Begin typing your search above and press return to search.

నాయక్‌ ముగించి సింగ్ మొదలు పెట్టనున్న పవన్‌

By:  Tupaki Desk   |   28 Sep 2021 7:30 AM GMT
నాయక్‌ ముగించి సింగ్ మొదలు పెట్టనున్న పవన్‌
X
పవన్ కళ్యాణ్ హీరోగా వరుస సినిమాలు రూపొందుతున్నాయి. ప్రస్తుతం సాగర్ చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్‌ సినిమాను చేస్తున్న పవన్ మరో వైపు క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాను చేస్తున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం భీమ్లా నాయక్‌ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. మలయాళం హిట్ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ కు రీమేక్ గా రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించాడు. రానా మరియు పవన్ లు కలిసి నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ అతి త్వరలోనే ముగించబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. భీమ్లా నాయక్‌ షూటింగ్ పూర్తి అయిన వెంటనే పవన్‌ కళ్యాణ్ గ్యాప్ తీసుకోకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దసరా సందర్బంగా పవన్ కళ్యాణ్‌ మరియు హరీష్‌ శంకర్ ల భవదీయుడు భగత్‌ సింగ్ సినిమాకు కొబ్బరి కాయ కొట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో గబ్బర్ సింగ్ మూవీ వచ్చి సూపర్‌ హిట్ అయ్యింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వీరి కాంబో మూవీ పట్టాలెక్కుతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవలే టైటిల్‌ ను రివీల్‌ చేసి సినిమాపై ఉన్న అంచనాలను పెంచిన దర్శకుడు హరీష్ శంకర్ దాదాపు ఏడాదిన్నర కాలంగా స్క్రిప్ట్‌ కు మెరుగులు పెడుతూనే ఉన్నాడు. పవన్‌ ను అభిమానించే గబ్బర్‌ సింగ్‌ డైరెక్టర్ హరీష్‌ శంకర్ ఖచ్చితంగా భవదీయుడు భగత్‌ సింగ్‌ సినిమాను అభిమానులు మెచ్చే విధంగా తీయడం ఖాయం అన్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాను దసరాకు ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ చివరి వరకు లేదా దసరా సీజన్ లో అయినా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

వచ్చే ఏడాదిలో పవన్‌ కళ్యాణ్‌ నటించిన భీమ్లా నాయక్‌.. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమాతో పాటు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న భవదీయుడు భగత్‌సింగ్‌ సినిమా కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. పవన్‌ అభిమానులు గతంలో ఎప్పడు కూడా ఒకే ఏడాది ఆయన నుండి మూడు సినిమాలు వస్తాయని ఆశించి ఉండరు. ఇప్పుడు ఆయన వరుస సినిమాలను చేస్తూ అభిమానుల కోరిక తీర్చుతున్నాడు. ఈ మూడు కాకుండా మరి కొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. ఖచ్చితంగా పవన్‌ నుండి మరిన్ని సినిమాలు వస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు సాధ్యం అయినన్ని ఎక్కువ సినిమాలను చేయాలని పవన్‌ భావిస్తున్నాడు. అందుకే తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసేలా ప్లాన్‌ చేసుకున్నాడు.