Begin typing your search above and press return to search.

ఏంటీ.. పవన్ సినిమా నుంచి పూజా తప్పుకుందా..?

By:  Tupaki Desk   |   1 Jun 2022 11:32 AM GMT
ఏంటీ.. పవన్ సినిమా నుంచి పూజా తప్పుకుందా..?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ''భవదీయుడు భగత్ సింగ్'' అనే సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే ని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసినట్లు దర్శకుడు ఇదివరకే ధృవీకరించారు. అయితే ఇప్పుడు పూజా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.

'భవదీయుడు భగత్ సింగ్' చిత్రాన్ని ప్రకటించి చాలా కాలమే అయింది. అయితే పవన్ కళ్యాణ్ ఇతర కమిట్ మెంట్స్ ను ముందుగా పూర్తి చేయాలని నిర్ణయించుకోవడంతో హరీష్ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అయితే ఇప్పుడు 'హరి హర వీరమల్లు' మరియు 'వినోదయ సీతమ్' రీమేక్‌ లను ముందుగా పూర్తి చేయాల్సి ఉన్నందున.. భవదీయుడు చిత్రానికి పవన్ కళ్యాణ్ డేట్లు కేటాయించలేకపోతున్నాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే దానిపై క్లారిటీ రావడం లేదు. పరిస్థితిని అర్థం చేసుకున్న పూజ.. పవన్ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు టాక్ నడుస్తోంది.

పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం రావడంతో డీజే దర్శకుడితో మరోసారి వర్క్ చేయడానికి ఈ సినిమాకు సైన్ చేసింది పూజా. అయితే ఎప్పుడు మొదలవుతుందో తెలియకపోవడంతో.. ఇతర కమిట్మెంట్స్ వల్ల డేట్స్ ఇష్యూ వస్తుందేమో అని ఆందోళన చెందుతోందట. అందుకే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుందని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'జనగణమన' సినిమా చేయడానికి రెడీ అయిందని చెప్పుకుంటున్నారు. మరోవైపు దర్శకుడు హరీష్ శంకర్ కూడా పవన్ డేట్స్ ఇచ్చే లోపు.. ఇంకో ప్రాజెక్ట్ పై వర్క్ చేయనున్నారని టాక్ వచ్చింది.

అయితే 'భవదీయుడు భగత్ సింగ్' షూటింగ్ అతి త్వరలో ప్రారంభించబోతున్నామని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఎగ్జైటింగ్ వార్తలు & అప్‌డేట్‌లు రాబోతున్నాయని.. ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దల్ బాషింగాలే అని పేర్కొన్నారు. కానీ ఇప్పుడప్పుడే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే పరిస్థితి లేదని అంటున్నారు. మరి మేకర్స్ ఈ రూమర్స్ పై స్పష్టత ఇస్తారేమో చూడాలి.