Begin typing your search above and press return to search.

బాలయ్య 100.. ఇంతకంటే ఏం కావాలి

By:  Tupaki Desk   |   23 April 2016 11:30 AM GMT
బాలయ్య 100.. ఇంతకంటే ఏం కావాలి
X
గత నాలుగైదు నెలల్లో బాలయ్య వందో సినిమా గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. చాలామంది దర్శకులు పేర్లు చర్చకు వచ్చాయి. చాలా కథల గురించి డిస్కషన్ నడిచింది. చివరికి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి చారిత్రక సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు బాలయ్య. రెండు నెలల కిందటి వరకు బాలయ్యను చూసి ఏంటీ కన్ఫ్యూజన్.. ఏదో ఒక సినిమా చేసేయొచ్చుగా.. ఇంతగా ఆలోచించడం దేనికి.. అంటూ సెటైర్లు వేశారు జనాలు. కానీ ఇప్పుడు బాలయ్య వందో సినిమా మీద నెలకొన్న ఆసక్తి చూసి.. బాలయ్య సెలక్షన్ భేష్ అంటున్నారు.

క్రిష్ లాంటి మంచి టేస్టున్న దర్శకుడితో వందో సినిమా చేయాలనుకోవడంతోనే బాలయ్య మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత చారిత్రక కథాంశాన్ని ఎంచుకోవడం ద్వారా మరింతగా ప్రశంసలు అందుకున్నాడు. బాలయ్య సినిమా కన్ఫమ్ అయ్యాక ఇంతకీ ఈ గౌతమపుత్ర శాతకర్ణి కథేంటో తెలుసుకుందామని ప్రయత్నించిన జనాలకు ఆ రాజు గొప్పదనం గురించి సమాచారం తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. వందల ఏళ్ల కిందటి చరిత్రను చూపించాలనుకోవడం పెద్ద సాహసమే. తన వందో సినిమాగా ఇలాంటి గొప్ప ప్రయత్నానికి శ్రీకారం చుట్టడం ద్వారా బాలయ్య తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

మామూలు మాస్ సినిమానే చేయాలని బాలయ్య నిర్ణయించుకుని ఉంటే.. ఆ సినిమా ప్రారంభోత్సవానికి కేసీఆర్ వచ్చేవారు కాదు. చిరంజీవి.. వెంకటేష్ లాంటోళ్లు హాజరయ్యేవారు కాదు. మొత్తంగా ఈ సినిమా మీద ఇంత చర్చ జరిగేది కాదు. మొత్తంగా ఇంకా షూటింగ్ మొదలవకముందే బాలయ్య వందో సినిమా మీద విపరీతమైన హైప్ నెలకొంది. ఇప్పటిదాకా తెలుగులో ఏ హీరో వందో సినిమాకూ ఇంత హైప్ లేదు. ఇంత ఆసక్తి లేదు.