Begin typing your search above and press return to search.

బాల‌య్య వ్యాఖ్య‌ల మ‌ర్మ‌మేంటి..!

By:  Tupaki Desk   |   21 Dec 2015 5:24 AM GMT
బాల‌య్య వ్యాఖ్య‌ల మ‌ర్మ‌మేంటి..!
X
ప్ర‌ముఖ సినీ న‌టుడు యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ డిక్టేట‌ర్ ఆడియో ఫంక్ష‌న్‌ లో చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. ఆదివారం ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఆయ‌న న‌టిస్తున్న 99వ సినిమా డిక్టేట‌ర్ ఆడియో ఫంక్ష‌న్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మంత్రుల‌తో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఈవేదికపై బాల‌కృష్ణ మాట్లాడుతూ నేరుగా రాజ‌కీయాల గురించి ప్ర‌స్తావించ‌క‌పోయినా కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

బాల‌య్య ఎప్పుడూ చెప్పే మాటే అయినా తాను కాలంతో వెళ్ల‌న‌ని..కాల‌మే త‌న వెంట ప‌రుగులు తీసుకుంటూ రావాల్సిందేన‌న్న డైలాగ్‌ ను మ‌రోసారి ఇక్క‌డా ప్ర‌స్తావించారు. తాను దేనికి తీసిపోన‌ని....ప‌ద‌వులు త‌న‌కు అలంకారం కాద‌ని...ప‌ద‌వుల‌కే తాను అలంకార‌మ‌ని చెప్పారు. ఈ వ్యాఖ్య‌ల నిగూడార్థం ఏంట‌ని ఆలోచిస్తే బాల‌య్య‌కు కీల‌క‌మైన ప‌ద‌వుల‌పై ఆశ ఉంద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు.

అలాగే ఈ సినిమా టైటిల్ డిక్టేట‌ర్ గురించి కూడా ఆయ‌న మాట్లాడుతూ డిక్టేట‌ర్ అంటే నియంత అని...ఈ టైటిల్‌ కు త‌న వ్య‌క్తిత్వానికి కూడా ద‌గ్గ‌ర స్వ‌భావం ఉంద‌ని చెప్పారు. ఒక్కోసారి మార్పు కోసం జూలుం ప్ర‌ద‌ర్శించాల్సి రావ‌చ్చ‌ని బాల‌య్య చెప్పారు. బాల‌య్య వ్యాఖ్య‌లు నిశితంగా గ‌మ‌నిస్తే ఆయ‌న‌కు ప‌లానా ప‌ద‌వి కావాల‌ని చెప్ప‌క‌పోయినా తాను దేనికి తీసిపోన‌ని అన‌డంతో పాటు ప‌ద‌వుల ప్ర‌స్తావ‌న తేవ‌డంతో ఆయ‌న‌కు భ‌విష్య‌త్తులో వాటిపై కోరిక ఉంద‌న్న విష‌యం ప‌రోక్షంగా చెప్పిన‌ట్ల‌య్యింద‌న్న అభిప్రాయాన్ని స‌ర్వ‌త్రా వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక ఆయ‌న సినిమాల్లో బిజీగా ఉంటున్నా హిందూపురం ఎమ్మెల్యేగా రాజ‌కీయాల్లో రాణిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డ‌డంతో కేంద్ర‌, రాష్ర్ట మంత్రుల ద్వారా త‌న నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించుకుంటున్నారు. ఇక పార్టీ అంత‌ర్గ‌తంగా నిర్వ‌హించిన స‌ర్వేలో కూడా బాల‌య్య నెంబ‌ర్ వ‌న్ ర్యాంకు సొంతం చేసుకున్నారు. వీటితో పాటు ఆయ‌న తాజాగా చేసిన వ్యాఖ్య‌లు చూస్తే బాల‌య్య‌కు భ‌విష్య‌త్తు రాజ‌కీయాల్లో బాగా రాణించాల‌న్న కోరిక బ‌లంగా ఉంద‌ని మాత్రం స్ప‌ష్ట‌మ‌వుతోంది.