Begin typing your search above and press return to search.

ఆ బ‌డా నిర్మాత‌కు లైట్ బాయ్‌ బెదిరింపులు?

By:  Tupaki Desk   |   3 Aug 2017 5:27 AM GMT
ఆ బ‌డా నిర్మాత‌కు లైట్ బాయ్‌ బెదిరింపులు?
X
టాలీవుడ్ బ‌డా నిర్మాత‌ల్లో ఒక‌రు బెల్లంకొండ సురేశ్‌. తాజాగా ఆయ‌న కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా జ‌య జాన‌కీ నాయ‌క చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర షూటింగ్ సంద‌ర్భంగా ఓ వ్య‌క్తి త‌న‌ను బెదిరిస్తున్నాడంటూ బెల్లంకొండ సురేశ్ బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు.

సినిమాకు సంబంధించి పాట షూటింగ్ స‌మ‌యంలో లైట్లు ఏర్పాటు చేసే వ్య‌క్తికి ప‌ని అప్ప‌గించాన‌ని.. ప‌ని పూర్తి అయ్యాక డ‌బ్బులు చెల్లించినట్లుగా బెల్లంకొండ సురేశ్ చెబుతున్నారు. అయితే.. ఈ పనికి ఏ మాత్రం సంబంధం లేని వ్య‌క్తి త‌న‌కు డ‌బ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరిస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు.

జ‌య జాన‌కీ నాయ‌క సినిమా షూటింగ్ గ‌త ఏడాది డిసెంబ‌రు 26 నుంచి జ‌న‌వ‌రి 2 వ‌ర‌కు అన్న‌పూర్ణ స్టూడియోలో షూటింగ్ జ‌రిగింద‌ని.. ఇందుకుగాను రూ2.75 ల‌క్ష‌ల బిల్లు చెల్లించిన‌ట్లుగా బెల్లంకొండ వెల్ల‌డించారు. త‌న‌కు రూ.10.75 ల‌క్ష‌లు చెల్లించాలంటూ అశోక్ రెడ్డి అనే వ్య‌క్తి అదే ప‌నిగా బెదిరిస్తున్నాడంటున్నారు.

త‌ర‌చూ ఫోన్లు చేయ‌టం వ‌ల్ల ప‌ని డిస్ట్ర‌బ్ అవుతోంద‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. గ‌తంలోనే తాను పోలీస్ స్టేష‌న్లో త‌న‌కు రావాల్సిన డ‌బ్బుల గురించి కంప్లైంట్ చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అశోక్ రెడ్డి చెబుతున్నారు. ఇప్ప‌టికే తాను ఇదే విష‌యం మీద మాదాపూర్‌.. బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేసిన‌ట్లుగా చెప్పారు. ఈ సంద‌ర్భంగా బెల్లంకొండ తీరును త‌ప్పు ప‌డుతున్నారు. మ‌రీ ఇద్ద‌రి విష‌యంలో ఎవ‌రిది నిజం అన్న‌ది తేలాల్సి ఉంది.