Begin typing your search above and press return to search.

బండ్ల బాబూ.. ఈ బాదుడేంటి?

By:  Tupaki Desk   |   15 Sep 2017 5:26 AM GMT
బండ్ల బాబూ.. ఈ బాదుడేంటి?
X
ఒక టైంలో వరుసగా భారీ సినిమాలు చేశాడు బండ్ల గణేష్. కానీ ‘టెంపర్’ తర్వాత అనుకోకుండా గ్యాప్ తీసుకున్నాడు. రెండున్నరేళ్లుగా సినిమా ఊసే ఎత్తట్లేదు. అతడితో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదా.. లేక ఇతనే సినిమాలు చాలించేశాడా అన్నది అర్థం కావడం లేదు. మధ్యలో మలయాళ బ్లాక్ బస్టర్ ‘టు కంట్రీస్’ రీమేక్ హక్కులు తీసుకున్నట్లుగా వార్తలొచ్చాయి కానీ.. ఆ తర్వాత ‘ఎన్ కౌంటర్’ శంకర్ కు హక్కులు వెళ్లిపోయాయి. దీంతో బండ్ల పరిస్థితేంటో అర్థం కాలేదు. రెండేళ్ల పాటు అసలు వార్తల్లోనే లేకుండా పోయాడు బండ్ల. మధ్యలో అతనిచ్చిన రెండు ఇంటర్వ్యూలు సంచలనం రేపాయి. ఐతే సినిమాల సంగతి మాత్రం తేలలేదు.

ఐతే ఇప్పుడు బండ్ల ట్విట్టర్లో మోత మోగించేస్తున్నాడు. ఓవైపు పవన్ కళ్యాణ్.. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ను ఆకాశానికెత్తేస్తూ ఆ హీరోల్ని.. వాళ్ల అభిమానుల్ని దువ్వే ప్రయత్నం చేస్తున్నాడు. పవన్ మీద బండ్ల అభిమానం గురించి కొత్తగా చెప్పేదేం లేదు. ఐతే కొత్తగా తాను పవన్ కు ఎంత పెద్ద అభిమానినో చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు బండ్ల. ఐదేళ్ల కిందటి ‘గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకలో.. ఈ ఏడాది ‘కాటమరాయుడు’ ఆడియో ఫంక్షన్లో పవన్ గురించి తాను మాట్లాడిన వీడియోల్ని షేర్ చేయడం.. వేర్వేరు సందర్భాల్లో పవన్ గురించి టాలీవుడ్ సెలబ్రెటీలు పొగిడిన వీడియోలు పెట్టడం చేస్తున్నాడు బండ్ల. మరోవైపు ఎన్టీఆర్ విషయంలోనూ తగ్గట్లేదు బండ్ల. ఎన్టీఆర్ కు.. అతడి అభిమానులకు తాను క్షమాపణలు చెప్పిన వీడియో షేర్ చేశాడు. తారక్ కొత్త సినిమా ‘జై లవకుశ’ పోస్టర్ షేర్ చేసి ఇది బ్లాక్ బస్టరే అన్నాడు. ఇలా ఒకేసారి భిన్న ధ్రువాలైన ఇద్దరు హీరోల్ని.. వారి అభిమానుల్ని దువ్వే ప్రయత్నాన్ని ఒక ప్రణాళిక ప్రకారం బండ్ల ఎందుకు నడిపిస్తున్నాడా అన్న డిస్కషన్ నడుస్తోంది సోషల్ మీడియాలో. వాళ్లతో సినిమాలు చేయడానికి అతనెంచుకున్న మార్గమా ఇది?