరి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వీలైనంత త్వరగా స్పందన ఉంటే బాగుంటుంది అని అభిమానులు కోరుకుంటున్నారు.