Begin typing your search above and press return to search.

'బతికేయ్ హాయిగా' అంటున్న రాజ్ తరుణ్!

By:  Tupaki Desk   |   15 Nov 2021 4:42 AM GMT
బతికేయ్ హాయిగా అంటున్న రాజ్ తరుణ్!
X
రాజ్ తరుణ్ హీరోగా 'అనుభవించు రాజా' సినిమా రూపొందింది. 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో ఆయనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ వారు ఈ సినిమాను నిర్మించారు. శ్రీనివాస్ గవిరెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 'అనుభవించు రాజా' అనే టైటిల్ ఈ సినిమా కంటెంట్ ఏమిటనేది చెప్పేస్తుంది. జీవితం చాలా చిన్నది .. అనుభవించవలసింది చాలా ఉన్నది .. అనవసరంగా కాలం వృథా చేయకోయ్ అనే కాన్సెప్టుతో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన ప్రచార చిత్రాలు ఈ విషయాన్నే చెప్పాయి.

ఇది గ్రామీణ నేపథ్యంలో నడిచే ఒక విలాస పురుషుడి కథ .. జల్సారాయుడి కథ. హీరో చాలా శ్రీమంతుడు .. తరగని ఆస్తి .. సరదాలలో తేలిపోవాలనే ఆరాటం. ఆ ప్రయత్నాల్లో భాగంగా కోడి పందాలు .. ఎడ్ల పందాలు .. పేకాట .. మందు .. మగువ .. ఇలా పల్లెల్లో అందుబాటులో ఉండే అన్ని సుఖాలను అనుభవించాలనే తాపత్రయంతో హీరో ఉంటాడు. అలాంటి హీరో జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనే మలుపులతోనే ఈ కథ నడుస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాటను రిలీజ్ చేశారు.

"బతికేయ్ హాయిగా .. ఇది మళ్లీ మళ్లీ రాదుగా, ప్రతిదీ అంతలా భూతద్దంలో నుంచి చూడక .. నచ్చితే కలిపేసుకుపోరా .. వదులుకోక ఏ ఒక్కరినీ, ఏయ్ నువ్వు సర్దుకుపోరా నచ్చకున్నా గాని" అంటూ ఈ పాట సాగుతోంది. ఈ జనరేషన్ కి కనెక్ట్ అయ్యే పాటనే ఇది. "చుట్టూ ఒకసారి చూడు .. ఎవడూ సుఖపడుతూ లేడు .. నీలాగే వాడు కూడా తడబడుతున్నాడు"

.. "సరదాగా పలకరిస్తే చివురునవ్వే చిలకరిస్తే .. వద్దంటూ ఎవ్వడైనా దూరంగుంటాడా" అనే పంక్తులను భాస్కర్ భట్ల బాగా రాశాడు. సర్దుకుపోతే జీవితం సరదాగా సాగిపోతుందనే సందేశమే ఈ పాట.

తేలికైన పదాలతో భాస్కర్ భట్ల చేసిన పద ప్రయోగాలు బాగున్నాయి. గోపీ సుందర్ బీట్ చాలా బాగుంది .. ఈ జనరేషన్ కి ఒక విషయాన్ని ఎంత తేలికగా .. ఎంత బాగా చెప్పాలో అంత బాగా ఆయన ట్యూన్ చేశాడు. ఇక ఈ పాటను అలవోకగా పాడేస్తూ దీపు మరింతగా ఆకట్టుకునేలా చేశాడు. ఈ మధ్య కాలంలో సంగీతం .. సాహిత్యం పరంగా సమపాళ్లలో సాగిన పాటగా దీనిని గురించి చెప్పుకోవచ్చు. ఇంతవరకూ వరకూ గ్రామీణ నేపథ్యంలో చూపిస్తూ వచ్చిన రాజ్ తరుణ్ ని ఈ సాంగ్ లో పట్నంలో జాబ్ చేస్తున్నట్టుగా చూపించి .. సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న రాజ్ తరుణ్ నిరీక్షణ, ఈ సాంగ్ తో ఫలిస్తుందేమో చూడాలి .