Begin typing your search above and press return to search.

బాలయ్య కల నిజమయ్యే ఛాన్స్

By:  Tupaki Desk   |   10 May 2018 4:14 AM GMT
బాలయ్య కల నిజమయ్యే ఛాన్స్
X
ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరొయిన్ గా కీర్తి సురేష్ మహానటి సావిత్రి గారిలా మెప్పిస్తుందా లేదా అనే అనుమానాలు పటా పంచలు చేస్తూ బ్రహ్మాండంగా మెప్పించిన సంగతి నిన్నటి నుంచి రిపోర్ట్స్ రూపంలో చూస్తూనే ఉన్నాం. దర్శకుడు నాగ అశ్విన్ ఎందుకు తన మీద అంత నమ్మకం ఉంచాడో ఆణువణువూ తెలిసేలా తన టాలెంట్ తో కీర్తి సురేష్ సావిత్రి గారే పూనారా అనేంత అద్భుతంగా పాత్రకు జీవం పోసింది. సరిగ్గా ఇక్కడే బాలకృష్ణ అభిమానులు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నారు. చాలా ఏళ్ళ క్రితం బాలకృష్ణ నర్తనశాల రీమేక్ చేసేందుకు పూనుకున్న సంగతి అందరికి ఇంకా గుర్తే. ద్రౌపతిగా సౌందర్యను బృహన్నలగా తాను అందులో నటించేలా భారీ తారాగణం సెట్ చేసుకుని కొన్ని సీన్లు కూడా షూట్ చేసాడు. వాటి తాలూకు ఫోటోలు కూడా అప్పట్లోనే వైరల్ అయ్యాయి. కాని దురదృష్టవశాత్తు సౌందర్య విమాన ప్రమాదంలో చనిపోవడంతో వేరొకరిని ఊహించుకోలేక ఆ ప్రాజెక్ట్ ఆపేసాడు బాలయ్య.

మళ్ళి ఇన్నాళ్ళకు సావిత్రి గారిలా తెరమీద కనిపించిన కీర్తి సురేష్ ని చూసి నందమూరి అభిమానులకు ఆశలు చిగురిస్తున్నాయి. ఒకవేళ నర్తనశాల తీస్తే కనక ఆనాటి సినిమాలో సావిత్రి గారి పాత్రకు ఇప్పుడు కీర్తి సురేష్ అయితేనే న్యాయం చేయగలదని వాళ్ళ నమ్మకం. అనుకోవడానికి బాగానే ఉంది కాని ఈ కాలక్రమంలో చాలా మార్పులు వచ్చాయి. అప్పట్లో భీముడిగా తీసుకున్న శ్రీహరి-శకుని పాత్రకు సెట్ చేసిన ఏవిఎస్-కొన్ని కీలకమైన పాత్రల కోసం అనుకున్న రంగనాథ్-ధర్మవరపు సుబ్రహ్మణ్యం-ఎంఎస్ నారాయణ లాంటి సీనియర్ నటులు ఎవరూ బ్రతికి లేరు. ఆ షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి యాక్టివ్ గా ఉన్న సత్యనారాయణ గారు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు సినిమాల్లో నటించే పరిస్థితిలో లేరు. సో వీళ్ళందరి రీ ప్లేస్ మెంట్ అంత సులభం కాదు. చాలా టైం పడుతుంది. ఒకపక్క ఎన్టీఆర్ బయోపిక్ వ్యవహారమే ఎంతకూ తేలక బాలకృష్ణ సతమతమవుతుంటే ఇప్పుడు నర్తనశాల ప్రస్తావన వచ్చినా ఆసక్తి చూపుతారా అంటే అనుమానమే. పైగా ఐదుగురు భర్తలు ఉన్న బరువైన పౌరాణిక పాత్ర అంటే కీర్తి సురేష్ అయినా వెంటనే ఒప్పుకోగలదా. ఇన్ని సందేహాల మధ్య కలగా మిగిలిపోయిన నర్తనశాల తిరిగి కార్య రూపం దాల్చితే అంత కన్నా కావాల్సింది ఏముంటుంది.