Begin typing your search above and press return to search.

సోష‌ల్ మీడియా వేదిక‌గా బండ్ల కొత్త చ‌ర్చ‌

By:  Tupaki Desk   |   19 Oct 2021 7:32 AM GMT
సోష‌ల్ మీడియా వేదిక‌గా బండ్ల కొత్త చ‌ర్చ‌
X
బ్లాక్ బ‌స్ట‌ర్ ప్రొడ్యూస‌ర్ గా పేరున్న బండ్ల గ‌ణేష్ ఏది చేసినా సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంటుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ కు వీర విధేయుడిగా భ‌క్తుడిగా పేరున్న బండ్ల ఇటీవ‌ల అదే విధేయ‌త‌ని మెగాస్టార్ చిరంజీవిపైనా ప్ర‌ద‌ర్శించ‌డం మొద‌లుపెట్టారు. ఇటీవ‌ల బండ్ల గ‌ణేష్ రెండ‌వ సారి క‌రోనా బారిన ప‌డి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన విష‌యం తెలిసిందే.

ఈ స‌మ‌యంలో బండ్ల గ‌ణేష్ కు బెడ్ కూడా దొర‌క‌లేదు.. అలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితిలో బండ్ల‌కు బెడ్ ఇప్పించి అత‌న్ని కాపాడ‌టంలో మెగాస్టార్ ప్ర‌ధాన పాత్ర పోషించారు. అప్ప‌టి నుంచి బండ్ల ప‌వ‌న్ కే కాదు మెగాస్టార్ చిరంజీవికి కూడా వీర విధేయుడిగా మారిపోయారు. చిరంజీవిని ఎవ‌రు ఏమ‌న్నా.. విమ‌ర్శ‌లు గుప్పించినా... వారిపై బండ్ల విరుచుకుప‌డుతున్నారు. తాజాగా `మా` ఎన్నిక‌ల వేల ఓ టీవీ ఛాన‌ల్ నిర్వ‌హించిన చ‌ర్చ‌లో ఇండ‌స్ట్రీకి కొత్త పెద్ద అవ‌స‌ర‌మా? అని అడిగితే .. చిరంజీవి వుండ‌గా.. ఇండ‌స్ట్రీకి ఆయ‌న అన్ని విధాలుగా అండ‌గా నిలుస్తుండ‌గా ఇంకెవ‌రూ అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు బండ్ల‌.

ఇటీవ‌ల `మా` ఎన్నిక‌ల్లో `మా` అధ్య‌క్షుడిగా మంచు విష్ణు విజ‌యం సాధించిన నేప‌థ్యంలో చిరుని టార్గెట్ చేస్తూ మోహ‌న్ బాబు- న‌రేష్ చేసిన వ్యాఖ్య‌లు ఇటీవ‌ల మెగా అభిమానుల్లో ఆగ్ర‌హాన్ని తెప్పించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా బండ్ల గ‌ణేష్ పెట్టిన పోస్ట్ వైర‌ల్ గా మారింది. స‌హ‌నానికి ఒక హ‌ద్దుంటుంది. ఓర్పు కూడా ఉంటుంది. ఆ స‌హ‌నం.. ఓర్పు ఎదురుతిరిగితే ప్ర‌ళ‌యం పుడుతుంది`` అంటూ బండ్ల వేసిన బాంబు ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది,

ముందే పోటీ నుంచి త‌ప్పుకున్నారు కానీ..!

ఇటీవ‌ల `మా` ఎన్నిక‌ల్లో మాట‌ల‌తోనే భ‌వంతులు నిర్మించేయ‌డం ఎలానో చూపించారు బండ్ల‌. ప్ర‌కాష్ రాజ్.. విష్ణు ప్ర‌క‌ట‌న‌లను మించి బండ్ల ప్రామిస్ లు చేసారు. తాను జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా గెలిస్తే ఏం చేస్తాడో చెప్పిన తీరు ఆక‌ట్టుకుంది. నన్ను గెలిపిస్తే కెసిఆర్ తో మాట్లాడి 100 ఇళ్ళు కట్టిస్తానని కేవ‌లం జూబ్లీహిల్స్ లో మా భ‌వంతి నిర్మిస్తే స‌రిపోద‌ని పేద ఆర్టిస్టుల‌కు ఇండ్లు నిర్మించాల‌ని బండ్లగణేష్ అన్నారు. తాను నిర్మించి ఇస్తాన‌ని ప్రామిస్ చేసారు. మా ఎన్నిక‌ల్లో జనరల్ సెక్రెటరీ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన‌ బండ్ల గణేష్ విసిరిన‌ పంచ్ లు చ‌లోక్తులు సంచ‌ల‌నంగా మారాయి..త‌న‌కు మా మెంబ‌ర్ల నుంచి సంపూర్ణ మ‌ద్ధ‌తు ఉంద‌ని ప‌ర‌మేశుని మ‌ద్ధ‌తు ఉంద‌ని ప్ర‌క‌టించిన బండ్ల వ‌రుస పంక్తుల‌తో వేడెక్కించారు. నేను గెలవడం పక్కా .. ఇంతకు ముందు గెలిచినా వాళ్ళు ఏమి చేయలేదని అన్నారు.

మా భ‌వంతిని జూబ్లీహిల్స్‌ లాంటి ప్రాంతంలో ఇంద్రభవనం కడతామంటే కుదరదు. దాంతో పాటు వంద మంది పేద కళాకారులకు డబుల్‌ బెడ్ రూమ్‌ ఇళ్లు కూడా కట్టించాలి. సీఎం కేసీఆర్‌ దగ్గరకు వెళ్లి మహా ప్రభో మాకు స్థలం ఇప్పించండి.. మా డబ్బులతో పేద కళాకారులకు ఇళ్లు కట్టిస్తాం.. అని అభ్య‌ర్థిస్తాన‌ని ఆయ‌న కాద‌న‌ర‌ని న‌మ్మ‌కం వ్య‌క్తం చేశారు బండ్ల‌. పేద కళాకారులకు ఇళ్ళు కట్టడానికి కెసిఆర్ ని స్థలం ఇమ్మని అడుగుతానని.. బండ్ల అన్నారు. అయితే బండ్ల ఎన్ని ప్రామిస్ లు చేసినా కానీ చివ‌రి నిమిషంలో తుస్సుమ‌నిపించారు. అస‌లు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా సైడైపోయారు. చివ‌రికి అప్ప‌టివ‌ర‌కూ చేసిన హంగామా అంతా నీరుగారిపోయింది. బండ్ల ఆరంభశూర‌త్వం అంటూ కామెంట్లు వినిపించాయి.