Begin typing your search above and press return to search.

బాల‌య్య‌ ఫ్యాన్స్ ర‌చ్చ‌..యుఎస్ లో ఆగిన‌ షో!

By:  Tupaki Desk   |   12 Jan 2023 4:50 AM GMT
బాల‌య్య‌ ఫ్యాన్స్ ర‌చ్చ‌..యుఎస్ లో ఆగిన‌ షో!
X
అభిమాన హీరో సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసిందంటే ఫ్యాన్స్ చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. అందులోనూ సంక్రాంతి బ‌రిలో న‌చ్చిన హీరో సినిమా రిలీజ్ అంటే అభిమానులు చేసే హంగామా పీక్స్ లో వుంటుంది. అయితే ఈ మ‌ధ్య విలేజ్ ల‌లో, సిటీస్ ల‌లో ఫ్యాన్స్ చేసే ర‌చ్చ కంటే ఫారిన్ లో చేస్తున్న ఫ్యాన్స్ హంగామా.. హ‌డావిడీ వివాదాల‌కు తెర తీస్తుండ‌టంతో నిర్వాహ‌కులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘ‌ట‌నే యుఎస్ లో జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

వివ‌రాల్లోకి వెళితే.. నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన లేటెస్ట్ హైవోల్టేజ్ యాక్ష‌న్ డ్రామా 'వీర సింహారెడ్డి'. మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన 'క్రాక్‌' మూవీతో ట్రాక్ లోకి వ‌చ్చేసిన గోపీచంద్ మ‌లినేని ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచే అభిమానుల్లో అంచ‌నాలు తారా స్థాయికి చేరాయి. అంతే కాకుండా 'అఖండ‌'తో స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చిన బాల‌య్య చాలా గ్యాప్ త‌రువాత చేసిన ఫ్యాక్ష‌న్ డ్రామా కావ‌డంతో ఈ సినిమాపై అభిమానులు భారీ ఎక్స్ పెక్టేష‌న్స్ పెట్టుకున్నారు.

శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీలో బాల‌కృష్ణ డ్యుయెల్ రోల్ న‌టించ‌డం విశేషం. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న భారీ స్థాయిలో రిలీజ్ అయింది. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కోసం బాల‌య్య అభిమానులు ఎంత‌గా ఎదురు చూస్తున్నారో యుఎస్ లో వున్నఅభిమానులు కూడా అదే స్థాయిలో ఎదురు చూస్తుండ‌టంతో అక్క‌డ కూడా ఈ మూవీకి భారీ క్రేజ్ ఏర్ప‌డింది.

12న విడుద‌లైన ఈ మూవీ యుస్ లో భారీ స్థాయిలో విడుద‌లైంది. అయితే అమెరికాలోని సినిమా రిలీజ్ సంద‌ర్భంగా అభిమానులు చేసిన హంగామా వివాదానికి దారితీసింది. ఓ థియేట‌ర్ లో ప్ర‌ద‌ర్శ‌న మొద‌ల‌వ్వ‌గానే అభిమానులు కాగితాలు చించేస్తూ థియేట‌ర్ మొత్తం చ‌ల్లుతూ నానా హంగామా చేశారు. ఫ్యాన్స్ ర‌చ్చ హ‌ద్దులు దాటేయ‌డంతో థియేట‌ర్ యాజ‌మాన్యం అర్‌థంత‌రంగా షోని నిలిపివేయ‌డ‌మే కాకుండా ర‌చ్చ ర‌చ్చ చేస్తున్న అభిమానుల‌ని థియేట‌ర్ నుంచి బ‌య‌టికి పంపించేసింది.

ఇంత వ‌ర‌కు ఎన్నో సినిమాల‌ని ప్ర‌ద‌ర్శించామ‌ని, అయితే ఇలాంటి ప‌రిస్థితి మాకు ఎప్పుడూ ఎదురుకాలేద‌ని, ఈ సారి బాల‌కృష్ణ అభిమానులు మ‌రీ ర‌చ్చ ర‌చ్చ చేశార‌ని థియేట‌ర్ యాజ‌మాన్యం వాపోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా వుంటే థియేట‌ర్ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన అభిమానులు జై బాల‌య్య జైజై బాల‌య్య అంటూ నినాదాలు చేయ‌డం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.