Begin typing your search above and press return to search.

మాస్ హీరో తమ్ముడి ఎంట్రీ షురూ!

By:  Tupaki Desk   |   4 Jan 2021 3:30 AM GMT
మాస్ హీరో తమ్ముడి ఎంట్రీ షురూ!
X
టాలీవుడ్లో యువ హీరోల జోరు పెరుగుతోంది. ఉన్న హీరోల మధ్యనే పోటీ చాలా గట్టిగానే ఉందని అనుకుంటూ ఉంటే, ఒకే ఇంటి నుంచి ఎక్కువమంది హీరోలు వచ్చేస్తున్నారు. ఆల్రెడీ హీరోలుగా మంచి క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరోలు .. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే తమ తమ్ముళ్లను రంగంలోకి దింపుతున్నారు. ఆ వైపు ఒక లుక్ వేస్తే .. విజయ్ దేవరకొండ చేసినవి తక్కువ సినిమాలే అయినా, ఆయనకి వచ్చిన క్రేజ్ ఎక్కువ. దాంతో ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా రంగంలోకి దిగిపోయాడు. హీరోగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు.

ఇక సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా 'ఉప్పెన' సినిమాతో బరిలోకి దిగిపోయాడు. ప్రస్తుతం ఆ సినిమా విడుదలకి ముస్తాబవుతోంది. ఈ లోగానే వైష్ణవ్ తేజ్ వేరే కథలను లైన్ లో పెడుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. కుర్రాడు స్పీడ్ మీదే ఉన్నాడని అంటున్నారు మరి!. మాస్ హీరోగా మంచి మార్కులు కొట్టేసిన బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట. ఈ మాట ఎవరో చెబితే నిజమో .. కాదో అనుకునేవాళ్లం. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ తాజా ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిన 'అల్లుడు అదుర్స్' సినిమా, త్వరలో థియేటర్స్ కి రానుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పాడు. ఆయన తమ్ముడు 'గణేశ్' హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. కానీ ఎందుకో కాస్త టైమ్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు రైట్ టైమ్ అనిపించిందేమో రంగంలోకి దూకేస్తున్నాడు. ఈ ఏడాదిలో తన బాలీవుడ్ ఎంట్రీ ఉండనుందని చెప్పిన శ్రీనివాస్, హీరోగా తన తమ్ముడి టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశాడు. మొత్తానికి బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడన్న మాట.

కాకపోతే ఒకే ఇంటి నుంచి వచ్చిన ఇద్దరు హీరోల్లో ఫస్టు వచ్చినవారే నిలబడిన సందర్భాలు ఎక్కువ. ఎందుకో తెలియదు గానీ రెండవసారి వచ్చినవారు ఎక్కువగా నిలబడింది లేదు. టాలీవుడ్లో చూసుకుంటే చిరూ - పవన్, కోలీవుడ్ లో తీసుకుంటే సూర్య - కార్తి తప్ప ఎవరూ పెద్దగా స్టార్ డమ్ ను అందుకున్న దాఖలాలు కనిపించవు. మరి కొత్తగా ఎంట్రీ ఇస్తున్న ఈ కుర్ర హీరోలు ఈ సెంటిమెంట్ ను సెటిల్ చేసి పంపించేసి, కొత్త రికార్డులను పేజీల కొద్దీ రాసేస్తారేమో చూడాలి.