Begin typing your search above and press return to search.

బతుకమ్మకు గౌరవం: ఏఆర్ రెహమాన్, గౌతమ్ మీనన్ కలిసి పాట రూపకల్పన

By:  Tupaki Desk   |   3 Oct 2021 8:30 AM GMT
బతుకమ్మకు గౌరవం: ఏఆర్ రెహమాన్, గౌతమ్ మీనన్ కలిసి పాట రూపకల్పన
X
తెలంగాణలోనే అతి పెద్ద పండుగ బతుకమ్మ. ఇక్కడి ఆడపడుచులు ఆడుకునే ప్రసిద్ధ పూల పండుగ. ఇది ప్రతి సంవత్సరం తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో దసరా సందర్భంగా జరుపుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ పండుగ సందర్భంగా చాలా మంది సంగీతకారులు విభిన్న పాటలతో ముందుకు వస్తారు. మొదటిసారిగా బతుకమ్మ పాటకు సంగీతం అందించడానికి లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ముందుకు రావడం సంచలనమైంది.

ప్రఖ్యాత చిత్ర నిర్మాత గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ పాటను తీయడానికి దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఇటీవల వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో పాటల చిత్రీకరణ జరిగింది. చిత్రీకరణ విజయవంతంగా పూర్తయింది. త్వరలో పాటను విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఈ ప్రత్యేక పాట కోసం రెహమాన్ , గౌతమ్ మీనన్‌లను కలిసి తీసుకురావడానికి కృషి చేసింది. తెలంగాణ జాగృతి ద్వారా చొరవ తీసుకున్నారు.

తెలంగాణ జాగృతి అనేది ఒక లాభాపేక్షలేని సంస్థ. కళాకారులతో కలిసి కవిత దీన్ని స్థాపించారు. కళలు, సంస్కృతిని పరిరక్షించడం దీని విధి. ఈ క్రమంలోనే తెలంగాణ పండుగలను ఇది ఎలుగెత్తి చాటుతుంది. వారసత్వం, సాంస్కృతిక పునరుజ్జీవనం.. స్థిరమైన అభివృద్ధి కోసం కృషి చేస్తోంది.ఈ క్రమంలోనే రెహమాన్, గౌతమ్ మీనన్ లతో కలిసి బతుకమ్మ కోసం ఈ పాటను రూపొందిస్తోంది. దీనికి ప్రఖ్యాత దర్శకులు, సంగీత దర్శకులతో ప్లాన్ చేసింది. ఈ పాట గురించి పూర్తి వివరాల కోసం వేచి ఉండండి.