Begin typing your search above and press return to search.

సంపూ.. వేషాలు మామూలుగా లేవు

By:  Tupaki Desk   |   23 Feb 2016 9:46 AM GMT
సంపూ.. వేషాలు మామూలుగా లేవు
X
ఫేస్ బుక్ లో సరదాగా పేరడీ వేషాలు వేస్తూ మంచి పాపులారిటీ సంపాదించేశాడు సంపూర్ణేష్ బాబు. తనకు తాను బర్నింగ్ స్టార్ అని బిరుదు ఇచ్చేసుకుని.. చిత్ర విచిత్రమైన వేషాలతో జనాల్ని ఆకర్షించి.. రాజమౌళిని సైతం మెప్పించి.. మంచి క్రేజ్ మధ్య ‘హృదయ కాలేయం’ సినిమాను రిలీజ్ చేయించుకున్నాడు. ఆ సినిమా అనూహ్యమైన వసూళ్లు సాధించడంతో సంపూ పేరు మార్మోగిపోయింది. సంపూ ఆ తర్వాత చేసిన ‘సింగం 123’ అంతగా ఆకట్టుకోకపోయినా.. బర్నింగ్ స్టార్ కు అవకాశాలకైతే ఢోకా లేదు. ఓ వైపు ‘హృదయ కాలేయం’ టీంతో ‘కొబ్బరి మట్ట’ అనే సినిమా చేస్తూనే.. ఈ మధ్యే ‘వైరస్’ అనే ఇంకో సినిమా రెడీ చేశాడు సంపూ. దీంతో పాటు లేటెస్టుగా ‘భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ’ అనే ఇంకో సినిమా తెరమీదికి వచ్చింది.

ఇందులో సంపూ తన రియల్ లైఫ్ పాత్రనే పోషిస్తుండటం విశేషం. కొందరు కుర్రాళ్లు కలిసి సంపూ హీరోగా సినిమా తీసే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మామూలుగానే ఓ రేంజిలో రెచ్చిపోయే సంపూను ఇక సినిమా హీరోగా నటించమంటే ఊరుకుంటాడా? తనదైన శైలిలో రెచ్చిపోయాడు. అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ స్టయిల్లో పరుగులు పెడుతూ.. రామ్ చరణ్ ‘మగధీర’ స్టయిల్లో బంగారు కోడిపెట్ట స్టెప్పులేస్తూ చెలరేగిపోయాడు సంపూ. షూటింగ్ స్పాట్లో.. ‘‘మీరు ప్రతి విషయం మాకు చెప్పకండి బాబూ.. కెమెరా ఆన్లో ఉంది’’ అని డైరెక్టర్ అంటే.. ‘‘మీకెవరు చెప్పారు. ఆడియన్సుకి చెబుతున్నా. నా అభిమానులకు చెబుతున్నా.. ఆర్ యు లిజెనింగ్ గయ్స్’’ అంటూ తనదైన స్టయిల్లో పంచ్ వేశాడు సంపూ. రాజేష్ పులి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.​