Begin typing your search above and press return to search.

నాని లాంచ్ చేసిన శ్రీవిష్ణు 'భళా తందనాన' టీజర్..!

By:  Tupaki Desk   |   28 Jan 2022 5:16 AM GMT
నాని లాంచ్ చేసిన శ్రీవిష్ణు భళా తందనాన టీజర్..!
X
వర్సటైల్ హీరో శ్రీవిష్ణు ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. గతేడాది 'రాజ రాజ చోర' 'గాలి సంపత్' 'అర్జున ఫల్గుణ' వంటి మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన శ్రీ విష్ణు.. ఇప్పుడు ''భళా తందనాన'' అంటూ వస్తున్నారు.

''భళా తందనాన'' సినిమా వైవిధ్యమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్. 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజిని కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

''భళా తందనాన'' చిత్రంలో శ్రీ విష్ణు సరసన క్యాథరిన్ ట్రెసా హీరోయిన్ గా నటిస్తోంది. 'కేజీఎఫ్' ఫేమ్ గరుడ రామచంద్రరాజు ప్రధాన విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా టీజర్ ను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేసి చిత్ర బృందానికి విషెస్ అందజేశారు.

'రాక్షసుడుని చంపడానికి దేవుడు కూడా అవతారాలు ఎత్తాలి' అని చెప్తుండంతో టీజర్ ప్రారంభమవుతుంది. ఇందులో శ్రీవిష్ణు ఒక జర్నలిస్టులుగా నటించినట్లు తెలుస్తోంది. అయితే తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం కొన్ని అనుకోని పరిస్థితుల్లో అతను గన్ పట్టుకొని వైలెంట్ మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.

'నీ దారిలో నువ్వు.. నా దారిలో నేను.. ఇద్దరి లక్ష్యం' ఒక్కటే అని చెప్పడం చూస్తుంటే శ్రీవిష్ణు - క్యాథరిన్ ఇద్దరూ ఒకే లక్ష్యం కోసం వేర్వేరు దారుల్లో వెళ్తున్నారని తెలుస్తోంది. క్యాథరిన్ ట్రెసాకు ఈ సినిమాలో మంచి పాత్ర దొరికినట్లు కనిపిస్తోంది. సత్య - పోసాని కృష్ణ మురళి - అయ్యప్ప పి శర్మ - చైతన్య కృష్ణ - రవి వర్మ - శ్రీకాంత్ అయ్యంగార్ - ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

'సీఎం కుర్చీలో కూర్చున్న ఎవ్వరైనా ఒక్క సంతకంతో స్టేట్ ఫ్యూచర్ నే మార్చేయొచ్చు.. అంటే ఆ పవర్ చేతిదా? లేక కుర్చీదా?' అని శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ బాగుంది. విలన్ బ్యాచ్ ని గన్ తో షూట్ చేసిన తర్వాత శ్రీవిష్ణు బర్డ్ డ్యాన్స్ చేయడం టీజర్ లో హైలైట్ గా నిలిచింది.

చైతన్య దంతులూరి మరో వైవిధ్యమైన కథతో కమర్షియల్ ఎంటర్టైనర్ గా 'భళా తందనాన' సినిమాని తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థం అవుతుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇందులో యాక్షన్ పాళ్ళు కూడా ఎక్కువే అనే తెలుస్తోంది.

పీటర్ హెయిన్స్ ఈ సినిమాలో ఫైట్స్ కంపోజ్ చేశారు. శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకు సంభాషణలు రాశారు. సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందించగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. 'భళా తందనాన' సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.