Begin typing your search above and press return to search.

'ఆదిపురుష్ ను బ్యాన్ చెయ్యండి'

By:  Tupaki Desk   |   6 Oct 2022 7:00 AM GMT
ఆదిపురుష్ ను బ్యాన్ చెయ్యండి
X
గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ''ఆదిపురుష్''. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్ - సైఫ్ అలీ ఖాన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రామాయణ ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు మిశ్రమ స్పందన లభించింది.

ప్రభాస్ రాముడిగా కనిపించిన 'ఆది పురుష్' సినిమా టీజర్ ను గాంధీ జయంతి రోజు అయోధ్య వేదికగా గ్రాండ్ గా ఆవిష్కరించారు. అయితే నాసిరకం గ్రాఫిక్స్ మరియు వీఎఫ్ఎక్స్ వర్క్ తో టీజర్ పేలవంగా ఉందని ట్రోల్స్ చేశారు. ఈ మధ్య కాలంలో ఈ టీజర్ మీద జరిగినంత ట్రోలింగ్ మరే సినిమా విషయంలోనూ జరగలేదేమో. ఈ క్రమంలో హిందూ దేవుళ్లను అపహాస్యం చేసేలా ఈ టీజర్ ఉందనే ఆరోపణలు వచ్చాయి.

ఇందులో శ్రీరాముడు - రావణుడు - హనుమాన్ పాత్రలను చిత్రీకరించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పలువురు బీజేపీ నాయకులు ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేయగా.. లేటెస్టుగా అయోధ్య రామాలయం ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ ఏకంగా 'ఆది పురుష్' సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

'ఆదిపురుష్' టీజర్ లో శ్రీరాముడు - హనుమంతుడు - రావణుడి గురించి తప్పుగా చిత్రీకరించారంటూ వివాదం కొనసాగుతున్న తరుణంలో.. అయోధ్య రామ మందిరం ప్రధాన పూజారి ఈ సినిమాను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇందులో రాముడు, హనుమంతుడు, రావణుడి వర్ణన మన ఇతిహాసానికి ఏమాత్రం పొంతన లేదని.. ఇది వారి గౌరవానికి విరుద్ధంగా ఉందని అన్నారు. సినిమాలు తీయడం నేరం కాదని.. అయితే ఉద్దేశపూర్వకంగా వివాదాలు సృష్టించి హెడ్ లైన్స్ లోకి రావాలని అనుకోవడం సరైంది కాదని పూజారి సత్యేంద్ర దాస్ పేర్కొన్నారు.

ఇకపోతే 'ఆదిపురుష్' టీజర్ హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య మరియు బ్రజేష్ పాఠక్ ఖండించారు. తాను ‘ఆదిపురుష్’ టీజర్ ను ఇంకా చూడలేదని.. అయితే మతపరమైన మనోభావాలను దెబ్బతీసే సినిమాలు తీయకూడదని.. తీసినా చూడకూడదని కేశవ్ ప్రసాద్ అన్నారు. సినిమాలోని వివాదాస్పద సన్నివేశాలను విడుదలకు ముందే సరిదిద్దాలని సూచించారు.

అలానే టీజర్ లో హనుమంతుడికి లెదర్ జాకెట్ వేయడం కరెక్ట్ కాదని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు.అభ్యంతరకర సన్నివేశాలను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు, బిజెపి అధికార ప్రతినిధి మాళవిక అవినాష్ స్పందిస్తూ.. రావణుడి పాత్రను అభివృద్ధి చేయడానికి ముందు మేకర్స్ ఎటువంటి పరిశోధన చేయలేదని అన్నారు.

ఇలా 'ఆది పురుష్' టీజర్ పై ఓవైపు ట్రోల్స్ వస్తుంటే.. మరోవైపు వివాదాలు చెలరేగుతున్నాయి. దీనిపై మేకర్స్ ఎలాంటి వివరణ ఇస్తారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీజర్ విషయంలో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన నేపథ్యంలో.. ఈరోజు హైదరాబాద్ లో బిగ్ స్క్రీన్ మీద ఈ టీజర్ ని ప్రదర్శించాలని చిత్ర బృందం నిర్ణయించుకుందని వార్తలు వస్తున్నాయి. స్మాల్ స్క్రీన్ కు పెద్ద స్క్రీన్ పై 3డీలో వీక్షించడానికి తేడా ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, 'ఆది పురుష్' చిత్రాన్ని టీ-సిరీస్ బ్యానర్ లో భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. తెలుగు - హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమాకి పాన్ ఇండియా స్థాయిలో అని ప్రధాన భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒక్క టీజర్ తోనే ఈ సినిమాపై ఇంత రచ్చ జరుగుతుంటే.. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.