Begin typing your search above and press return to search.

బెల్లంకొండ - కొత్త ప్రొడ్యూసర్..ఈ లెక్కలేంటబ్బా?

By:  Tupaki Desk   |   21 Jan 2018 7:07 PM GMT
బెల్లంకొండ - కొత్త ప్రొడ్యూసర్..ఈ లెక్కలేంటబ్బా?
X
బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్లో ఇప్పటిదాకా నిఖార్సయిన కమర్షియల్ హిట్ లేదు. తొలి సినిమా ‘అల్లుడు శీను’ బాగానే ఆడింది. కానీ విపరీతంగా బడ్జెట్ పెట్టేయడం వల్ల అది కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. రెండో సినిమా ‘స్పీడున్నోడు’ పెద్ద ఫ్లాప్ అన్న సంగతి తెలిసిందే. ఇక మూడో చిత్రం ‘జయ జానకి నాయక’కు మంచి టాక్ వచ్చినా.. వసూళ్లు అందుకు తగ్గట్లు లేవు. శ్రీనివాస్ తొలి సినిమా లాగే దీనికి ఓవర్ బడ్జెట్ కావడం వల్ల కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. ట్రాక్ రికార్డు ఇలా ఉన్నప్పటికీ బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేయడానికి నిర్మాతలు ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టేస్తున్నారు. శ్రీనివాస్ తొలి సినిమాను మినహాయిస్తే.. మిగతా వాటన్నింటినీ బయటి నిర్మాతలే చేశారు.

ప్రస్తుతం ‘సాక్ష్యం’ సినిమాను అభిషేక్ భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఓంకార్ దర్శకత్వంలో శ్రీనివాస్ నటించబోయే కొత్త సినిమాను నిర్మించడానికి ‘బెంగాల్ టైగర్’ ఫేమ్ కె.కె.రాధామోహన్ ముందుకొచ్చాడు. దీని బడ్జెట్ లెక్కలేంటో ఇంకా స్పష్టత లేదు. బడ్జెట్ ఎంతైనా కానీ.. పెద్ద మార్కెట్ ఏమీ లేని శ్రీనివాస్ తో సినిమాలు తీయడానికి నిర్మాతలు ఇలా వరుస కట్టేస్తుండటం మాత్రం ఆశ్చర్యమే. ఐతే ఇక్కడ మతలబు వేరే అన్నది ఇండస్ట్రీ వర్గాల మాట. ఫైనాన్షియర్లు.. బయ్యర్లతో వివాదాలున్న నేపథ్యంలో బెల్లంకొండ సురేష్ తన కొడుకుతో తాను నేరుగా సినిమాలు తీయలేకే ఇలా వేరే వాళ్లను ముందుకు తెస్తున్నాడని.. బడ్జెట్లో కొంత మేర తాను భరించడమే కాక.. ప్రమోషన్.. బిజినెస్.. రిలీజ్ వ్యవహారాలన్నీ తాను చూసుకునేలా వాళ్లతో ఒప్పందం చేసుకుని తెర వెనుక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని.. అందుకే ప్రొడ్యూసర్లు ముందుకు వస్తున్నారని.. అంతే తప్ప శ్రీనివాస్ రేంజ్ చూసి కాదని అంటున్నారు.