Begin typing your search above and press return to search.

బెల్లంకొండ శ్రీను మీద అంత నమ్మకమా?

By:  Tupaki Desk   |   17 Dec 2015 5:03 AM GMT
బెల్లంకొండ శ్రీను మీద అంత నమ్మకమా?
X
టాలీవుడ్ లో పెద్ద ఫ్యామిలీల బ్యాగ్రౌండ్ లేకుండా హీరోగా అరంగేట్రం చేసి.. తొలి సినిమాతోనే ప్రకంపనలు సృష్టించాడు బెల్లంకొండ శ్రీనివాస్. అతడి తొలి సినిమాకు బెల్లంకొండ సురేష్ రూ.35 కోట్ల బడ్జెట్ పెట్టడమూ షాకింగే.. ఈ చిత్రానికి వినాయక్ దర్శకత్వం వహించడమూ షాకింగే.. అందులో సమంత హీరోయిన్ గా నటించడం, తమన్నా ఐటెం సాంగ్ చేయడమూ షాకింగే.. విడుదల తర్వాత రూ.20 కోట్ల దాకా వసూళ్లు రాబట్టడమూ షాకింగే. మొత్తానికి తొలి సినిమాతో టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయిపోయాడు అప్పట్లో శ్రీనివాస్. ఐతే శ్రీను రెండో సినిమా మొదలు పెట్టడానికి మాత్రం చాలానే టైం పట్టింది. ముందు బోయపాటి శ్రీనుతో సినిమా అనుకుని.. తర్వాత భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తమిళ హిట్ ‘సుందర పాండ్యన్’ రీమేక్ కు ఫిక్సయ్యారు.

‘స్పీడున్నోడు’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా చడీ చప్పుడు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంది. జనవరిలోనే సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఐతే శ్రీనివాస్ తొలి సినిమాకు వినాయక్ దర్శకుడు కాబట్టి ఆ క్రేజ్ రావడం.. బిజినెస్ బాగానే జరగడంలో ఆశ్చర్యం లేదు. కానీ భీమనేని లాంటి డైరెక్టర్ని పెట్టుకున్నప్పటకీ.. ‘స్పీడున్నోడు’కు ఆశ్చర్యకరమైన స్థాయిలో బిజినెస్ అయినట్లు సమాచారం. ఈ సినిమా మీద బయ్యర్లు రూ.18 కోట్ల దాకా పెట్టుబడి పెడుతున్నారట. ఇంకా రిలీజ్ కు చాలా టైం ఉండగానే బిజినెస్ అయిపోయిన్టలు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నైజాం ఏరియా హక్కుల్ని రూ.5 కోట్ల పైనే అమ్మారట. ఆంధ్రా, సీడెడ్ కలిపి రూ.12 కోట్ల దాకా బిజినెస్ అయినట్లు సమాచారం. భీమనేని ఇంతకుముదు తీసిన ‘సుడిగాడు’ పెద్ద హిట్టవడం.. రీమేక్ సినిమాల్లో ఆయన ట్రాక్ రికార్డు.. శ్రీనివాస్ తొలి సినిమా బాగా ఆడటం.. ఇవన్నీ ‘స్పీడున్నోడు’ మీద కాన్ఫిడెన్స్ పెంచినట్లున్నాయి.