Begin typing your search above and press return to search.

బ్లాక్ బస్టర్ కాక ఇంకేంటి?

By:  Tupaki Desk   |   12 Sep 2015 6:22 AM GMT
బ్లాక్ బస్టర్ కాక ఇంకేంటి?
X
బహుశా ‘భలే భలే మగాడివోయ్’ సినిమాకు పని చేసిన ఏ ఒక్కరూ కూడా ఇంతటి విజయాన్ని ఊహించి ఉండరేమో. కేవలం వారం రోజుల్లోనే పెట్టుబడికి రెండున్నర రెట్లు వసూలు చేయడమంటే మాటలా? ఎంత పెద్ద సూపర్ స్టార్ కైనా కూడా ఇది సాధ్యం కాని ఘనతే. తొలి వారం బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన ‘భలే భలే మగాడివోయ్’ ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. తొలి ఏడు రోజుల్లో ఏకంగా రూ.24 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి.. చిన్న సినిమాలకు సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఇందులో షేర్ రూ.14.2 కోట్లు. స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఈ స్థాయిలో వసూళ్లు వస్తాయి. ఏరియాల వారీగా చూస్తే నైజాంలో రూ.6 కోట్ల గ్రాస్.. రూ.3.7 కోట్ల షేర్ వచ్చింది.

సీడెడ్ లో రూ.96 లక్షలు, వైజాగ్ లో రూ.91 లక్షలు, తూర్పు గోదావరిలో రూ.55 లక్షలు, పశ్చిమ గోదావరిలో రూ.45 లక్షలు, కృష్ణాలో రూ.58 లక్షలు, గుంటూరులో రూ.82 లక్షలు, నెల్లూరులో రూ.18 లక్షలు షేర్ వసూలైంది. మొత్తంగా తెలంగాణ, ఏపీ కలిపి రూ.13.25 కోట్ల గ్రాస్, రూ.8.15 కోట్ల షేర్ కలెక్టయింది. స్టార్ హీరోలకు మాత్రమే వసూళ్లుండే కర్ణాటకలో కూడా భలే భలే మగాడివోయ్ ప్రభంజనం సాగింది. అక్కడ రూ.3.06 కోట్ల గ్రాస్, రూ.1.4 కోట్ల షేర్ వచ్చింది. ఇక అమెరికాలో ఈ సినిమా దాదాపుగా మిలియన్ మార్కును అందుకుంది. తొలి వారంలో రూ.6.39 కోట్ల గ్రాస్, రూ.4.15 కోట్ల షేర్ వచ్చింది. మిగతా ఏరియాల్లో అర కోటి దాకా షేర్ కలెక్టయింది.

మొత్తానికి తొలి వారంలో రూ.14.2 కోట్ల షేర్ తో సంచలనం రేపింది భలే భలే మగాడివోయ్. తీరా బడ్జెట్ చూస్తే రూ.5-6 కోట్ల మధ్యే ఉంది. ఈ మొత్తానికి శాటిలైట్ ఆదాయం అదనం. అదో మూడు కోట్ల దాకా ఉంది. అంటే పెట్టుబడి మీద మూడు రెట్లు ఇప్పటికే చేతికొచ్చిందన్నమాట. ‘భలే భలే మగాడివోయ్’ని బ్లాక్ బస్టర్ అనక ఇంకేమనాలి?