Begin typing your search above and press return to search.

కేవలం 2 గంటల 10 నిమిషాల నిడివితో 'భీమ్లా నాయక్'..?

By:  Tupaki Desk   |   24 Jan 2022 7:27 AM GMT
కేవలం 2 గంటల 10 నిమిషాల నిడివితో భీమ్లా నాయక్..?
X
పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ''భీమ్లా నాయక్''. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రానికి అధికారిక రీమేక్ అనే సంగతి తెలిసిందే. అయితే ఒరిజినల్ వెర్షన్ తో పోల్చుకుంటే తెలుగు రీమేక్ రన్ టైం చాలా తగ్గిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమా నిడివి 175 నిమిషాలు ఉంటుంది. అంటే దాదాపు మూడు గంటలు. అయితే ఇక్కడ తెలుగు వెర్షన్ రన్ టైం విషయంలో మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. సినిమా మొత్తం నిడివి కూడా కేవలం 2 గంటల 10 నిమిషాలు మాత్రమే ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో నుంచి చాలా తక్కువ నిడివితో వస్తోన్న సినిమా ఇదేనని చెప్పవచ్చు.

వాస్తవానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మాతృక స్క్రిప్ట్ లో అనేక మార్పులు చేర్పులు చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని స్టార్ డమ్ ని దృష్టిలో పెట్టుకొని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని.. సాంగ్స్ ని కూడా జత చేశారు. మరో హీరో రానా కంటే పవన్ పాత్రకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రచార చిత్రాలు మరియు సినిమా టైటిల్ ని బట్టి అర్థం అవుతోంది.

కాకపోతే స్క్రీన్ ప్లే మరింత గ్రిప్పింగ్ గా ఉండేందుకు సినిమా రన్ టైం మరీ రెండు గంటల పది నిమిషాలకు కుదించడం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ''భీమ్లా నాయక్'' చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందన తెచ్చుకుంది. పట్టుదల గల పోలీసు అధికారి - మాజీ సైనికాధికారి మధ్య అహం ఆత్మాభిమానం నేపథ్యంలో జరిగిన వైరాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు.

భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యా మీనన్.. రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రావు రమేష్ - మురళీశర్మ - సముద్ర ఖని - రఘుబాబు - నర్రా శ్రీను - కాదంబరి కిరణ్ - చిట్టి - పమ్మి సాయి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్న ఈ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు అన్నీ అనుకున్నట్లు జరిగి పరిస్థితులు అనుకూలిస్తే 'భీమ్లానాయక్' శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25న విడుదల అవుతుంది. ఒకవేళ కుదరకపోతే సమ్మర్ సీజన్ లో మరో మంచి తేదీని వెతుక్కోవాల్సి ఉంటుంది.