Begin typing your search above and press return to search.

పుకార్లకు చెక్ పెట్టిన 'భీమ్లా నాయక్' డైరెక్టర్!

By:  Tupaki Desk   |   18 Feb 2022 11:21 PM IST
పుకార్లకు చెక్ పెట్టిన భీమ్లా నాయక్ డైరెక్టర్!
X
'వకీల్ సాబ్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్, ఆ తరువాత సినిమాగా 'భీమ్లా నాయక్' సినిమా చేశారు. మలయాళంలో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి ఇది రీమేక్. ఇద్దరు వ్యక్తుల మధ్య ఈగోలకు సంబంధించిన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

మలయాళంలో రెండు పాత్రలకు సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. రెండు పాత్రల పేర్లను కలుపుతూనే టైటిల్ ను సెట్ చేశారు కూడా. కానీ తెలుగులో పవన్ కల్యాణ్ కి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన పాత్రను హైలైట్  చేయడం జరిగింది. ఆయన పాత్ర పేరునే టైటిల్ గా పెట్టడం జరిగింది.

తెలుగులో ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు. అయితే సాగర్ కె చంద్ర గురించి ప్రేక్షకులకు అంతగా తెలియదు. ఈ సినిమా షూటింగు మొదలుపెట్టిన దగ్గర నుంచి త్రివిక్రమ్ ఎక్కువగా సెట్స్ పై కనిపించారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించారు. అంతేకాదు టైటిల్ సాంగ్ కూడా రాశారు.

ఇక ఈ సినిమాను సితార బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇది త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ గా చెప్పబడే 'హారిక అండ్ హాసిని' బ్యానర్ కి అనుబంధ సంస్థ వంటిది. ఈ బ్యానర్ లపై వచ్చే సినిమాలలో త్రివిక్రమ్ జోక్యం .. ఆయన పర్యవేక్షణ ఉంటుంది.

అందువలన ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి త్రివిక్రమ్ పేరు ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది. దాంతో సాగర్ సైడ్ అయిపోయాడనీ, దర్శకత్వ బాధ్యతలు త్రివిక్రమ్ చేతికి వచ్చాయని చెప్పుకోవడం మొదలుపెట్టారు. అటు నిర్మాతల వైపు నుంచి .. ఇటు పవన్ వైపు నుంచి ఒత్తిడి రావడంతో దాదాపు త్రివిక్రమ్ హ్యాండిల్ చేశారని చెప్పుకుంటున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా షూటింగు పూర్తయిందని సోషల్ మీడియా ద్వారా సాగర్ కె చంద్ర వెల్లడించడం .. పవన్ తో సెట్లో దిగిన ఫొటోను షేర్ చేయడంతో ఆయనే దర్శకత్వం చేశాడనే ఒక నమ్మకం అందరికీ కుదిరింది.

'భీమ్లా నాయక్'గా పవన్ కనిపించే ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రను రానా పోషించాడు. ఈ రెండు పాత్రలు పవర్ఫుల్ కావడం ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించే ప్రధానమైన అంశం. పవన్ భార్య పాత్రలో నిత్యామీనన్ అలరించనుండగా, రానా జోడీగా సంయుక్త మీనన్ ఆకట్టుకోనుంది.

సముద్రఖని .. బ్రహ్మానందం .. మురళీ శర్మ ముఖ్యమై పాత్రలలో కనిపించనున్నారు. తమన్ స్వరపరిచిన బాణీలకు ఇప్పటికే అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో పవన్ మరో సంచలనానికి తెరతీస్తారేమో చూడాలి.