Begin typing your search above and press return to search.

శ్రీమంతుడిని ఓడించిన భరత్

By:  Tupaki Desk   |   28 April 2018 6:05 PM IST
శ్రీమంతుడిని ఓడించిన భరత్
X
రెండున్నరేళ్ల కిందట ‘శ్రీమంతుడు’తో అమెరికాలో వసూళ్ల మోత మోగించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ చిత్రం నాన్-బాహుబలి రికార్డును అలవోకగా బద్దలు కొట్టేసింది. ఏకంగా 2.89 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. అప్పటి నుంచి ఆ రికార్డును దాటడానికి చాలా సినిమాలు ప్రయత్నించాయి. కానీ కుదర్లేదు. ఎట్టకేలకు కొన్ని రోజుల కిందటే ‘రంగస్థలం’ విడుదలై భారీ వసూళ్లు సాధించింది. ఆ చిత్రం విడుదలైన రెండు వారాలకు ‘శ్రీమంతుడు’ను దాటింది. ఇప్పుడా చిత్రం 3.5 మిలియన్ డాలర్లకు చేరువగా ఉంది. ఐతే ‘రంగస్థలం’ రికార్డుపై వెంటనే అటాక్ మొదలైపోయింది. గత వారం విడుదలైన మహేష్ సినిమా ‘భరత్ అనే నేను’ ఆరంభం నుంచి అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తోంది.

ఈ చిత్రం ‘శ్రీమంతుడు’ను దాటేసి మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ అయింది. ప్రస్తుతం యుఎస్ లో ‘భరత్ అనే నేను’ వసూళ్లు 3 మిలియన్ డాలర్లకు అత్యంత చేరువగా ఉన్నాయి. ప్రస్తుతం యుఎస్‌ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో తొలి రెండు స్థానాలు ‘బాహుబలి: ది కంక్లూజన్’.. ‘బాహుబలి: ది బిగినింగ్’వే. ‘రంగస్థలం’ మూడో స్థానంలో కొనసాగుతోంది. ‘భరత్ అనే నేను’ నాలుగో స్థానానికి చేరుకుంది. ‘రంగస్థలం’ 3.5 మిలియన్ల దగ్గర ఆగే అవకాశముంది. ఈ వీకెండ్లో వసూళ్లను బట్టి మహేష్ మూవీ దాన్ని దాటుతుందా లేదా అన్నది తేలుతుంది. దాదాపుగా ఆ రికార్డును ఇది అందుకుంటుందనే భావిస్తున్నారు. వచ్చే వారం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ భారీ అంచనాల మధ్య విడుదలవుతోంది. దాని టాక్ ను బట్టి ‘భరత్ అనే నేను’ ఫుల్ రన్ వసూళ్లు ఎంత అన్నది ఆధారపడి ఉంటుంది.