Begin typing your search above and press return to search.

RRR వ‌ర్సెస్ భీమ్లా నాయక్! స‌యోధ్య‌ కుదిరేదెలా!?

By:  Tupaki Desk   |   17 Nov 2021 5:30 AM GMT
RRR వ‌ర్సెస్ భీమ్లా నాయక్! స‌యోధ్య‌ కుదిరేదెలా!?
X
ఒకే సీజ‌న్ లో రెండు భారీ చిత్రాలు రిలీజ‌వ్వ‌డం అన్న‌ది ఎప్పుడూ బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ల‌కు మంచిది కాదు. రెండు సినిమాల మ‌ధ్యా షేరింగ్ వ‌ల్ల పెద్ద న‌ష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. తొలి వీకెండ్ తో రిజ‌ల్ట్ తేలిపోతున్న ఈ రోజుల్లో ఒకేసారి రెండు పెద్ద సినిమాల్ని రిలీజ్ చేసేందుకు నిర్మాత‌లు సిద్ధంగా ఉండ‌రు. కానీ ఇప్పుడున్న క్రైసిస్ లో త‌ప్ప‌డం లేదు. ఇప్పుడు సంక్రాంతి బ‌రిలో విడుద‌ల‌వుతున్న చిత్రాల‌కు ఇదే స‌మ‌స్య త‌లెత్తింది.

సంక్రాంతి పందెంలో మా పుంజు రెడీ అంటూ భీమ్లా నాయ‌క్ నిర్మాత‌లు ప్ర‌క‌టించ‌గానే ఇక ముక్కోణ‌పు పోటీ ఖాయ‌మైంది. ఆర్.ఆర్.ఆర్- రాధేశ్యామ్ లాంటి రెండు అసాధార‌ణ బ‌డ్జెట్ చిత్రాల‌తో భీమ్లా నాయ‌క్ ధీటుగా పోటీప‌డేందుకు ప్ర‌ణాళిక‌ల్ని రెడీ చేస్తున్నాడ‌ని అర్థ‌మైంది. అయితే ఇక్కడే మ‌రో సందేహం వెంటాడింది. సంక్రాంతి బ‌రిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర్సెస్ రామ్ చ‌ర‌ణ్ ఎపిసోడ్ ఇరువ‌ర్గాల‌కు ఇబ్బందిక‌ర‌మేన‌న్న విశ్లేష‌ణ‌ను సాగిస్తున్నారు. రెండు మెగా సినిమాల మ‌ధ్య క్లాష్ బాక్సాఫీస్ వ‌ద్ద న‌ష్టానికి తావిస్తుంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. థియేట‌ర్ల స‌ర్ధుబాటు అన్న‌ది పెద్ద త‌ల‌నొప్పి వ్య‌వ‌హారం. పైగా మెగాభిమానులు డివైడ్ అయ్యి సినిమాలు చూడ‌డం ద్వారా ఓపెనింగ్ క‌లెక్ష‌న్లు.. రికార్డుల‌కు కూడా ఇబ్బందే.

అందుకే ఇప్పుడు సీన్ లోకి మెగాస్టార్ ప్ర‌వేశిస్తార‌ని ఆర్.ఆర్.ఆర్ .. భీమ్లా నాయ‌క్ మేక‌ర్స్ న‌డుమ స‌యోధ్య‌ను కుదిర్చి ఇబ్బంది లేకుండా ఆదుకుంటార‌ని భావిస్తున్నారు. చిరు కోరితే ప‌వ‌న్ కాద‌న‌రు. అందుకే అన్న‌య్య‌ను బ‌రిలో దించే అవ‌కాశం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే `భీమ్లా నాయ‌క్` టీమ్ వెన‌క్కి త‌గ్గేదే లేదు! అన్నంత‌ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఇక‌పోతే భీమ్లా నాయ‌క్ సోలోగా విడుద‌లైతే ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంతో చిక్కులు ఉన్నాయ‌ని మ‌రో కోణాన్ని కూడా విశ్లేషిస్తున్నారు. ప‌వ‌న్ ని ప‌వ‌న్ సినిమాని పొలిటిక‌ల్ గా టార్గెట్ చేస్తే అది ఇబ్బందిక‌రం. అందువ‌ల్ల సోలోగా రావ‌డం ప్రమాద‌ర‌కం అని విశ్లేషించి ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ తో పాటే రావాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు మ‌రో సెక్ష‌న్ నుంచి గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి రాజ‌కీయ కార‌ణాల‌తో సినిమాలు సంక‌టంలో ప‌డ‌డం స‌రికాద‌ని విశ్లేషిస్తున్నారు. ఇక రెండు మెగా సినిమాల క్లాష్ లేకుండా చిరు ప్ర‌య‌త్నిస్తారా లేదా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. మ‌రోవైపు ఈ రెండు సినిమాల తో పోటీప‌డుతూ థియేట‌ర్ల‌ను షేర్ చేసుకునేందుకు రాధేశ్యామ్ నుంచి పోటీ ఎలానూ ఉండ‌నే ఉంది.