Begin typing your search above and press return to search.

అలాంటి వెధవలను క్షమించేద్దాం

By:  Tupaki Desk   |   5 Jan 2022 9:30 AM GMT
అలాంటి వెధవలను క్షమించేద్దాం
X
బాలకృష్ణ తెరపైన మాత్రమే కాదు .. బయట కూడా అంతే ధైర్యంగా తాను చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పేస్తుంటారు. తన మనసులోని మాటను బయటపెట్టడానికి ఆయన ఎంతమాత్రం వెనుకాడరు. రాజకీయాలకు సంబంధించిన విషయాలను మాత్రమే కాదు, సినిమాలకి సంబంధించిన విషయాలపై కూడా ఆయన అంతే ఫోర్స్ తో స్పందిస్తారు. తాను అనవలసిన మాటలు అనేసి ఆయన వదిలేస్తారు. ఆ తరువాత ఆ విషయంపై ఎంత రచ్చ జరిగినా ఆయన పట్టించుకోరు. ఎప్పటి మాదిరిగానే తన పని తాను చేసుకుపోతుంటారు.

ఇక బసవతారకం కేన్సర్ హాస్పిటల్ ద్వారా ఆయన ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారని అభినందించేవారు ఎంతోమంది ఉన్నారు. అలాగే అభిమానులపై ఆయన చేయిచేసుకోవడం చూసి ఆశ్చర్యపోయేవారు ఉన్నారు. అయితే అభిమానం పేరుతో ఆయన మీదపడటం .. కాళ్లు తొక్కడం .. సందర్భం ఏంటనేది చూడకుండా సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించి ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే ఆయనకి కోపం వస్తుందని సన్నిహితులు చెబుతుంటారు.

ఇక బాలకృష్ణకి ఇండస్ట్రీలో ఎవరితోనూ ఎలాంటి సఖ్యత ఉండదనే విమర్శలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నవే. ఆయన ఎవరినీ కలుపుకుపోకుండా, తనదైన ఒక ప్రత్యేకమైన దారిలో ముందుకు వెళుతుంటారని అంటూ ఉంటారు. ఇందుకు సంబంధించిన కామెంట్లు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత మరింత పెరిగిపోయాయి. సాధారణంగా సోషల్ మీడియా కామెంట్లను పెద్దగా పట్టించుకోని బాలయ్య, అలా కామెంట్లను పోస్ట్ చేసేవారిని 'అన్ స్టాపబుల్' వేదికగా హెచ్చరించారు. కొంతమంది వెధవలు అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. " ఇవాళ ప్రపంచంలో ప్రతివాడు సోషల్ మీడియాలో ఏం అనాలనిపిస్తే అది అంటున్నాడు. పేరు తెలియదు .. లొకేషన్ తెలియదు .. అడ్రెస్ ఉండదు. చాలా బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. బాలకృష్ణకి రవితేజకి పడదు.. చిరంజీవి, బాలకృష్ణ ఫోన్లో మాట్లాడుకోరు .. నా హీరో తోపు .. నీ హీరో సోపు .. ఏంటివన్నీ. లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయిందీ .. దొరికితే దవడ పగిలిపోద్దీ. కానీ మనం చేయవలసింది ఒక్కటే .. ఊరు .. పేరు చెప్పుకోవడానికి ధైర్యంలేని ఈ వెధవలను క్షమిద్దాం. మన మీద వచ్చిన విమర్శలను ప్రేమించినప్పుడే మనం 'అన్ స్టాపబుల్' అవుతాం" అంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.