Begin typing your search above and press return to search.

ఏజ్ లెస్ బ్యూటీ భూమిక ఈ షాక్ లేంటి?

By:  Tupaki Desk   |   17 Feb 2022 4:30 AM GMT
ఏజ్ లెస్ బ్యూటీ భూమిక ఈ షాక్ లేంటి?
X
ఏజ్ లెస్ బ్యూటీ భూమికా చావ్లా ఇటీవ‌ల టాలీవుడ్ లో క్యారెక్ట‌ర్ న‌టిగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. స్టార్ హీరోయిన్ గా ద‌శాబ్ధం పాటు ఏలిన భూమిక ఆ త‌ర్వాత యోగా గురూ భ‌ర‌త్ ఠాకూర్ ని పెళ్లాడారు. ఫ్యామిలీ లైఫ్ ని దుబాయ్ లో స్పెండ్ చేశారు. కానీ ఇటీవ‌ల తిరిగి టాలీవుడ్ లో త‌న కెరీర్ ని కొన‌సాగిస్తున్నారు.

ఇక‌పోతే సోష‌ల్ మీడియాల్లో ఇత‌ర తార‌ల్లానే భూమిక కూడా త‌న‌దైన శైలిలో ప్ర‌చారంతో ఆక‌ట్టుకుంటున్నారు. తాజాగా ఇన్ స్టాలో భూమిక షేర్ చేసిన ఓ వీడియో అంతర్జాలంలో వైర‌ల్ గా మారింది. సీనియ‌ర్ న‌టి భూమిక కెరీర్ లోనే ఖుషీ మ‌ర‌పురాని హిట్ గా నిలిచింది. ఈ మూవీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ తో భూమిక కెమిస్ట్రీ ఒక రేంజులో వ‌ర్క‌వుటైంది. ఖుషీ మూవీ మ్యూజిక‌ల్ హిట్ గాను నిలిచింది. ఈ మూవీ నుంచి అమ్మాయే స‌న్న‌గా అర‌న‌వ్వే న‌వ్వ‌గా పాట‌కు తాజాగా భూమిక స్టెప్పులేశారు. త‌న డియ‌రెస్ట్ ఫ్రెండ్ కం డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ స‌విత రాధాకృష్ణ‌న్ తో క‌లిసి భూమిక చావ్లా ఈ పాట‌కు డ్యాన్స్ చేస్తున్న వీడియో అంత‌ర్జాలంలో షేక్ చేస్తోంది. దాదాపు 21 ఏళ్ల త‌ర్వాత అదే మ్యాజిక్ ని రీక్రియేట్ చేస్తున్నందుకు ఆనందం వ్య‌క్తం చేసింది. ఇన్నేళ్లుగా భూమిక‌కు స‌విత అనువాద‌కురాలిగా ప‌ని చేస్తున్నారని కూడా భూమిక వెల్ల‌డించింది.

ఖుషీ టైమ్స్ నుంచి త‌న‌ను ప్రేమించి అభిమానించినందుకు అభిమానులంద‌రికీ భూమిక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 40 ప్ల‌స్ లోనూ భూమిక ఎంతో ఎన‌ర్జిటిక్ గా డ్యాన్సులు చేస్తుంటే అభిమానులు అంతే ఖుషీ ఫీల‌య్యారు. తిరిగి త‌న నుంచి పాత రోజుల్లోని గ్రేస్ ని ఆశిస్తున్నారు. స‌హాయ న‌టిగానే కాకుండా.. త‌న స్థాయికి త‌గ్గట్టు నాయికా ప్ర‌ధాన పాత్ర‌ల‌తోనూ మెప్పిస్తుందేమో చూడాలి.

21 వ‌సంతాల కల్ట్ క్లాసిక్ `ఖుషి`

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - భూమిక జంట‌గా ఎస్.జె.సూర్య తెర‌కెక్కించిన క‌ల్ట్ క్లాసిక్ చిత్రం ఖుషి. ఎస్.జె.సూర్య ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ స్నేహితుడు.. శ్రీ‌సూర్య మూవీస్ ఏ.ఎం.ర‌త్నం నిర్మించారు. ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన త‌మిళ చిత్రం ఖుషికి తెలుగు రీమేక్ ఇది. ప‌వ‌న్ కెరీర్ బెస్ట్ హిట్స్ లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమాలో ప‌వ‌న్ మ్యాన‌రిజం.. యాక్ష‌న్ .. పాట‌లు.. డైలాగులు ప్ర‌తిదీ హైలైట్. ముఖ్యంగా భూమిక‌తో ప‌వ‌న్ స‌న్నివేశాల్లోని పెప్ ని తెలుగు ప్రేక్ష‌కులు ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. అందునా ఆ బొడ్డు స‌న్నివేశం అస‌లే మ‌రువ‌రు. ఇక బాక్సాఫీస్ వ‌ద్ద ఆ రోజుల్లోనే 20కోట్ల వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించిన ఈ చిత్రం రిలీజై ఇప్ప‌టికి 21 ఏళ్లు.

ఈ సినిమా క‌థాంశం కూడా ఎంతో ఇంట్రెస్టింగ్. కలకత్తా లోని ఒక ధనిక కుటుంబానికి చెందిన సిద్ధూ సిద్ధార్థ రాయ్(ప‌వ‌న్). ఉన్నత విద్య కోసమై కెనడా బయలు దేరుతాడు. ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే దారిలో రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. విదేశీ విద్యావకాశం చేజారటంతో హైదరాబాదులో నే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరతాడు.

కైకలూరు లోని ఉన్నత కుటుంబానికి చెందిన మధుమిత(భూమిక‌)కి జరగవలసిన పెళ్ళిచూపుల్లో వరుడు తాను ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోతున్నాని లేఖ రాయటంతో ఆ పెళ్ళి చూపులు రద్దు అవుతాయి. ఉన్నత విద్య అంటే ఎంతో ఇష్టపడే మధు కూడా అదే విశ్వవిద్యాలయంలో సిద్ధుకి పరిచయం అవుతుంది. వీరిరువురి స్నేహితులు ప్రేమికులు కావటంతో వారి ప్రేమకి సాయపడటంలో సిద్ధూ- మధు ఒకరికొకరు దగ్గరవుతారు.

మనసులో ఒకరి పై ఒకరికి ప్రేమ ఉన్నా దానిని ఒకరికొకరు వ్యక్తీకరించుకోని గంభీర స్వభావులు వీరిరువురు. తన దూకుడు స్వభావం వలన సిద్ధూ మధు మనసులో స్థానం కోల్పోతాడు. మాటా మాటా పెరిగి తన లాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవలసి వస్తే,.. తనకి ఆ పెళ్ళి ఇష్టం లేదని ఉత్తరం రాసి పారిపోతానన్న సిద్ధు మాటలకి నొచ్చుకొంటుంది మధు. మొండితనంతో మధు సిద్ధూకు మరింత దూరం అవుతుంది. తాము స్నేహితులు కాలేమని... తమ మధ్య ఎటువంటి సంబంధం లేదని ప్రేమ జంటని కలపటానికి మాత్రమే తాము ప్రయత్నిస్తున్నామని మాటి మాటికి సిధ్ధుకు గుర్తు చేస్తు ఉంటుంది మధు. ఇరువురి తోడ్పాటుతో ప్రేమ జంట ఏకం అవుతుంది. విడదీసిన విధే సిద్ధూ- మధు లను ఎలా కలిపింది? సిద్ధూ- మధులు వారి వారి స్వభావాలని అధిగమించారా లేదా? వివాహానంతరం సిద్ధూ- మధులు జీవితాన్ని ఎలా గడపబోతారు?? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రానికి శుభం కార్డు.

తమిళ మూలంలో నాయికానాయకుల పాత్రల తీవ్రత.. ప్రాముఖ్య‌త ఇంచుమించు సమానంగా ఉంటాయి. కానీ తెలుగులో నాయకుడి పాత్రే పై చేయి. కే కేతో మణి శర్మ పాడించిన పూర్తి నిడివి హిందీ గీతం `యే మేరా జహాన్ ..` తెలుగు చిత్ర రంగంలో నే మొట్టమొదటి ప్రయోగం.

ద్వితీయార్థంలో జరిగే కార్నివాల్ ఫైట్ కి పవన్ స్వయంగా దర్శకత్వం వహించారు. దీని చిత్రీకరణకి ఉపయోగించిన కెమేరా పనితనం మార్షల్ ఆర్ట్స్ అతనిలోని సృజనాత్మకతకి పరాకాష్టలు.

`ఖుషి` మ‌రిన్ని విశేషాలు:

*మిస్సమ్మ లోని ఆడువారి మాటలకు అర్ధాలే వేరులేని ఈ చిత్రంలో రీ-మిక్స్ చేశారు.

* సిద్ధూ- మధులు పసిపాపలుగా ఉన్నప్పుడు వారిని వెంటేసుకుని వారి తల్లిదండ్రులు హైదరాబాదులో ఒకే చీరల దుకాణానికి వస్తారు. ప్రక్కప్రక్కనే కూర్చున్న ఆ తల్లుల ఒళ్ళలో ఉన్న ఆ పసిపాపలు ఒకరినొకరు చేతులతో స్పృశించుకొని పరవశంతో కేరింతలు కొడతారు. ఆ దృశ్యం.. అప్పుడు వినిపించే నేపథ్య సంగీతం అత్యంత రమణీయంగా ఉంటాయి.

*బై బై యే బంగారు రమణమ్మ, రంగబోతి ఓ రంగబోతి వంటి జానపద గీతాలను ఈ చిత్రంలో పవన్ స్వయంగా ఆలపించటం విశేషం. (ఇవి కేవలం చిత్రానికే పరిమితం. ఆడియో క్యాసెట్/సిడి లలో ఇవి లేవు.) రంగబోతి ఓ రంగబోతి గీతం ఉదయ్ కిరణ్ నటించిన శ్రీ రాం చిత్రంలో ఒక ముఖ్య గీతం.

*ఎయిర్ పోర్టుకు వెళ్ళే దారిలో కథానాయకుడు ఎదుర్కొనే దుర్ఘటనకి కారకుడు అయిన అయోమయ చక్రవర్తి పాత్ర రెండు భాషల్లోనూ ఎస్. జే. సూర్య నే పోషించటం విశేషం.

*ఈ చిత్రానికి కాస్ట్యూమ్ లను రేణు దేశాయ్ రూపొందించారు.