Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: భలే మంచి రోజు

By:  Tupaki Desk   |   25 Dec 2015 9:47 AM GMT
మూవీ రివ్యూ: భలే మంచి రోజు
X
చిత్రం : భలే మంచి రోజు
నటీనటులు: సుధీర్ బాబు - వామికా గబ్బి - సాయికుమార్ - పోసాని కృష్ణమురళి - పృథ్వీ - వేణు - శ్రీరామ్ - పరుచూరి గోపాల కృష్ణ తదితరులు
ఛాయాగ్రహణం: శ్యామ్ దత్
సంగీతం: సన్నీ ఎం.ఆర్
మాటలు: అర్జున్ - కార్తీక్
నిర్మాతలు: విజయ్ - శశి
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య

‘భలే మంచి రోజు’ ఓ డిఫరెంట్ మూవీలా అనిపించింది టీజర్ - ట్రైలర్ చూస్తే. సుధీర్ బాబు హీరోగా కొత్త దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రూపొందించిన ఈ క్రైమ్ కామెడీ ఏమాత్రం కొత్తదనం పంచింది.. ప్రేక్షకుల్ని ఏమేరకు మెప్పించింది.. చూద్దాం పదండి.

కథ:

రామ్ (సుధీర్ బాబు) ఓ అమ్మాయి చేతిలో మోసపోయిన ఫ్రస్టేషన్లో ఉంటాడు. తనను మోసం చేసిన అమ్మాయికి బుద్ధి చెప్పాలనే లక్ష్యంతో నాన్న మెకానిక్ షెడ్డులోని కారు తీసుకుని బయల్దేరిన అతను ఓ కారును గుద్దేస్తాడు. ఆ కార్లో కిడ్నాప్ అయిన అమ్మాయి సీత (వామికా) అక్కడి నుంచి తప్పించుకుంటుంది. దీంతో కిడ్నాపర్ శక్తి (సాయికుమార్) రామ్ తో పాటు అతడి ఫ్రెండును పట్టుకుంటాడు. తన ఫ్రెండును బందీగా పట్టుకుని సీతను తెచ్చివ్వమని రామ్ ను బ్లాక్ మెయిల్ చేస్తాడు? మరి రామ్.. సీతను తిరిగి తీసుకొచ్చాడా? తన ఫ్రెండుని విడిపించుకున్నాడా? చివరికి అతడి కథ ఏ మలుపులు తిరిగింది? అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

రొటీన్ కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన తెలుగు పరిశ్రమలో కొంచెం డిఫరెంటుగా సినిమాలు తెరకెక్కడమే తక్కువ. అందులోనూ అలా కొత్తగా ఉండి జనాల్ని మెప్పించే సినిమాలు మరీ అరుదు. ‘భలే మంచి రోజు’ ఆ కోవలోని సినిమానే. కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల్ని సంతృప్తిపరచడమే కాదు.. బోలెడంత వినోదాన్ని కూడా పంచుతుందీ సినిమా. ‘స్వామి రారా’ తర్వాత తెలుగులో వచ్చిన పర్ఫెక్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘భలే మంచి రోజు’. ఇప్పుడొస్తున్న సినిమాల మధ్య ‘భలే మంచి రోజు’ భిన్నంగా అనిపిస్తుంది. రొటీన్ సినిమాల హ్యాంగోవర్ లోంచి బయటపడేసే రుచికరమైన మజ్జిగలా అనిపిస్తుంది.

అభిరుచి ఉన్న ఓ కొత్త దర్శకుడి నుంచి ఎలాంటి సినిమా ఆశిస్తామో అలాంటి సినిమానే ‘భలే మంచి రోజు’. కిడ్నాప్ నేపథ్యంలో క్రైమ్ కామెడీ అనగానే స్టోరీ లైన్స్ దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఇక్కడ వైవిధ్యం చూపగలిగేది స్క్రీన్ ప్లే విషయంలోనే. ఆ విషయంలోనే ‘భలే మంచి రోజు’ ప్రత్యేకత కనిపిస్తుంది. ప్రేక్షకులు ఊహించలేని సర్ ప్రైజ్ ప్యాకేజ్ లా ‘భలే మంచి రోజు’ను మలించాడు శ్రీరామ్. క్రైమ్ కామెడీకి సూటయ్యే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాను మలిచాడీ కుర్ర డైరెక్టర్.

నరేషన్ కొంచెం స్లోగా అనిపించినా.. కొన్ని చోట్ల డీవియేట్ అయిన ఫీలింగ్ కలిగినా.. ‘భలే మంచి రోజు’ ఏ దశలోనూ బోర్ అనిపించదు. మొదట్లో హడావుడి చేసి ఆ తర్వాత చప్పగా తేల్చేయకుండా.. సింపుల్ గా మొదలుపెట్టి.. నెమ్మదిగా స్టోరీని బిల్డ్ చేసి.. ఆసక్తికర మలుపులతో కథనాన్ని నడిపించి.. హిలేరియస్ క్లైమాక్స్ తో సినిమాను ముగించాడు శ్రీరామ్. సినిమాలో వేస్ట్ అనదగ్గ పాత్ర లేదు, అనవసరం అనిపించే సన్నివేశాలూ తక్కువే. ప్రతి పాత్రకూ ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి క్యారెక్టరూ మనల్ని ఏదో రకంగా సర్ ప్రైజ్ చేస్తుంది.

ఉదాహరణకు పరుచూరి గోపాల కృష్ణ పోషించిన హీరో తండ్రి పాత్రనే తీసుకుందాం. ఇది చాలా చిన్న పాత్ర. తన మెకానిక్ షెడ్డుకొచ్చి ఓ వ్యక్తి గొడవ చేస్తుంటే టెన్షన్ లో అతడికేదో అయినట్లు చూపిస్తారు. కట్ చేస్తే అంబులెన్స్. హీరో తల్లి ఏడుస్తుంటుంది. ఐసీయూ ముందెళ్లి హీరో లోపలికి చూస్తుంటాడు. తర్వాత ఏం జరుగుతుందన్నది చెప్పేస్తే థ్రిల్ మిస్సవుతారు. తెరమీదే చూడాలి. ఇలాంటి థ్రిల్స్ - సర్ ప్రైజెస్ సినిమాలో బోలెడన్ని కనిపిస్తాయి. ప్రేక్షకుడు ఎక్కడ కొంచెం నిట్టూర్చే అవకాశం ఉన్నా.. అక్కడ ఇలాంటి సర్ ప్రైజ్ ఎలిమెంటుతో ఎంగేజ్ చేస్తాడు దర్శకుడు. ఈ రోజుల్లో ట్విస్టుల్లేని సినిమాలంటూ ఏమీ ఉండట్లేదు. ఐతే ఊరికే ట్విస్టులివ్వడం కాకుండా.. వాటిని రివీల్ చేసిన తీరు.. ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేసిన వైనం ‘భలే మంచి రోజు’ ప్రత్యేకతను తెలియజేస్తుంది.

ఓ సన్నివేశంలో కమెడియన్ వేణు రాశి ఫలాలు చూసుకుంటాడు. పసుపు రంగు కలిసొస్తుందని రాసి ఉంటుంది. ఆ తర్వాతి సన్నివేశంలో అతణ్ని హీరో వెంటాడుతాడు. స్క్రీన్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. కానీ పసుపు వస్తువులు మాత్రం అదే కలర్లో కనిపిస్తుంటాయి. వేణు ఆ పసుపు వస్తువుల వల్లే దెబ్బ తింటాడు. హీరోకు దొరికిపోతాడు. ఇలా చూపించడం వల్ల సినిమాకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు కానీ.. దర్శకుడి టేస్టు ఏంటన్నది ఇక్కడ అర్థమవుతుంది. ఏదో డిఫరెంటుగా ట్రై చేయాలన్న అతడి ఉద్దేశం తెలుస్తుంది.

ప్రథమార్ధంలో కథ టేకాఫ్ కావడానికి కొంచెం టైం పడుతుంది. పోసాని పాత్ర ఎంటరయ్యే వరకు ప్రేక్షకుడిలో ఉత్సాహం రాదు. ఐతే ఒక్కసారి ఊపు వచ్చాక మాత్రం సినిమా ఎక్కడా ఆగదు. ఇంటర్వల్ ట్విస్ట్ ఆసక్తి రేపుతుంది. ఇక ద్వితీయార్ధమంతా ట్విస్టులే ట్విస్టులు. ఒక్క రోజులో ముగిసిపోయే సినిమా అని చెప్పి.. లెంగ్తీ ఫ్లాష్ బ్యాక్ లతో పాత కథలతో బండి నడిపించే ప్రయత్నం చేయలేదు. సింపుల్ గా ముగిసిపోయే చిన్న హీరో ఫ్లాష్ బ్యాక్ మినహాయిస్తే మిగతాదంతా వర్తమానంలోనే నడుస్తుంది. హీరో హీరోయిన్ల లవ్ స్టోరీకి ప్రత్యేకంగా ట్రాక్ ఏమీ నడపకుండా కథనంలో భాగంగానే చాలా తక్కువ సన్నివేశాలతో లవ్ స్టోరీ బిల్డ్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధంలో కొన్ని డల్ మూమెంట్స్.. అనవసర పాటలు ఇబ్బంది పెట్టినా.. క్లైమాక్స్ సినిమాకు మేజర్ హైలైట్ గా నిలుస్తుంది. కమెడియన్ పృథ్వీ చివర్లో కొసమెరుపులా వచ్చి పాపులర్ పోలీస్ సినిమాల డైలాగులతో హోరెత్తించేశాడు. ముఖ్యంగా సాయికుమార్ ముందు అతడి డైలాగులే చెప్పి.. రాజశేఖర్ ను ఇమిటేట్ చేసే సీన్ గురించైతే చెప్పాల్సిన పని లేదు. చివర్లో ఐశ్వర్య-కృష్ణ చైతన్య సీన్ ప్రేక్షకులకు మరింతగా గిలిగింతలు పెడుతుంది. నిడివి తక్కువుండటం సినమాకు ప్లస్.

నరేషన్ కొంచెం స్లోగా ఉండటం, పాటలు సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మైనస్ లు. కమెడియన్లిద్దరి మీద పాట తీయడం బాగుంది కానీ.. అది సినిమాకు అవసరం అనిపించదు. పాటలు అక్కడక్కడా అడ్డం పడుతుంటాయి. సినిమా ఆరంభంలో... సెకండాఫ్ లో కథనం కొంచెం స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ జానర్, కథను నరేట్ చేసిన తీరు ప్రకారం చూస్తే ఇది మాస్ మసాలా అంశాలు కోరుకునే ప్రేక్షకుల్ని నిరాశ పరచొచ్చు. ఐతే మల్టీప్లెక్స్ ఆడియన్స్ మాత్రం సినిమాతో బాగా కనెక్టవుతారు. రొటీన్ సినిమాలతో విసుగెత్తిపోయి కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ‘భలే మంచి రోజు’ ఉపశమనమే.

నటీనటులు:

‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ తర్వాత సుధీర్ బాబు మరోసారి ఈ సినిమాతో తన ముద్ర చూపించాడు. తన మైనస్ లను కవర్ చేసుకుని పాత్రకు తగ్గట్లు నటించాడు. హై పిచ్ తో డైలాగులు చెప్పేటపుడు అతడి బలహీనత ఇందులోనూ కనిపించింది కానీ.. నటన పరంగా మాత్రం బాగా చేశాడు. అతి ఏమీ చెయ్యకుండా ‘బాయ్ నెక్స్ట్ డోర్’ పాత్రలో ఒదిగిపోయాడు. వామికా గబ్బి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఎప్పుడూ చేతులు కట్టేసి, నోరు మూసేసి ఉన్న పాత్ర ఆమెది. ఉన్నంతలో బాగానే చేసింది. లిప్ సింక్ విషయంలో ఆమె పెట్టిన శ్రద్ధ తెరమీద కనిపిస్తుంది. తనకు డబ్బింగ్ కూడా బాగుంది. సాయికుమార్ - పృథ్వీ - వేణు - శ్రీరామ్ - పోసాని - పరుచూరి గోపాల కృష్ణ.. వీళ్లందరూ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తమ వంతుగా ఎంటర్టైన్ చేశారు. అందర్లోకి పృథ్వీనే హైలైట్ అయ్యాడు.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గానూ ‘భలే మంచి రోజు’ బ్రిలియంట్ ఫిలిం. ‘విశ్వరూపం’ ఫేమ్ శ్యామ్ దత్ సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లాడు. హీరో ఇంట్రడక్షన్ సీన్లోనే అతడి ప్రత్యేకత కనిపిస్తుంది. ఛేజింగ్ సీన్లు సహా ప్రతి సన్నివేశంలోనూ కెమెరా పనితనం కనిపిస్తుంది. క్లోజప్ షాట్లను చాలా బాగా తీశాడు. సన్నీ ఎం.ఆర్. పాటలు పర్వాలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్. కొన్ని చోట్ల లౌడ్ నెస్ ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది కానీ జానర్ కు తగ్గట్లు వైవిధ్యమైన, ఎంగేజింగ్ రీరికార్డింగ్ తో ఆకట్టుకున్నాడు సన్నీ. ఆర్ట్ వర్క్ కూడా సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. లొకేషన్లు ఎక్కడా మొనాటనీ అనిపించకుండా డిజైన్ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. పంచ్ లు ప్రాసలు లేకుండా సింపుల్ డైలాగ్స్ తో ఎలా వినోదం రాబట్టవచ్చో ‘భలే మంచి రోజు’ చూస్తే తెలుస్తుంది. ఇక దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తొలి సినిమాతోనే బలమైన ముద్ర వేశాడు. తొలి సినిమాకు ఏదో సేఫ్ గేమ్ ఆడేయకుండా ఓ భిన్నమైన సినిమాను అందించాలనే శ్రీరామ్ తపనకు అభినందనలు తెలపాలి. అతడి దగ్గర ఫ్రెష్ ఐడియాస్ ఉన్నాయి. ఆ ఐడియాలన్నింటినీ తెలివిగా సినిమాలో ప్లేస్ చేశాడు. క్రైమ్ కామెడీ జానర్ పై అతడికున్న గ్రిప్ ప్రతి సన్నివేశంలో తెలుస్తుంది. తెలుగు తెరకు శ్రీరామ్ రూపంలో మరో ప్రతిభావంతుడైన దర్శకుడు దొరికాడనడంలో సందేహం లేదు.

చివరగా: భలే.. భలే మంచి రోజు

రేటింగ్: 3/5