Begin typing your search above and press return to search.

బాలూని మళ్ళీ హత్తుకున్నారుగా.. ?

By:  Tupaki Desk   |   9 Oct 2021 1:30 AM GMT
బాలూని మళ్ళీ హత్తుకున్నారుగా.. ?
X
సుప్రసిద్ధ నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దివికేగి సరిగ్గా ఏడాది దాటింది. ఆయన గానగంధర్వుడు. ఆయన బహుముఖ ప్రతిభా ధురీణుడు. బాలూకు సరిసాటి ఎవరూ లేరు అంటే అతిశయోక్తి కాదేమో. ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ వేవ్ కరోనా వేళ బాలు కన్ను మూశారు. నాడు ఆయన అంత్యక్రియలకు కూడా టాలీవుడ్ నుంచి ఎవరూ హాజరుకాలేకపోయారు. ఆ తరువాత కరోనా తగ్గినా కూడా ఆయన పేరిట ఒక సంస్మరణ కార్యక్రమం నిర్వహించలేకపోయారు అన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఈటీవీ యాజమాన్యం బాలూ తొలి వర్ధంతిని తన చానల్ లో ఘనంగా జరిపి గురుతర బాధ్యతను నెరవేర్చింది.

ఇవన్నీ పక్కన పెడితే బాలు అచ్చమైన తెలుగు వారు. ఆయన తెలుగులో పుట్టి తెలుగు వారికే ఎన్నో వేల పాటలు పాడిన గాంధర్వుడు. అయితే ఆయనకు తమిళ సీమ ఇచ్చిన విలువ గౌరవం తెలుగుతో పోల్చితే ఎన్నతగినది అని అంతా అంటారు, ఒప్పుకుంటారు. బాలుకు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ వంటి అవార్డులు అన్నీ కూడా తమిళ కోటా నుంచే దక్కడం ఇక్కడ చెప్పుకోవాలి. అంతే కాదు అక్కడ సీనియర్ హీరోలు సైతం బాలుని ఏ రోజూ కూడా పక్కన పెట్టలేదు, కాలం మారింది కదా అని మరచిపోలేదు. తమ సినిమాల్లో కనీసం ఒక్క పాట అయినా ఆయన చేత పాడించుకుంటూ వచ్చారు. వారిలో సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ ముందు వరసలో ఉన్నారు.

తాజాగా బాలు రజనీకాంత్ అన్నాత్తే మూవీకి పాడిన ఇంట్రడక్షన్ సాంగ్ విడుదల చేస్తే బాలు అభిమానులకు కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీళ్ళే వచ్చాయి. బాలు తొలి పాట తెలుగులో శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్నలోనిది. బాలు చివరి పాట ఏది అని చెప్పుకుంటే అది తమిళ సినిమా అన్నాత్తే దే అనుకోవాలి. ఇక బాలు తెలుగులో ఎంతో మంది కొత్త హీరోలకు పాటలు పాడి వారిని సూపర్ స్టార్లను చేశారు. ఆ తరువాత కాలంతో వచ్చిన మార్పులు అంటూ వారు బాలుని పక్కన పెట్టేశారు. కనీసం ఒక్క పాట అయినా తమ సినిమాలలో ఇవ్వలేకపోయారు. అదే రజనీకాంత్ వంటి తమిళ సూపర్ స్టార్ల మూవీస్ లో అయితే ప్రతీ ఇంట్రడక్షన్ పాట బాలుది ఉండాల్సిందే. మరి వారు కూడా కాలం మారిపోయింది అని బాలుతో పాడించకపోవచ్చు. కానీ వారు పాడించారు. ప్రేమగా బాలు పాటను అలా హత్తుకున్నారు. మొత్తానికి బాలు తెలుగు వాడిగా పుట్టినందుకు మనం గర్వించాలి. మరి ఆయనకు తెలుగు వారు ఘనమైన నివాళి ఇచ్చారా అంటే మాత్రం ఆలోచించాలి.