Begin typing your search above and press return to search.

బాల‌య్య 110 గా 'రైతు'ని దించే ఛాన్స్!

By:  Tupaki Desk   |   15 July 2022 9:30 AM GMT
బాల‌య్య 110 గా రైతుని దించే  ఛాన్స్!
X
న‌ట‌సింహ బాల‌కృష్ణ‌-కృష్ణ‌వంశీ కాంబినేష‌న్ లో ప‌ట్టాలెక్కాల్సిన 'రైతు' అనివార్య కార‌ణ‌ల‌తో నిలిచిపోయిన సంగ‌తి త‌తెలిసిందే. బాల‌య్య మ్యాజిక‌ల్ నెంబ‌ర్..ల్యాండ్ మార్క్ మూవీ 100వ చిత్రంగా రైతునే తెర‌కెక్కించాల‌ని బ‌లంగా సంక‌ల్పించారు. 100వ సినిమాగా 'రైతు' మాత్ర‌మే న్యాయం చేయ‌గ‌ల‌ద‌ని బాల‌య్య ఎంతో న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేసారు.

ఆ క‌థ‌కి క్రియేటివ్ మేక‌ర్ కృష్ణ‌వంశీ అయితేనే న్యాయం చేయ‌గ‌ల‌ర‌ని పిలిపించి మ‌రీ తానే డైరెక్ట్ చేయాల‌ని కోరారు. ఓ కీల‌క మైన పాత్ర‌ని బాలీవుడ్ లెజెండ‌రీ న‌టుడు అమితాబ‌చ్చ‌న్ పోషించాల్సి ఉంది. ఆయ‌నతో సంప్ర‌దింపులు కూడా జ‌రిపారు. ఆయ‌న కాల్షీట్ల స‌మ‌స్య రావ‌డం ప్రాజెక్ట్ ఆగిపోవ‌డానికి ఓ కార‌ణంగా అప్ప‌ట్లోనే తెర‌పైకి వ‌చ్చింది.

అలా ఆ కాంబినేష‌న్ లో సినిమా ఇంత వ‌ర‌కూ సాధ్య‌ప‌డలేదు. అదే స‌మ‌యంలో క్రిష్ 'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి'తో ముందుకు రావ‌డం.. ఆ క‌థ పీరియాడిక్ స్టోరీ బాల‌య్య‌కి విప‌రీతంగా న‌చ్చ‌డం..వెంట‌నే సెట్స్ కి వెళ్లిపోవ‌డం అన్ని వాయ వేగంతో జ‌రిగిపోయాయి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ 'రైతు' విష‌యం ఎక్క‌డా చ‌ర్చ‌కు రాలేదు. 100 నుంచి 106 వ‌ర‌కూ బాల‌య్య ఎంతో వేగంగా సినిమాలు చేసుకుంటూ వ‌చ్చేసారు.

దీంతో 110వ సినిమా కూడా ద‌గ్గ‌ర ప‌డింది. ప్రస్తుతం 107వ ప్రాజెక్ట్ కి గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్నారు. అటుపై 108వ చిత్రం యంగ్ మేక‌ర్ అనీల్ రావిపూడితో ఇప్ప‌టికే ఖ‌రారైంది. మ‌ధ్య‌లో 109 ఒక‌టుంది. అటుపై 110వ చిత్రాన్ని ప్రతిష్టాత్మ‌కంత‌గానే భావించాలి. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి 'రైతు' తెర‌పైకి వ‌స్తుంది.

110వ ప్రాజెక్ట్ గా 'రైతు' క‌థ అయితే బాగుంటుంద‌ని నంద‌మూరి ఫ్యామిలీ భావిస్తున్న‌ట్లు వినిపిస్తుంది. మ‌రి ఇది సాధ్య‌మ‌వుతుందా? లేదా? అన్న‌ది కేవ‌లం బాల‌య్య చేతుల్లోనే ఉంద‌ని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అస‌లు రైతు ఎందుకు తెర‌కెక్క‌లేదు? అన్న విష‌యంపై కృష్ణ‌వంశీ అస‌లు ఏం జ‌రిగింది అన్న‌ది తాజాగా వెలుగులోకి తీసుకొచ్చారు.

బాల‌య్య 100వ సినిమా స‌మ‌యంలోనే! కృష్ణ‌వంశీ దిల్ రాజు నిర్మాణంలో 'రుద్రాక్ష' సినిమాకి క‌మిట్ అయ్యారుట‌. హీరోని ఫైన‌ల్ చేసుకుని ప్రారంభిద్దాం అనుకున్న స‌మ‌యంలో బాల‌య్య నుంచి వంశీకి పిలుపొచ్చిందిట‌. ఓ సీనియ‌ర్ రైట‌ర్ రాసిన రైతు క‌థ‌ని డైరెక్ట్ చేస్తారా? క‌థ చాలా బాగుంది..పైగా 100 సినిమా మీరు చేస్తే బాగుంటుంద‌ని ఆఫ‌ర్ చేసారుట‌.

మీ షెడ్యూల్ ఎంటి అని బాల‌య్య అడిగారుట‌. ఇదే విష‌యాన్ని దిల్ రాజుకి చెప్ప‌గా పెద్దాయ‌న‌..పైగా 100వ సినిమా అంటున్నారు. ముందు ఆ సినిమా పూర్తి చేయండ‌ని..మ‌న సినిమా త‌ర్వాత చేద్దామ‌ని అన్నారుట‌. దీంతో 'రైతు' ప‌నులు మొద‌ల‌య్యాయి. అందులో భార‌త ప్ర‌ధాని మంత్రి పాత్ర ఒక‌టుందిట‌.

ఆ పాత్ర‌ కేవ‌లం బాలీవుడ్ దిగ్గ‌జం అమితాబ‌చ్చ‌న్ మాత్ర‌మే చేస్తే బాగుంటుద‌ని ఆయ‌న కాల్షీట్ల‌ కోసం ప్ర‌య‌త్నించారుట‌. మూడు నాలుగు నెల‌లు పాటు ట్రై చేసారుట‌. చివ‌రికి అమితాబ్ కి కుద‌ర‌క‌పోవ‌డం తో రైతు వాయిదా ప‌డింద‌ని రివీల్ చేసారు. మ‌రి 110వ చిత్రంగానైనా 'రైతు'ని బ‌రిలోకి దించుతారా? అన్న‌ది చూడాలి.