Begin typing your search above and press return to search.

పిక్ టాక్: బేబమ్మతో 'బంగార్రాజు' ప్రేమ ముచ్చట్లు..!

By:  Tupaki Desk   |   29 Nov 2021 5:30 PM GMT
పిక్ టాక్: బేబమ్మతో బంగార్రాజు ప్రేమ ముచ్చట్లు..!
X
'మనం' తర్వాత మరోసారి తండ్రీకొడుకులు కింగ్ అక్కినేని నాగార్జున - యువసామ్రాట్ నాగచైతన్య సందడి చేయడానికి వస్తున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ లో బంగార్రాజుగా అలరించిన నాగ్.. ఈసారి చిన బంగార్రాజు చైతూతో కలిసి రాబోతున్నారు.

కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''బంగార్రాజు''. 'సోగ్గాడు మళ్ళీ వచ్చాడు' అనేది దీనికి ఉపశీర్షిక. ఇది బ్లాక్ బస్టర్ ‘సోగ్గాడే చిన్నినాయనా’ కు సీక్వెల్. ఇందులో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ.. చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇటీవలే 'బంగార్రాజు' సినిమా నుంచి విడుదలైన ‘లడ్డుండా’ పాట - కృతి లుక్ ఆకట్టుకున్నాయి. అలానే నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టీజర్ లో చిన బంగార్రాజు గా చైతూ అదరగొట్టేసాడు. స్టైలింగ్ లో మేనరిజమ్స్ లో సోగ్గాడిని గుర్తు చేస్తూ సూపర్‌ స్టైలిష్‌ గా కనిపించి అలరించారు.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నుంచి తాజాగా మరో అప్డేట్ వచ్చింది. 'బంగార్రాజు' చిత్రంలోని 'నా కోసం' అనే సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. డిసెంబర్ 1వ తేదీన ఉదయం 11.12 గంటలకు ఈ పాట టీజర్ ని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

'నా కోసం' పాటకు అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చగా.. లిరిసిస్ట్ బాలాజీ సాహిత్యం అందించారు. మ్యూజిక్ సంచలనం సిద్ శ్రీరామ్ ఈ గీతాన్ని ఆలపించారు. బంగార్రాజు కోసం అనూప్ - సిద్ శ్రీరామ్ కలసి మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసినట్లు చిత్ర బృందం తెలిపింది.

ఈ సందర్భంగా నాగచైతన్య - కృతి శెట్టి లకు సంబంధించిన ఓ సరికొత్త పోస్టర్ ని మేకర్స్ విడుదల చేశారు. ఇద్దరూ ఓ చోట కూర్చొని నవ్వుతూ ముచ్చట్లు చెప్పుకుంటున్నట్లు కనిపిస్తున్న ఈ ఫోటో ఆకట్టుకుంటోంది. తొలిసారిగా కలసి నటిస్తున్న చై-కృతి జోడీ బాగుంది. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరినట్లు అర్థం అవుతోంది.

బంగార్రాజు బుద్దులతో ఊడిపడిన చిన బంగార్రాజుకు మన నాగలక్ష్మీకి మధ్య సాగిన ప్రేమకథ ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి. బ్యానర్ పై అక్కినేని నాగార్జున 'బంగార్రాజు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి కథ అందిస్తుండగా.. సత్యానంద్ స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. జె యువరాజ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో చలపతి రావు - రావు రమేష్ - బ్రహ్మాజీ - వెన్నెల కిషోర్ - ఝాన్సీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే 'బంగార్రాజు' విడుదల తేదీపై క్లారిటీ రానుంది.