Begin typing your search above and press return to search.

కుల గజ్జిని ఇండస్ట్రీకి ఆపాదిస్తారా?.. వైసీపీ నేతకు బండ్ల స్ట్రాంగ్ కౌంటర్..!

By:  Tupaki Desk   |   11 Jan 2022 8:30 AM GMT
కుల గజ్జిని ఇండస్ట్రీకి ఆపాదిస్తారా?.. వైసీపీ నేతకు బండ్ల స్ట్రాంగ్ కౌంటర్..!
X
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద పలువురు సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేయడం.. దీనికి వైసీపీ నేతలు తిరిగి కౌంటర్ ఎటాక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం అంతా ఏపీ సర్కారుకు టాలీవుడ్ కు మధ్య కోల్డ్ వార్ జరుగుతోందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

సోమవారం వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 'సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు' అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలితో పాటుగా సినీ ప్రముఖులు - సినీ అభిమానులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రసన్న కుమార్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

దీనిపై చర్చ కొనసాగుతుండగా లేటెస్టుగా వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. 'పుష్ప' సినిమాలో విలన్ పాత్రదారుల పేరు చివర "రెడ్డి" ఉండడంపై వ్యతిరేకత వ్యక్తపరచిన ఆయన.. నిర్మాతలు కావాలనే ఇలా చేసారని అన్నారు. ఈ నేపథ్యంలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పందిస్తూ వైకాపా నేతకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

రవిచంద్రారెడ్డి ఓ టీవీ ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ.. 'పుష్ప' సినిమాలో ముగ్గురు విలన్లకు కొండారెడ్డి - జక్కా రెడ్డి - జాలి రెడ్డి అనే పేర్లు కావాలనే పెట్టారని అభిప్రాయ పడ్డారు. ఈ సినిమా నిర్మాతలు చంద్రబాబు నాయుడి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని.. హీరో కాపు సామాజిక వర్గానికి చెందిన వారని అన్నారు.

చంద్రబాబు నాయుడి భావజాలాన్ని కావాలనే 'పుష్ప' నిర్మాతలు ప్రజలపై రుద్దుతున్నారని.. ఉద్దేశపూర్వకంగానే ప్రతినాయకులకు రెడ్డి పేర్లు పెట్టారని వైకాపా అధికార ప్రతినిధి ఆరోపించారు. అయితే దీనిపై బండ్ల గణేష్ స్పందిస్తూ.. సైరా నరసింహా రెడ్డి - ఇంద్ర సేనారెడ్డి - సమర సింహ రెడ్డి అని హీరో పాత్రల పేర్లు పెట్టి సినిమాలు తీసారనే విషయాన్ని గుర్తు చేశారు. కుల గజ్జిని ఇండస్ట్రీకి ఎందుకు ఆపాదిస్తారని ప్రశ్నించారు.

'సమరసింహా రెడ్డి' సినిమా తీసిన బాలకృష్ణ - దర్శకుడు బి.గోపాల్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారని.. అయినప్పటికీ రెడ్డి వర్గానికి చెందిన పేరు పెట్టి హీరోయిజం చూపించారని బండ్ల తెలిపారు. అలానే 'ఇంద్ర' సినిమాలో ఇంద్రసేనారెడ్డి పాత్ర పోషించిన చిరంజీవి కాపు సామాజిక వర్గం.. నిర్మాత అశ్వినీదత్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారని గుర్తు చేశారు. 'సైరా నరసింహారెడ్డి' పేరుతో చిరంజీవి సినిమా తీసినప్పుడు వీళ్లకు ఇవన్నీ గుర్తు రాలేదా అని బండ్ల గణేష్ ప్రశ్నించారు. కరోనా సోకడంతో ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్న బండ్ల.. దీనికి సంబంధించిన ట్వీట్స్ ని కూడా రీట్వీట్ చేస్తున్నారు.