Begin typing your search above and press return to search.

బాల‌కృష్ణకు పోటీగా ర‌మేష్ బాబు నిల‌బ‌డ‌లేక‌పోయారా?

By:  Tupaki Desk   |   9 Jan 2022 5:30 PM GMT
బాల‌కృష్ణకు పోటీగా ర‌మేష్ బాబు నిల‌బ‌డ‌లేక‌పోయారా?
X
బాల న‌టుడిగా కెరీర్ ప్రారంభించిన ర‌మేష్ బాబు హీరోగా మాత్రం నిల‌దొక్కుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. హీరోగా కొన్ని స‌క్సెస్ లు అందుకున్న‌ప్ప‌టికీ ర‌మేష్ బాబు ఆ ఛ‌రిష్మాని ఎక్కువ‌కాలం కొన‌సాగించ‌లేక‌పోయారు. త‌న‌వెనుక తండ్రి సూప‌ర్ స్టార్ కృష్ణ స‌పోర్ట్ ఉన్నా ర‌మేష్ బాబు సినిమాలంటే అనాస‌క్తి చూపించిన‌ట్లు క‌నిపిస్తోంది. అయితే అందుకు కొన్ని కార‌ణాల్ని ఇక్క‌డ విశ్లేషించ‌వ‌చ్చు. బాల న‌టుడిగా కెరీర్ ప్రారంభించిన త‌ర్వాత ర‌మేష్ బాబు 23వ ఏట హీరోగా మేక‌ప్ వేసుకున్నారు. అప్పుడే నాగార్జున‌.. వెంక‌టేష్‌.. ఎన్టీఆర్ త‌మ్ముడు త్రివిక్ర‌మ రావు కుమారుడు క‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి హీరోలుగా ప‌రిచయం అయ్యారు.

ఇదే స‌మ‌యంలో ర‌మేష్ బాబు ని కృష్ట మ‌ళ్లీ రంగంలోకి దించారు. అయితే ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్-కృష్ణ మ‌ధ్య‌ మాట‌లు లేవు. ర‌మేష్ బాబు సినిమా ప్రారంభోత్స‌వానికి ఏఎన్నార్ ని అతిధిగా ఆహ్వానించారు. దీంతో బాల‌కృష్ణ‌తో సినిమాలు నిర్మించే నిర్మాత‌లు త‌క్క‌వ‌గా హాజ‌ర‌య్యారు. బాల‌య్య‌కి పోటీగా ర‌మేష్ బాబుని దించుతున్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. దానికి త‌గ్గ‌ట్టు `సామ్రాట్` టైటిల్ విష‌యంలో వివాదం ఏర్ప‌డింది. అప్ప‌టికే ర‌మేష్ బాబు సినిమాకి `సామ్రాట్` టైటిల్ ఖ‌రారైంది. అయితే బాల‌య్య సినిమాకు కూడా అదే టైటిల్ పెట్టారు. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య రాజీ ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి.

కానీ ఎవ‌రు వెన‌క్కి త‌గ్గ‌లేదు. దీంతో ఆ వివాదం కోర్టు వ‌ర‌కూ వెళ్ల‌గా ర‌మేష్ బాబు కే ఆ టైటిల్ ద‌క్కింది. ఇక సినిమాకి మొద‌ట క‌న్న‌డ ద‌ర్శ‌కుడు రాజేంద్ర సింగ్ బాబుని తీసుకున్నారు. కొద్ది భాగం షూటింగ్ జ‌రిగిన త‌ర్వాత కృష్ణ‌కి న‌చ్చ‌క‌పోవ‌డంతో అత‌ని స్థానంలో విక్ట‌రీ మ‌ధుసూద‌న‌రావుని నియ‌మించారు. చివరికి ఎలాగూ ఆ సినిమా పూర్తిచేసి రిలీజ్ చేసి స‌క్సెస్ అందుకున్నారు. అలా తొలి సినిమా విష‌యంలోనే ర‌మేష్ బాబుకి చాలా చేదు అనుభ‌వాలు ఎదుర‌య్యాయి. ఆ త‌ర్వాత మరికొన్ని సినిమాల్లో న‌టించే సరికి సినిమాలంటే బోర్ పీల‌య్యారా? లేక తండ్రి మాట కాద‌న‌లేక అప్పుడ‌లా వ‌చ్చి దూర‌మ‌య్య‌రా? అన్న‌ది తెలియ‌దు గానీ ర‌మేష్ బాబు ఒక్క‌సారిగా వెండి తెర‌నే కాదు సినీ ప‌రిశ్ర‌మ‌నే వ‌దిలేసి దూరంగా వెళ్లిపోయారు.

చివ‌రి సినిమా త‌ర్వాత `అర్జున్`...`అతిధి` సినిమాలు నిర్మించారు. రిలీజ్ కి ముందు ఆ సినిమా ఈవెంట్ల‌కు హాజ‌ర‌య్యారు. ఆ రెండు సినిమాలు కూడా అంచ‌నాలు అందుకోలేదు. దీంతో ఆయ‌న పూర్తిగా ప‌రిశ్ర‌మ‌కే దూర‌మ‌య్యారు. సినిమా వాళ్ల‌తో ఎక్క‌డా క‌లిసి తిరిగిన‌ట్లు కూడా క‌నిపించ‌లేదు. సినిమా రంగానికి సంబంధించిన ఏ ఈవెంట్ లోనూ కూడా ఆయ‌న క‌నిపించింది లేదు. బిజినెస్..ఫ్యామిలీ లైప్ కే ర‌మేష్ బాబు అంకిత‌మ‌య్యారు.