Begin typing your search above and press return to search.

బండ్ల లైవ్ క్లారిఫికేషన్.. అట్లుంటది అన్నతోని..!

By:  Tupaki Desk   |   1 Oct 2022 4:46 PM GMT
బండ్ల లైవ్ క్లారిఫికేషన్.. అట్లుంటది అన్నతోని..!
X
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తన వ్యవహారశైలితో తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఏదైనా ముక్కుసూటిగా మనసుకు నచ్చినట్లు మాట్లాడే బండ్ల.. అప్పుడప్పుడు వివాదాలు కొనితెచ్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో నెటిజన్లకు ట్రోలింగ్ స్టఫ్ గా మారుతుంటారు.

అందుకే బండ్ల గణేష్ ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా.. ఏదొక కాంట్రావర్సీ గురించి మాట్లాడతారని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఆ వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల.. తనదైన శైలిలో సమాధానాలు చెప్పి ఫ్యాన్స్ ని మరోసారి ఆశ్చర్యపరిచాడు.

తాజాగా బండ్ల గణేష్ ను జర్నలిస్టు నాగరాజు ఇంటర్వ్యూ చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. రీసెంట్ గా మరో ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీకు ఫోన్‌ లో వార్నింగ్ ఇవ్వడం నిజం కాదా? అని బండ్ల ను ప్రశ్నించారు.

దీనికి బండ్ల గణేష్ స్పందిస్తూ.. 'ఈ డబ్బా మాటలు ఎవడన్నా నీకు చెప్పింది.. నాకు అనిల్ కుమార్ యాదవ్ వార్నింగ్ ఇచ్చాడా?. ఇప్పుడే క్లారిటీ ఇస్తా ఆగు..' అంటూ అప్పుడే మాజీ మంత్రికి ఫోన్ చేశారు. స్పీకర్ ఆన్ లో పెట్టి అదే విషయాన్ని అనిల్ యాదవ్ ను అడిగారు.

అనిల్ కుమార్ దానికి ఏం సమాధానం చెప్పాడనేది ప్రోమోలో చూపించనప్పటికీ.. ‘ఐ లవ్ యు అన్నా.. బై’ అని బండ్ల గణేష్ చెప్పడాన్ని మనం గమనించవచ్చు. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'అట్లుంటది బండ్లన్నతోని' అంటూ ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. దీనికి గణేష్ సైతం ట్విట్టర్ లో స్పందించారు.

ఈ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ రాజకీయ విషయాలు.. ఇండస్ట్రీ సంగతుల గురించి మాట్లాడినట్లు రెండు ప్రోమోలను బట్టి అర్థమవుతుంది. పూరీ జగన్నాథ్ మీద చేసిన కామెంట్స్.. 'మా' ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవడం.. జీవిత రాజశేఖర్ పై ఆరోపణలు చేయడంపై స్పందించినట్లు తెలుస్తోంది.

'మా' ఎన్నికల సమయంలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు పై నాగబాబు చేసిన సంచలన వ్యాఖ్యల గురించి.. అలానే పోసాని కృష్ణ మురళిని ఉద్దేశిస్తూ బండ్ల గతంలో చేసిన కామెంట్స్ పైనా ఆయన మాట్లాడారు. నా మైండ్ ఏమి చెప్తే అదే మాట్లాడతా అంటూ సీరియస్ గా అనడాన్ని చూడొచ్చు.

ఇందులో బండ్ల నోటి నుంచి చాలా అభ్యంతరకర పదాలు దొర్లినట్లు ప్రోమోలో బీప్ సౌండ్ ని బట్టి తెలుస్తోంది. అయితే చివర్లో ఇంటర్వ్యూ పూర్తి కాకముందే మైక్ తీసేసి వెళ్లిపోతున్నట్లు చూపించారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందనేది ఫుల్ ఇంటర్వ్యూ వస్తే అర్థమవుతుంది.

కాగా, కమెడియన్ గా.. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా రాణించిన బండ్ల గణేశ్.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 'సర్కారు వారి పాట' చిత్రంతో మళ్లీ తెర మీదకు తిరిగొచ్చిన బండ్ల.. ఇటీవల 'డేగల బాబ్జీ' సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.