Begin typing your search above and press return to search.

2023 లో 'ఆదిత్య 999' మ్యాక్స్!

By:  Tupaki Desk   |   6 Nov 2022 11:30 PM GMT
2023 లో ఆదిత్య 999 మ్యాక్స్!
X
న‌ట‌సింహ బాల‌కృష్ణ -ప్ర‌ఖ్యాత దర్శ‌కుడు సింగీతం శ్రీనివాస్ రావు కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `ఆదిత్య 369` కి సీక్వెల్ పై అధికారిక ప్ర‌క‌ట‌నొచ్చిన సంగ‌తి తెలిసిందే. `ఆదిత్య 999 మ్యాక్స్` టైటిల్ తో దీన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్లు బాల‌య్య ప్ర‌క‌టించారు. ఈ సినిమా కోసం ఏకంగా బాల‌య్య‌నే స్వ‌యంగా క‌థ సిద్దం చేసారు. బాల‌య్య తొలిసారి సీక్వెల్ కోసం క‌లం ప‌ట్టి ఏకంగా ర‌చ‌యిత‌గా మారి సంచ‌ల‌నం రేపారు.

ఈ నేప‌థ్యంలో బాల‌య్య క్రియేటివిటీ ఎలా ఉంటుంది? అన్న దానిపై స‌ర్వత్రా ఆస‌క్తి నెల‌కొంది. టెక్నిక‌ల్ నేప‌థ్య‌మున్న క‌థ‌నే బాల‌య్య సిద్దం చేయ‌డం పై అభిమానుల్లోనూ ఉత్కంఠ‌కు తెర తీసింది. అయితే ఈ సినిమాకి ఎవ‌రు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు? బాల‌య్యనే స్వ‌యంగా ఆబాధ్య‌త‌లు తీసుకుంటారా? ఎప్పుడు ప్రారంభం అవుతుంది? వంటి సందేహాలున్నాయి.

తాజాగా అన్ స్టాప‌బుల్ కార్య‌క్ర‌మంలో బాల‌య్య కొన్నింటిపై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్తున్న‌ట్లు తెలిపారు. శ‌ర్వానంద్ హీరోగా న‌టించిన `ఒకే ఒక జీవితం` సినిమా గురించి ప్ర‌స్తావిస్తూ.. `ఆదిత్య 369` గుర్తొచ్చింద‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా `ఆదిత్య 999 మ్యాక్స్` గురించి స్పందిస్తూ.. వ‌చ్చే ఏడాదే ప్రారంభిస్తున్నామ‌ని తెలిపారు.

అయితే ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అన్న‌ది మాత్రం రివీల్ చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో డైరెక్ట‌ర్ విష‌యంలో మ‌రోసారి స‌స్పెన్స్ మొద‌లైంది. `ఆదిత్య 369`కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సింగీత‌మే ఆ బాధ్య‌త‌లు తీసుకుంటారా? లేక కొత్త వారికి అవకాశం ఇస్తారు. ఈ రెండు గాక క‌థ సిద్దం చేసిన‌ బాల‌య్య‌నే కెప్టెన్ కుర్చీ ఎక్కుతారా? అన్న‌ది మ‌రో బ‌ల‌మైన‌ సందేహం.

అయితే సీనియ‌ర్ కి అవ‌కాశం ఇవ్వ‌డం క‌న్నా ఇప్ప‌టి త‌రం ద‌ర్శ‌కులు..అందులోనూ టెక్నిక‌ల్ అంశాలున్న ద‌ర్శ‌కుడికి అవ‌కాశం క‌ల్పిస్తే బాగుంటుంద‌ని బాల‌య్య ఓ సంద‌ర్భంలో అన్న విష‌యాన్ని గుర్తు చేయాలి. పెద్దాయ‌నికి వ‌యోభారం అడ్డు త‌గులొచ్చ‌ని... పూర్తి స్థాయిలో ఆయ‌న సినిమా కోసం ప‌నిచేయ‌డం క‌ష్టత‌రంగా మారుతుంది! వంటి అంశాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని బాల‌య్య అండ్ కో ఈ నిర్ణ‌యానికి వ‌చ్చి ఉండొచ్చు. అయితే వ‌చ్చే ఏడాది బాల‌య్య అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో 108వ సినిమా ప్రారంభించాలి. అలాగే 109వ సినిమాకి సంబంధించి చర్చ‌లు వేగంగా జ‌రుగుతున్నాయి. మ‌రి వీట‌న్నింటి న‌డుమ ఆదిత్య `999 మ్యాక్స్ నెంబ‌ర్` ఏదై ఉంటుందో చూడాలి.