Begin typing your search above and press return to search.

బండ్ల.. ఎక్కడైనా రచ్చ రచ్చే

By:  Tupaki Desk   |   22 July 2015 11:43 AM GMT
బండ్ల.. ఎక్కడైనా రచ్చ రచ్చే
X
బండ్ల గణేష్ అంటేనే ఏదో ఒక హంగామానో, వివాదమో ఉండాల్సిందే. అలా లేకుంటే బండ్లకు నిద్ర పట్టదేమో. బండ్ల సినిమా ఒకటి నిర్మాణంలో ఉందంటే దాని చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం వార్తల్లో నిలుస్తుంటుంది. ఐతే మనోడు ‘టెంపర్’ తర్వాత సినిమా ఏదీ తీయలేదు. అయినా అతడి గురించి వార్తలు మాత్రం ఆగలేదు. సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్లో దాసరి వ్యాఖ్యలపై కౌంటర్లు.. చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన ట్వీట్లు.. సచిన్ జోషితో గొడవ.. ఇలా ఏదో ఒక వ్యవహారంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు బండ్ల. తాజాగా టి.సుబ్బిరామిరెడ్డి జాతీయ అవార్డుల కార్యక్రమానికి వచ్చి చేయాల్సిన రచ్చంతా చేశాడు.

వేదిక మీద చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ ముగ్గురూ ఉంటే.. నేరుగా వెళ్లి చిరంజీవి కాళ్లమీద పడిపోయాడు బండ్ల. చేస్తే ముగ్గురికీ పాదాభివందనం చేయాలి, లేదంటే సైలెంటుగా ఉండాలి. అసలే మోహన్ బాబు మహా కోపిష్టి. చిరుతో ఆయనకు విభేదాలున్నాయి. బాలయ్య కూడా బండ్ల తీరుతో నొచ్చుకున్నట్లే కనిపించాడు. చిరంజీవి మీద బండ్లకు ఎంత అభిమానం ఉందో అందరికీ తెలుసు. మళ్లీ వేదిక మీద కూడా చాటుకోవాలా? మొత్తానికి ఈ వ్యవహారం మూడు రోజులుగా టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడిప్పుడే ఆ వేడి చల్లారుతుంటే.. పెద్ద వేదాంతిలా ఇప్పుడింకో ట్వీట్ చేశాడు గురుడు. ‘‘అందరికీ పాదాభివాదం అంటే అడుక్కోవడం అంటారు. నచ్చినవారికి చేస్తే దాన్ని అభిమానం అంటారు’’ అన్నది బండ్ల ట్వీట్. ఈ ట్వీట్ ను ఎలా అర్థం చేసుకుంటారన్నది మీ ఇష్టం.