Begin typing your search above and press return to search.

NBK 106 అఘోరాపైనే తొలి షెడ్యూల్ ప్లాన్

By:  Tupaki Desk   |   9 Feb 2020 10:39 AM IST
NBK 106 అఘోరాపైనే తొలి షెడ్యూల్ ప్లాన్
X
NBK 106 ఇప్ప‌టికే ప్రారంభం కావాల్సి ఉండ‌గా ఆల‌స్య‌మైన సంగ‌తి తెలిసిందే. స్క్రిప్ట్ విష‌యంలో బాల‌య్య సంతృప్తిగా లేక‌పోవ‌డంతో బోయ‌పాటి ని ప‌క్కా స్క్రిప్ట్ తో ర‌మ్మ‌ని ఆదేశాలిచ్చారు. ఆ క్ర‌మంలోనే అత‌డు గ‌త నెల‌రోజులుగా అదే ప‌నిలో ఉన్నారు. స్క్రిప్టు ద‌శ‌లోనే ఈసారి ఎక్కువ జాగ్ర‌త్త‌లే తీసుకుంటున్నార‌ని స‌మాచారం. ఎట్ట‌కేల‌కు బాల‌య్య ను వంద‌శాతం స్క్రిప్టుతో బోయ‌పాటి మెప్పించార‌ట‌. న‌ట‌సింహా ఇమేజ్ కు తగ్గ అంశాలు పుష్క‌లంగా ఉంటూనే కొత్త జాన‌ర్ ని బోయ‌పాటి ట‌చ్ చేస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టికే బాల‌య్య రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నార‌న్న‌ ప్ర‌చారం వేడెక్కిస్తుంది.

ఇందులో అఘోరా పాత్ర‌లో బాల‌య్య స‌ర్ ప్రైజ్ చేస్తార‌న్న స‌మాచారం ఇప్ప‌టికే రివీలైంది. స్క్రిప్ట్ డిమాండ్ చేయ‌డంతోనే బాల‌య్య‌ అఘోర గెటప్ లో కనిపించ‌డానికి ఒప్పుకున్నారుట‌. దీంతో మ‌రోసారి బాల‌య్య ద‌ర్శ‌కుల హీరో అనిపించారు. ద‌ర్శ‌కుడి దిశానిర్ధేశ‌నం మేర‌కు ఆయ‌న ఎలాంటి పాత్ర‌లోనైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేస్తార‌ని అభిమానులు చెబుతుంటారు. అఘోరా త‌ర‌హా పాత్ర‌లో న‌టించడం అన్న‌దే ఓ ఛాలెంజ్.. అనుకుంటే అప్పుడే బాల‌య్య బ‌రిలో దిగిపోయార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ ను అఘోరా గెట‌ప్ పై చిత్రీక‌రించేందుకు వార‌ణాసి వెళుతున్నార‌ట‌.

ఈనెల 26 నుంచే అక్క‌డ రెగ్యుల్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది. వార‌ణాసి ప్ర‌త్యేక‌త గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌సిద్ద పుణ్య క్షేత్రాలు వెలిసిన ప్రాంతం. అఘోరాలు సంచ‌రించే ప్రాంతం కూడా ఇదే. దైవ‌.. దుష్ట శ‌క్తుల‌ను కొలిచే ప‌విత్ర స్థ‌లంగా కాశీని పిలుస్తారు. ఇప్పుడు బాల‌య్య అఘోర పాత్ర పోషిస్తున్న నేప‌థ్యంలో కాశీ పేరు మ‌రోసారి హైలైట్ అవుతోంది. గ‌తంలో ఇక్క‌డ చాలా సినిమా షూటింగులు జ‌రిగాయి. నాగార్జున ఢ‌మ‌ర‌కం చిత్రీక‌ర‌ణ మేజర్ పార్టు షూటింగ్ అంతా ఇక్క‌డే జ‌రిగింది. ర‌జ‌నీ- ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి స్టార్ల‌ ప‌ర్య‌ట‌న‌ల‌తోనూ కాశీ- వార‌ణాసి పేరు మార్మోగింది. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు బాల‌య్య 106 తో కాశీ నామ స్మ‌ర‌ణం జ‌రుగుతోంది. ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేష‌న్స్ ప‌తాకం పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.