Begin typing your search above and press return to search.

ఇఫీలో 'అఖండ' దర్శక నిర్మాతలతో బాలయ్య సందడి..!

By:  Tupaki Desk   |   25 Nov 2022 11:30 AM GMT
ఇఫీలో అఖండ దర్శక నిర్మాతలతో బాలయ్య సందడి..!
X
నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ''అఖండ''. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)లో స్పెషల్ స్క్రీనింగ్ కు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ఇండియన్ పనోరమా విభాగంలో గురువారం రాత్రి ''అఖండ'' చిత్రాన్ని స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఇందులో టాలీవుడ్ సీనియర్ హీరో బాలయ్య స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌ గా నిలిచారు. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను మరియు నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌ రెడ్డిలతో కలిసి బాల‌కృష్ణ తన సినిమా ప్రత్యేక ప్రదర్శన కోసం హాజ‌ర‌య్యారు.

ఇఫీలో 'అఖండ' త్రయం బాలకృష్ణ - బోయపాటి శ్రీను మరియు మిర్యాల రవీందర్ రెడ్డి కలిసి సందడి చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా బయటకు. ఇందులో బాలయ్య రాయల్ లుక్ లో ఆకట్టుకున్నాడు. దర్శక నిర్మాతలతో కలిసి తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ప్ర‌తి ఏటా ప్ర‌భుత్వం ఘ‌నంగా నిర్వహించే ప్ర‌తిష్టాత్మ‌క అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో తెలుగు సినిమా స్పెషల్ స్క్రీనింగ్ అవ్వడం విశేషమని చెప్పాలి. స‌నాత‌న ధ‌ర్మంతో పాటు మ‌హాభార‌తం - రామాయ‌ణం లాంటి ఇతిహాసాల ఆవ‌శ్య‌క‌త‌ను, విలువ‌ను ఈ సినిమా ద్వారా క‌మ‌ర్షియ‌ల్ పంథాలో చ‌క్క‌గా ఆవిష్క‌రించార‌ని ఈ సందర్భంగా బాల‌కృష్ణ తెలిపారు.

కరోనా క్లిష్ట ప‌రిస్థితుల్లో ఈ సినిమా షూటింగ్ చేశామ‌ని.. పాండమిక్ సెకండ్ వేవ్ త‌ర్వాత థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పెద్ద విజ‌యాన్ని సాధించి టాలీవుడ్‌ తో పాటు భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో ధైర్యాన్ని నింపింద‌ని బాలయ్య పేర్కొన్నారు. ఇఫీలో ఈ ఏడాది తెలుగు నుంచి 'అఖండ‌'తో పాటు RRR చిత్రాన్ని కూడా స్క్రీనింగ్ కోసం ఎంపిక‌ చేశారు.

కాగా, 'అఖండ' సినిమాని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయగా.. అందులో అఘోరా పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. బోయపాటి శైలి యాక్షన్ - ఎస్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఈ సినిమా విజయానికి దోహద పడ్డాయి.

అందుకే 'అఖండ' అఖండమైన విజయం సాధించి, బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ - నితిన్ మెహతా - జగపతి బాబు - పూర్ణ - కాలకేయ ప్రభాకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.