Begin typing your search above and press return to search.

అభిమానిపై బాల‌య్య కోపానికి కార‌ణ‌మిదే

By:  Tupaki Desk   |   6 Jan 2023 3:35 PM GMT
అభిమానిపై బాల‌య్య కోపానికి కార‌ణ‌మిదే
X
నందమూరి బాలకృష్ణ నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ వేడుక నేటి సాయంత్రం 7 గం.ల నుంచి ఒంగోలులోని అర్జున్ ఇన్ ఫ్రా గ్రౌండ్స్ లో గ్రాండ్ గా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ ఈవెంట్ కి బాల‌కృష్ణ‌- శ్రుతిహాస‌న్- న‌వీన్ ఎర్నేని స‌హా చిత్ర‌బృందం ఒక ప్ర‌త్యేక హెలీకాఫ్ట‌ర్ లో ఒంగోలుకి విచ్చేసారు. ఇరు రాష్ట్రాల నుంచి అభిమానులు వివిధ మార్గాల ద్వారా వెన్యూకి విచ్చేయ‌గా వారి వాహ‌నాల రాక‌పోక‌ల కోసం ట్రాఫిక్ రూల్స్ ని అనుస‌రించి ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు.

అయితే ఈవెంట్ కోసం భారీగా త‌ర‌లి వ‌చ్చిన అభిమానులు వేదిక వ‌ద్ద‌ నట‌సింహాన్ని చుట్టుముట్టేయ‌డ‌మే గాక సెల్ఫీల కోసం ఎగ‌బ‌డ్డారు. అంతేకాదు ప‌లువురు వీరాభిమానులు బాల‌కృష్ణ‌కు శాలువా క‌ప్పి త‌మ అభిమానం ప్ర‌ద‌ర్శించ‌డం ఈ వేదిక వ‌ద్ద క‌నిపించింది. ఓ అభిమాని రెడ్ క‌ల‌ర్ సిల్క్ శాలువా క‌ప్పుతూ ఉన్న‌ప్పుడు బాల‌కృష్ణ క‌ళ్ల జోడు కింద ప‌డిపోయింది. దీంతో స‌ద‌రు అభిమానిపై బాల‌య్య చిరుకోపం ప్ర‌ద‌ర్శించారు.

కానీ అంత‌లోనే ఎంతో అభిమానంగా త‌న ఫ్యాన్స్ ని ద‌రికి తీసుకున్నారు. వారినుద్ధేశించి అంద‌రూ సుర‌క్షితంగా ఉండాల‌ని కోరుకున్నారు. త‌న‌కు కోపం వ‌చ్చినా చిన్న పిల్ల‌వాడే. ఆనందం క‌లిగినా చిన్న పిల్ల‌వాడే. త‌న అభిమానులు త‌మ పిల్ల‌ల‌తో వేదిక వ‌ద్ద‌కు విచ్చేయ‌గా వారికి ముద్దులిచ్చి మ‌రీ త‌న ప్రేమ‌ను ప్ర‌ద‌ర్శించారు బాల‌య్య‌. ఇది చూప‌రుల‌ను విశేషంగా ఆక‌ర్షించింది. ఇక వేదిక వ‌ద్ద‌కు వేలాదిగా త‌ర‌లి వ‌చ్చిన అభిమానుల స‌మ‌క్షంలో నేటి సాయంత్రం వేడుక వైభ‌వంగా కొన‌సాగుతోంది. వేదిక వ‌ద్ద బాల‌య్య బంగారు వ‌ర్ణం సూట్ లో అద‌ర‌గొట్టాడు.

బాల‌య్య బాబుకు స‌మ‌ర‌సింహారెడ్డి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని అందించిన బి.గోపాల్ వేదిక‌పై మాట్లాడుతూ... యాక్ష‌న్ పాట‌లు మ‌సాలా అంశాల‌తో గోపిచంద్ మ‌లినేని అద్భుత‌మైన సినిమాని తెర‌కెక్కించాడ‌ని ఈ సీజన్ లో పెద్ద విజ‌యం సాధించే చిత్ర‌మిద‌ని అన్నారు.

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ మైత్రి మూవీ మేకర్స్- ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. క్రాక్‌ వంటి బ్లాక్ బస్టర్‌ హిట్‌ కొట్టిన గోపీచంద్‌ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.. బాలయ్య సరసన శృతిహాసన్ క‌థానాయిక‌. అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య వస్తున్న సినిమా కావడంతో అందరిలో భారీ అంచనాలు నెల‌కొన్నాయి. సీమ‌ ఫ్యాక్షన్ నేపథ్యంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ బ‌చిత్రం సమరసింహారెడ్డి -నరసింహ నాయుడు -చెన్నకేశం రెడ్డి వంటి ఫ్యాక్షన్ చిత్రాల తర్వాత బాలయ్య మరో ఫ్యాక్షన్ డ్రామాని ఎంపిక చేసుకోవ‌డం ఉత్కంఠ‌ను పెంచుతోంది. మాస్ అభిమానులను వేదిక‌పై ప్ర‌ద‌ర్శించిన హాట్ సాంగ్స్ క‌వ్వించాయ‌ని చెప్పాలి. థ‌మ‌న్ బాణీలు ఆక‌ట్టుకున్నాయి.

చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత బాలయ్య సంక్రాంతి బరిలోకి దిగుతుండడంతో మేకర్స్ ప్రచారం ప‌రంగా ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియోలను మెడ్లీల రూపంలో మ‌ళ్లీ వేదిక‌పై ప్ర‌ద‌ర్శించ‌గా అభిమానుల‌ను ఉర్రూత‌లూగించాయి. `క్రాక్` సినిమాలో కీలక పాత్ర పోషించిన వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో బాలకృష్ణ సోదరిగా మరింత పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతోంది. ఇక కన్నడ నటుడు దునియా విజయ్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.