Begin typing your search above and press return to search.

'కాంతారా' సక్సెస్ వెనుక ఆ డైరెక్టర్ కమ్ యాక్టర్ కృషి కూడా ఉందట..!

By:  Tupaki Desk   |   19 Oct 2022 4:16 AM GMT
కాంతారా సక్సెస్ వెనుక ఆ డైరెక్టర్ కమ్ యాక్టర్ కృషి కూడా ఉందట..!
X
కన్నడ సినిమా 'కాంతారా' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ముందుగా శాండిల్ వుడ్ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన ఈ చిత్రం.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

'కాంతారా' చిత్రాన్ని గీతా ఆర్ట్స్ వారు తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేయగా.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లోనే 16.5 కోట్లు వసూలు చేసింది. హిందీలో నాలుగు రోజుల్లో దాదాపు 10 కోట్ల వరకూ రాబట్టి బాలీవుడ్ జనాల దృష్టిని తనవైపు మళ్లించుకుంది.

అగ్ర హీరోల సినిమాలే విఫలమవుతున్న చోట.. ఒక డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయి కలెక్షన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ 'కాంతారా' అనేది కన్నడ నేటివిటీతో సాగే సినిమా. అక్కడి సంస్కృతులు, సంప్రదాయాల ఆధారంగా ఈ వైవిధ్యంగా ఈ సినిమా తీశారు.

రిషబ్ శెట్టి తన అద్భుతమైన నటనతో పాటుగా దర్శకత్వ ప్రతిభతో అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో పతాక సన్నివేశాలను అందరూ కొనియాడుతున్నారు. సినిమా అంతా ఒకెత్తయితే.. క్లైమాక్స్ ఒక్కటీ మరో ఎత్తు అని చెప్పాలి.

నిజానికి 'కాంతారా' సినిమాని పతాక సన్నివేశాలే నిలబెట్టాయి. అదే ఆయువుపట్టుగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా అప్పటి వరకూ ఎలా ఉన్నా చివర్లో ఈ క్లైమాక్స్ కారణంగా ఆడియన్స్ ఒక ప్రత్యేకమైన అనుభూతితో థియేటర్ల నుంచి బయటకు వస్తున్నారు.

అయితే 'కాంతారా' క్లైమాక్స్ విషయంలో రిషబ్ శెట్టి తో పాటుగా టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్ బి.శెట్టి కృషి కూడా ఉందని తెలుస్తోంది. మంచి స్క్రిప్ట్ రాసుకున్న రిషబ్.. పతాక సన్నివేశాల చిత్రీకరణలో స్నేహితుడి సహాయం తీసుకున్నారట.

రిషబ్ శెట్టి - రాజ్ బి.శెట్టి గతంలో 'గరుడ గమన వృషభ వాహన' అనే గ్యాంగ్ స్టర్ డ్రామాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. రాజ్ బి శెట్టి ఇందులో నటించడమే కాదు.. దర్శకత్వం బాధ్యతలు కూడా నిర్వహించారు. రిషబ్‌ తో ఉన్న ఫ్రెండ్షిప్ తో 'కాంతార' మేకింగ్‌ ను రాజ్ దగ్గరుండి చూసుకున్నాడని తెలుస్తోంది.

క్లైమాక్స్ సీన్స్ లో రిషబ్ పూర్తిగా తన పెర్ఫామెన్స్ మీద దృష్టిపెట్టేలా.. ఆ బ్లాక్ ను రాజ్ శెట్టి అద్భుతంగా తీర్చిదిద్దడంలో తనవంతు సపోర్ట్ చేసారట. అందుకే 'కంతారా' బ్లాక్ బస్టర్ సక్సెస్ లో 'గరుడ గమన వృషభ వాహన' దర్శకుడికి కూడా క్రెడిట్ దక్కుతుందని అంటున్నారు.

ఏదేమైనా ఓటీటీలో వచ్చే డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ హీరో రిషబ్ శెట్టి.. ఇప్పుడు 'కాంతారా' చిత్రంతో టాలీవుడ్ లోనూ సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు. ఇందులో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా.. అచ్యుత్ కుమార్ - కిషోర్ కుమార్ - సుచాన్ శెట్టి - ప్రమోద్ శెట్టి ఇతర పాత్రలు పోషించారు. అజనీష్ లోక్‌ నాథ్ సంగీతం సమకూర్చారు. 'కేజీఎఫ్‌' తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.