Begin typing your search above and press return to search.

ఇకపై కాంప్రమైజ్ కానంటున్న బాలయ్య!

By:  Tupaki Desk   |   9 Jan 2017 7:44 AM GMT
ఇకపై కాంప్రమైజ్ కానంటున్న బాలయ్య!
X
"ఇప్పటివరకూ కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాను కానీ.. ఇకపై ఎట్టిపరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కాను" ఇది ఏ సినిమాలో డైలాగో కాదు సుమా... ఇది అక్షరాలా బాలయ్య బాబు తన అభిమానుల సమక్షంలో చేసిన ఆసక్తికర వ్యాఖ్య! ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నాడు, కేవలం సినిమాల గురించే అన్నాడా లేక రాజకీయాలను కూడా కలిపే అన్నాడా అనే విషయాలు కాసేపు పక్కనపెడితే... తన 100వ సినిమా అనంతరం అభిమానులకు కొత్త బాలయ్య - బాలయ్యలో కొత్త కోణం కనిపించబోతుందనే అనుకోవాలి!

ప్రస్తుతం వందో సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్న బాలయ్య... తనకు చిన్నప్పటినుంచీ వచ్చిన అవకాశాల ప్రకారం సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతే ఇప్పటికి 250కి పైగా సినిమాలు చేసి ఉండేవాడినని అన్నారు. ఎన్ని సినిమాలు చేశామనేది కాదు, కళామతల్లికి ఎంత సేవ చేశామన్నదే ముఖ్యమని సూటిగా చెప్పారు. ఇక "గౌతమి పుత్ర శాతకర్ణి" విషయంలో స్పందించిన బాలయ్య... ఈ సినిమా తన వందో సినిమా చేయడం పూర్వ జన్మ సుకృతమని వ్యాఖ్యానించాడు.

ఈ క్రమంలో మరిన్ని సంగతులు చెప్పిన బాలయ్య... ప్రజా సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసి, తెలుగు జాతి గర్వించదగ్గ రాజుగా ప్రశంసలు పొంది - ముక్కలు ముక్కలుగా ఉన్న రాష్ట్రాలను ఏకతాటి పై తీసుకురావడంతోపాటు విదేశీయులు ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా కూడా భయపడేలా చేసిన గొప్ప చక్రవర్తి ఈ గౌతమి పుత్ర శాతకర్ణి అని... అంతటి గొప్ప రాజు పాత్రను పోషించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు. ఆ సందర్భంగానే "కాంప్రమైజ్" అనే విషయాన్ని ప్రస్థావిస్తూ.... "కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాను. ఇక కాంప్రమైజ్ కాను" అని అన్నారు బాలకృష్ణ.

ఇదే క్రమంలో గౌతమి పుత్ర శాతకర్ణికి సంబందించిన చాలా విషయాలు లభ్యం కానప్పటికీ ఈ సినిమా విషయంలో ఇటీవలే మరణించిన పరబ్రహ్మ శాస్త్రి - కృష్ణ శాస్త్రిలు ఎంతో సమాచారాన్ని అందించారని, ఈ సందర్భంగా వారికి నివాళులర్పిస్తున్నామని అన్నారు. కాగా, ఈ "గౌతమీపుత్ర శాతకర్ణి"ని సంక్రాంతికి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/