Begin typing your search above and press return to search.
హా.. మైనే ప్యార్ కియా!!
By: Tupaki Desk | 18 July 2017 10:36 AM GMT1989లో వచ్చిన మైనే ప్యార్ కియా సినిమా దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమా తెలుగు ప్రేమ పావురాలు పేరిట డబ్ అయింది. ఈ సినిమా పాటలు దశాబ్దానికి పైగా జనాల నోళ్లలో నానాయంటే ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదు. ఈ సినిమాతోనే సూరజ్ బర్జాత్యా ఫ్యామిలీ స్టోరీల ట్రెండ్ మొదలైంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీ ఆనాటి యువత కలల రాణిగా మారిపోయింది.
మైనా ప్యార్ కియా తర్వాత ఇంకో సినిమా చేయకముందే భాగ్యశ్రీ పెళ్లి చేసుకుంది. తన చిన్ననాటి ఫ్రెండ్ హిమాలయా దసానితో కలిసి పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇటీవల భాగ్యశ్రీ తన పెళ్లికి సంబంధించిన విశేషాలు పంచుకుంది. మైనే ప్యార్ కియా సినిమా చేయడానికి ముందే తాను దసానీని ప్రేమించినట్లు చెప్పింది. అతడు స్టడీస్ కోసం యూఎస్ వెళ్లిన సమయంలో తొలి సినిమా అయిన మైనే ప్యార్ కియాకి సంతకం చేశానని చెప్పింది. ‘‘సినిమా షూటింగ్ ఉండగానే పెళ్లి చేసుకోవాలని డిసైడై పోయాను. అందుకే ముందు దసానీ తల్లిదండ్రులతో మాట్లాడా. వాళ్లు అభ్యంతరం లేదని చెప్పారు. మా అమ్మానాన్నలే ఒప్పుకోలేదు. దసానీ ఫారిన్ నుంచి వచ్చిన రోజునే ఫోన్ చేసి నేనంటే ఇష్టముంటే పది నిమిషాల్లో మా ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్లి పెళ్లి చేసుకోమని అడిగాను. వెంటనే ఆయన వచ్చి నన్ను మా ఇంటి నుంచి తీసుకెళ్లిపోయాడు’’ అంటూ భాగ్యశ్రీ తన ప్రేమకథ విశేషాలు చెప్పుకొచ్చింది.
వీళ్లిద్దరూ కలిసి ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లికి పెద్దలుగా మైనే ప్యార్ కియా హీరో సల్మాన్ ఖాన్ దర్శకుడు సూరజ్ బర్జాత్యా హాజరవడం విశేషం. మైనే ప్యార్ కియా తర్వాత తనకు చాలా సినిమా ఆఫర్లు వచ్చినా వాటన్నింటిని కాదని కుటుంబానికే సమయం కేటాయించింది. ఇందుకు తానేం బాధపడటం లేదని హ్యాపీగా చెబుతోంది. భాగ్యశ్రీ తర్వాత కాలంలో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ చేసింది. తెలుగులో రాజశేఖర్ హీరోగా నటించిన ఓం, బాలకృష్ణ సినిమా యువరత్న రాణాల్లో నటించింది. ప్రస్తుతం భాగ్యశ్రీ న్యూట్రిషన్ ఎక్స్ పర్ట్ గా రాణిస్తోంది.