Begin typing your search above and press return to search.

బాలయ్య మాట: నేనా.. సిక్స్ ప్యాకా?

By:  Tupaki Desk   |   18 Jan 2017 11:09 AM GMT
బాలయ్య మాట: నేనా.. సిక్స్ ప్యాకా?
X
ఒకప్పుడు సిక్స్ ప్యాక్స్.. చిజిల్డ్ బాడీలంటే బాలీవుడ్ హీరోలే గుర్తొచ్చేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో మన హీరోలు కూడా ఈ విషయంలో ఆరితేరిపోయారు. చాలామంది హీరోలు సిక్స్ ప్యాక్స్ ట్రై చేశారు. ‘బాహుబలి’ కోసం ప్రభాస్.. రానా దగ్గుబాటి ఎలా తయారయ్యారో అందరూ చూశారు. ఐతే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి చారిత్రక చిత్రం చేస్తూ బాలయ్య మాత్రం అలాంటి ప్రయత్నాలేమీ చేయలేదు. ఇంతకుముందు ఎలా ఉన్నాడో అలాగే కనిపించాడు. మరి లుక్ పరంగా మార్పుల కోసం ఎందుకు ప్రయత్నించలేదని తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాలయ్యను అడిగితే ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. తనకు సిక్స్ ప్యాక్స్ మీద నమ్మకం లేదని వ్యాఖ్యానించాడు బాలయ్య.

‘‘నా దృష్టిలో ఫిట్ నెస్ అన్నది కీలకం. ఆరోగ్యంగా ఉండాలి. సుదీర్ఘ సమయం పని చేసే స్టామినా ఉండాలి. నాకు సిక్స్ ప్యాక్స్ లాంటి వాటి మీద నమ్మకం లేదు. నేనిప్పుడు బాడీ మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే నవ్వుతారు. అతిగా కండలు పెంచడం.. బేర్ బాడీస్ తో కనిపించడం మన సంస్కృతి కాదన్నది నా అభిప్రాయం. మనం సహజంగా ఉంటేనే అందరూ ఇష్టపడతారు’’ అని బాలయ్య స్పష్టం చేశాడు. ఇక ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కోసం ఎలా సన్నద్ధమయ్యారు అని బాలయ్యను అడిగితే.. ‘‘శాతకర్ణి గురించి దొరికిన సమాచారం తక్కువ. స్క్రిప్టులో కూడా ఏదీ వివరంగా రాయలేదు. ఐతే దర్శకుడితో కలిసి అనేక విషయాలపై చర్చించి.. ఊహించుకుని ఈ పాత్రను చేశాను. క్రిష్ ఈ పాత్ర గురించి చెప్పగానే నాలో తెలియని ఎనర్జీ వచ్చేసింది. ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేశాను. తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు’’ అని బాలయ్య తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/