Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'భైరవ గీత'

By:  Tupaki Desk   |   14 Dec 2018 11:26 AM GMT
మూవీ రివ్యూ: భైరవ గీత
X
'భైరవ గీత'

నటీనటులు: ధనంజయ - ఐరా మోర్ - విజయ్ రామ్ - రాజా బల్వాడి తదితరులు
సంగీతం: రవిశంకర్
ఛాయాగ్రహణం: జగదీష్ చీకటి
మాటలు: రామ్ వంశీ కృష్ణ
నిర్మాతలు: అభిషేక్ నామా - భాస్కర్ రాశి
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సిద్దార్థ తాతోలు

దర్శకుడిగా ‘ఆఫీసర్’ సినిమాతో పాతాళానికి పడిపోయాడు రామ్ గోపాల్ వర్మ. ఆ సినిమా తర్వాత కొంచెం విరామం తీసుకుని తన నిర్మాణంలో తెరకెక్కిన ‘భైరవగీత’ను ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. కొత్త దర్శకుడు సిద్దార్థ తాతోలు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

భైరవ (ధనంజయ) ఓ ఫ్యాక్షన్ నాయకుడి దగ్గర పని చేస్తుంటాడు. భైరవ కుటుంబం తరతరాలుగా ఆ ఫ్యాక్షన్ నాయకుల దగ్గరే బానిసత్వం చేస్తుంటుంది. తన జీవితం కూడా నాయకుడికే అంకితం చేసి బతుకుతుంటాడు. ఐతే ఆ ఫ్యాక్షన్ నాయకుడి కూతురు భైరవను ప్రేమిస్తుంది. తండ్రి తనకు ఇష్టం లేని పెళ్లి కుదర్చడంతో ఇంటి నుంచి పారిపోయి భైరవ కోసం వస్తుంది. దీంతో భైరవను అంతమొందించాలని పంతం పడతాడు ఫ్యాక్షన్ నాయకుడు. ఈ స్థితి భైరవ ఏం చేశాడు.. తనను తాను ఎలా కాపాడుకుని ఫ్యాక్షన్ నేతతో పోరాటం చేశాడన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

భారతీయ ప్రేక్షకులు ‘టేకింగ్’ అనే మాట గురించి విపరీతంగా చర్చించుకునేలా చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. 90ల్లో ఆయన సినిమాలు చూసి జనాలు వెర్రెత్తిపోయేవాళ్లు. అప్పటిదాకా ఎన్నడూ చూడని విజువల్స్.. మ్యూజిక్.. టేకింగ్‌తో ప్రేక్షకుల్ని కొత్తదనంలో ముంచెత్తేవాడు వర్మ. ఆయన కథలు సైతం కొత్తగా ఉండేవి. హింసతో ముడిపడ్డ ఆయన సినమాల్లో ఇంటెన్సిటీనే వేరుగా ఉండేది. ప్రేక్షకులపై ఎంతో ప్రభావం చూపేది. దీంతో వర్మ కొత్త తరహా సినిమాలు కోరుకునే ప్రేక్షకులకు ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయాడు. ఐతే కాలక్రమంలో వర్మ కూడా ఒక ఛట్రంలో బిగుసుకుపోయాడు. ఒకప్పుడు కొత్తగా అనిపించిన ఆయన టేకింగ్ మొహం మొత్తడం మొదలైంది. వర్మ సినిమాలనగానే ఒకే రకమైన విజువల్స్.. కెమెరా యాంగిల్స్.. సౌండ్స్ కు అలవాటైపోయారు జనాలు. నటీనటుల హావభావాలైనా అంతే. టెక్నీషియన్లు మారినా.. నటీనటులు మారినా.. ప్రతిసారీ పాత సినిమా చూస్తున్న భావనే కలుగుతుండటానికి అవే కారణం. విచారకరమైన విషయం ఏంటంటే.. వర్మ నిర్మాణంలో ఆయన శిష్యులు తీసే సినిమాలు సైతం అలాగే తయారవుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణ.. భైరవగీత.

సిద్దార్థ తాతోలు అనే కొత్త దర్శకుడు ‘భైరవ గీత’ను రూపొందించాడు. ఈ సినిమా దర్శకుడెవరూ చూపించకుండా థియేటర్లో తీసుకెళ్లి కూర్చోబెడితే ఇది వర్మ తీసిన సినిమా అనే అనుకుంటాం. సరే టేకింగ్ విషయంలో వర్మ నుంచి స్ఫూర్తి పొందితే పొంది ఉండొచ్చు. కానీ కథాకథనాలైనా కొత్తగా ఉండేలా చూసుకోవాలి కదా? అదీ లేదాయె. ఫ్యాక్షన్ నాయకుడి దగ్గర పని చేసే ఓ కుర్రాడు.. ఆ నాయకుడి కూతురు అతడిని ప్రేమిస్తుంది. ఇతను మీరెక్కడ మేమెక్కడ అని దూరం జరుగుతాడు. కానీ హీరోయిన్ వెంట పడుతుంది. అతడితో కలిసి బయటికెళ్లిపోతుంది. ఫ్యాక్షన్ నాయకుడు అతడి మీద కక్ష కడతాడు. ఇద్దరి మధ్య పోరు మొదలవుతుంది. హీరో తిరుగుబాటు మొదలుపెడతాడు. ఇలాంటి కథలు ఎన్ని చూడలేదు తెలుగులో. ఓవైపు వర్మ స్టయిల్లో హీరో హీరోయిన్ల ఘాటు రొమాన్స్ చూపిస్తూ.. ఎమోషనల్ కనెక్షన్ లేకుండా మితిమీరిన హింసతో యాక్షన్ ఘట్టాల్ని నడిపిస్తూ.. ఇంకోవైపు ఉద్యమం-పోరాటం అంటే జనాలు ఎక్కడ కనెక్టవుతారు?

‘భైరవ గీత’లో ఒక సన్నివేశంలో విలన్ వచ్చి హీరో తల్లిని హింసించి హింసించి చంపుతాడు. ఆ సీన్ చూస్తే బాధ కలగకపోగా.. జుగుప్స కలుగుతుంది. ఈ దర్శకుడు మరీ ఇంత వీర్డ్ థాట్స్ ఉన్నాయేంటి అనిపిస్తుంది. ప్రేక్షకులు హీరో బాధను తమ బాధగా అనుభవించినపుడు ఇలాంటి కథలకు బాగా కనెక్టవుతారు. హీరో లాగే పగతో రగిలిపోతారు. కానీ ఆ రకమైన ఎమోషనల్ కనెక్ట్ అన్నది సినిమాలో ఎక్కడా కనిపించదు. సినిమా మొదలైన తీరుతోనే ఏం జరగబోతుందో అర్థమైపోతుంది. కొత్తగా.. ఆసక్తికరంగా అనిపించే సన్నివేశాలు బూతద్ం వేసి వెతికినా కనిపించవు. పాట పాడి డ్యాన్స్ బాగా చేశాడని.. ఒక ఫైట్ చేసి తన ప్రాణాలు కాపాడాడని హీరోయిన్ ప్రేమలో పడిపోతుంది. ఫ్యాక్షని నాయకుడి కూతురు తమ పనివాడిని ప్రేమిస్తే ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఊహించడం కష్టమేమీ కాదు. ఆ అంచనాలకు తగ్గట్లే కథ నడుస్తుంది. అచ్చంగా వర్మ స్టయిల్లో ఎక్కడ పడితే అక్కడ కెమెరా పెట్టడం.. క్లోజప్స్ చూపించడం.. నటీనటులంతా అవసరానికి మించి హావభావాలు పలికించేస్తుండటం.. సన్నివేశాల్లో బలం లేకపోయినా ఏదో జరిగిపోతున్నట్లు బ్యాగ్రౌండ్లో అర్థం పర్థం లేని సౌండ్లు.. ఇలా ‘భైరవగీత’ కాసేపటికే ప్రేక్షకుల్ని విసిగెత్తించేస్తుంది. అక్కడక్కడా కొన్ని సీన్లు.. షాట్లు పర్వాలేదనిపిస్తాయి. హీరో విలన్ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చే సీన్ ఒక్కటి ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇక మిగతా వ్యవహారమంతా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేదే. వర్మ ‘రక్తచరిత్ర’కు పేలవమైన వెర్షన్ లాగా కనిపిస్తుంది ‘భైరవగీత’.

నటీనటులు:

వర్మ సినిమాల్లో నటీనటుల నుంచి ఒక రకమైన హావభావాలకు జనాలు అలవాటు పడిపోయారు. ‘భైరవగీత’లోనూ అంతే. హీరో ధనంజయ మంచి పెర్ఫామర్ అనే విషయం అర్థమవుతుంది కానీ.. అతను చాలాచోట్ల అవసరానికి మించి నటించేశాడు. చిత్రమైన హావభావాలు ఇచ్చాడు. విలన్ ఇంటికెళ్లి వార్నింగ్ ఇచ్చే సీన్లో అతడి పెర్ఫామెన్స్ ఇంటెన్స్ గా అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్లలో అక్కడక్కడా పర్వాలేదు. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. హీరోయిన్ ఐరా మోర్ వీర లెవెల్లో ఎక్స్ పోజింగ్ చేసింది. కుర్రాళ్లకు ఆమె అందాలు కనువిందే. నటన పరంగా అంత చెప్పుకోవడానికేమీ లేదు. విలన్ పాత్రల్లో విజయ్ రామ్.. రాజా బల్వాడి ఓవరాక్షన్ చేశారు. విజయ్ ని ‘రక్తచరిత్ర’లో బుక్కారెడ్డిగా నటించిన అభిమన్యు సింగ్ ను ఫాలో అయిపోమని చెప్పారేమో.. దాదాపుగా అలాంటి ఎక్స్ ప్రెషన్లే ఇచ్చాడతను. మిగతా నటీనటుల గురించి పెద్దగా చెప్పడానికేమీ లేదు.

సాంకేతిక వర్గం:

ఇక్కడ కూడా వర్మ శైలి గురించే మాట్లాడాలి. ఆయన సినిమాల్లో ఎప్పుడూ కనిపించే విజువల్స్.. మ్యూజిక్కే ఇందులోనూ ఉన్నాయి. జగదీష్ చీకటి కొన్ని ఏరియల్ షాట్స్ వరకు ప్రత్యేకత చాటుకున్నాడు. మిగతా అంతా ఒక స్టయిల్లో సాగిపోతుంది. చిత్ర విచిత్రమైన కెమెరా యాంగిల్స్.. క్లోజప్ షాట్లే కనిపిస్తాయి సినిమా అంతా. రవిశంకర్ సంగీతమూ అంతే. బ్యాగ్రౌండ్ స్కోర్ బోర్ కొట్టించేస్తుంది. పాటలు పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. డైలాగ్స్ ఓకే. దర్శకుడు సిద్దార్థ తాతోలు మీద వర్మ ప్రభావం విపరీతంగా ఉన్నట్లుంది. వర్మ స్టయిల్లోనే సినిమా తీసి ఆయన్ని మెప్పించాలని చూశాడేమో అనిపిస్తుంది. ఐతే ప్రేక్షకులకు మెచ్చే సినిమా మాత్రం తీయలేకపోయాడు. కథాకథనాల్లో కొత్తదనం లేదు. టేకింగ్ లోనూ ఏ ప్రత్యేకతా కనిపించలేదు. అతను తన తర్వాతి సినిమాకు వర్మ మత్తులోంచి బయటికి వస్తే బెటర్.

చివరగా: భైరవ గీత.. భరించలేని మోత!

రేటింగ్: 1.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre