Begin typing your search above and press return to search.

లోకల్ సూపర్ హీరో సినిమాని అందుకే రీమేక్ చేయలేదు..!

By:  Tupaki Desk   |   23 Nov 2022 3:46 AM GMT
లోకల్ సూపర్ హీరో సినిమాని అందుకే రీమేక్ చేయలేదు..!
X
సూపర్ హీరో సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ వచ్చిన స్పైడర్ మ్యాన్ - బ్యాట్ మ్యాన్ - సూపర్ మ్యాన్ లాంటి చిత్రాలన్నీ దాదాపుగా విశేషమైన ఆదరణ దక్కించుకున్నాయి. మనదేశంలోనూ సూపర్ హీరోల సినిమాలను విపరీతంగా చూస్తుంటారు.

ఇండియన్ స్క్రీన్ మీద సూపర్ హీరో పాత్రలు చాలా తక్కువగా వచ్చాయి. బుల్లితెరపై 'శక్తిమాన్' అలరిస్తే.. వెండితెరపై 'క్రిష్' ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఫస్ట్ ఒరిజినల్ సూపర్ హీరో "హను - మాన్" వస్తున్నాడు.

అయితే 'హను - మాన్' కంటే ముందుగా 'మిన్నల్ మురళి' అనే లోకల్ సూపర్ హీరో ప్రేక్షకులను అలరించాడు. టోవినో థామస్ లీడ్ రోల్ లో తెరకెక్కిన మలయాళ సూపర్ హీరో మూవీ ఇది. బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కింది.

నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో నేరుగా అన్ని ప్రధాన భాషల్లో 'మిన్నల్ మురళి' సినిమా విడుదలైంది. మాతృక మలయాళంతో పాటు డబ్బింగ్ వెర్షన్ ద్వారా తెలుగులోనూ విశేషంగా ఆకట్టుకుంది. మెరుపు దెబ్బకి సూపర్ పవర్స్ దక్కించుకున్న ఇద్దరి కథే ఈ చిత్రం.

ఒకరు ఆ శక్తులను మంచి కోసం ఉపయోగిస్తే.. మరికొరు దుర్వినియోగం చేసి ప్రజలని ఇబ్బందులకు గురి చేస్తాడు. హీరో పాత్ర మిన్నల్ మురళి తనకున్న అతీంద్రీయ శక్తులతో ప్రజలను ఎలా కాపాడాడు అనేది ఈ సినిమా కథాంశం.

ఇటీవల కాలంలో మలయాళంలో హిట్టయిన చిత్రాలను పోటీ పడి మరీ రైట్స్ తీసుకొని ఇతర భాషల్లోకి రీమేక్ చేస్తున్నారు. కానీ 'మిన్నల్ మురళి' సినిమా రీమేక్ హక్కులను ఎవరికీ అమ్మకుండా.. స్ట్రెయిట్ గా నెట్ ఫ్లిక్స్ డిజిటల్ వేదిక ద్వారా అన్ని భాషల డబ్బింగ్ వెర్షన్లను స్ట్రీమింగ్ చేశారు.

తాజాగా దర్శకుడు బాసిల్ జోసెఫ్ మాట్లాడుతూ 'మిన్నాల్ మురళీ' రీమేక్ హక్కులను తాము విక్రయించలేదని.. అందుకే రీమేక్స్ కు అవకాశం లేదని చెప్పాడు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "జయ జయ జయ హే" మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాలను వెల్లడించాడు.

"కేరళకు చెందిన మురళి సూపర్ హీరో కావాలని మేము కోరుకున్నాము. టోవినో థామస్ మాత్రమే అలా ఉండాలని అనుకున్నాం. అందుకే రీమేక్ రైట్స్ అమ్మలేదు. త్వరలో సీక్వెల్ తో వస్తాం'' అని దర్శకుడు బాసిల్ తెలిపారు.

హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాలను ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారే తప్ప.. ఎప్పటికీ రీమేక్ చేయరు. అలానే మిన్నల్ మురళి పాత్ర కూడా కేరళకు చెందిన సూపర్ హీరోగా ఉండిపోవాలని మేకర్స్ కోరుకున్నారు. ఈ క్రమంలో సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పుడు తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న "హను-మాన్" మూవీ కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. మామూలు యువకుడు హనుమంతుడి నుంచి కొన్ని అతీంద్రియ శక్తులను పొంది సూపర్‌ హీరోగా మారడం అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మరి మన టాలీవుడ్ సూపర్ హీరో ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.