Begin typing your search above and press return to search.

తమిళనాట మహేష్ దంచేశాడే..

By:  Tupaki Desk   |   8 May 2018 8:21 AM GMT
తమిళనాట మహేష్ దంచేశాడే..
X
అల్లు అర్జున్ కు అనుకోకుండా కేరళలో మాంచి ఫాలోయింగ్ వచ్చింది. ఆటోమేటిగ్గా అక్కడ అతడి మార్కెట్ పెరిగింది. తెలుగులో మరే హీరోకు లేని స్థాయిలో అతడి సినిమాలు మలయాళంలో విడుదలవుతాయి. బన్నీకి అదొక అదనపు ఆస్తిలా మారింది. పొరుగు రాష్ట్రాల్లో మార్కెట్ కోసం మన హీరోలు తపించిపోతున్నది ఇందుకే. ఒకసారి మార్కెట్ క్రియేట్ అయితే.. కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వెళ్తే అది మంచి స్థాయికి చేరుతుంది. రజినీకాంత్.. కమల్ హాసన్.. సూర్య.. కార్తి లాంటి హీరోలకు తెలుగులో అలాగే మార్కెట్ క్రియేటైంది. ఒకప్పుడు తెలుగు హీరోలు వేరే రాష్ట్రాల మార్కెట్ ను అంతగా పట్టించుకునేవాళ్లు కాదు కానీ.. గత కొన్నేళ్లలో వాళ్ల ఆలోచన తీరు మారింది. మహేష్ బాబు గత కొన్నేళ్ల నుంచి తమిళనాట మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

ఈ క్రమంలోనే ‘స్పైడర్’ సినిమాను తమిళంలో కూడా చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తమిళనాట మహేష్ అంటే ఎవరో తెలిసేలా చేసింది. అతడికి ఫాలోయింగ్.. మార్కెట్ తీసుకొచ్చింది.

ఆ ప్రభావం ‘భరత్ అనే నేను’ విషయంలో కనిపించింది. ఇంతకుముందు ఏ మహేష్ సినిమాకూ లేని స్థాయిలో తమిళనాట ఈ చిత్రానికి వసూళ్లు వచ్చాయి. నేరుగా తెలుగు వెర్షనే తమిళనాట రూ.4.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమా కూడా తమిళనాట ఇంత వసూళ్లు రాబట్టలేదు. ‘బాహుబలి’ తమిళ వెర్షన్ తమిళనాట ఇరగాడేసింది కానీ.. ఆ చిత్ర తెలుగు వెర్షన్ కూడా ఈ స్థాయిలో కలెక్షన్లు తెచ్చుకోలేదు. ‘భరత్ అనే నేను’ అక్కడి బయ్యర్‌ కు మంచి లాభాలందించింది. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వందకు పైగా స్క్రీన్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం విశేషం. చెన్నైలో మాత్రమే ఈ చిత్రం 1.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం గమనార్హం.