Begin typing your search above and press return to search.

మా ఎల‌క్ష‌న్.. అగ్ర హీరోలు ప‌ట్టించుకోరేం?

By:  Tupaki Desk   |   25 Jun 2021 3:30 AM GMT
మా ఎల‌క్ష‌న్.. అగ్ర హీరోలు ప‌ట్టించుకోరేం?
X
తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రెండేళ్ల‌కొక‌సారి జ‌రిగే `మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్) ఎన్నిక‌లు ఎప్పుడూ ర‌స‌వ‌త్త‌రంగానే సాగుతుంటాయి. రెండు వ‌ర్గాల మ‌ధ్యా నువ్వా..నేనా అన్న‌ట్లు పోటీ ఉంటుంది. ఘ‌ర్ష‌ణ‌ల‌కు..వ్య‌క్తిగ‌త వివాదాల‌కు తావిచ్చిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. కాల‌క్ర‌మేణా మా ఎన్నిక‌లు అంటే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్నే త‌ల‌పిస్తున్నాయ‌న్న టాక్ వ‌చ్చింది.

ఈసారి కూడా ఎన్నిక‌ల సీన్ చూస్తుంటే పోటీ కూడా తీవ్రంగానే క‌నిపిస్తోంది. అధ్య‌క్ష ప‌ద‌వికి కీల‌క వ్య‌క్తులు బ‌రిలోకి దిగుతున్నారు. ఈసారి చ‌తుర్ముఖ పోరు క‌నిపిస్తుంది. మంచు విష్ణు- ప్ర‌కాష్ రాజ్-జీవిత రాజ‌శేఖ‌ర్ - న‌టి హేమ పేర్లు ఇప్ప‌టికే వినిపిస్తున్నాయి. త‌మ బ‌లాబ‌లాలు నిరూపించుకునేందుకు వీరంతా స‌మాయ‌త్తం అవుతున్నారు.

ప్ర‌తిసారీ మా ఎన్నిక‌ల్లో ఓటింగ్ శాతం చాలా త‌క్కువ‌గానే ఉంటుంది. దాదాపు 950 మంది స‌భ్యులున్నా కానీ.. పోలింగ్ బూతుకు వ‌చ్చి ఓట్లు వేసేవాళ్లు మాత్రం ఎప్పుడూ త‌క్కువే. ముఖ్యంగా అగ్ర హీరోలెవ్వ‌రూ ఎన్నికల్లో ఓట్లు వేయ‌డానికి ఆస‌క్తిగా ఉండ‌ర‌ని చాలాసార్లు ప్రూవ్ అయింది. కొంత మంది పేరున్న హీరోలు త‌ప్ప భారీ పారితోషికాలు తీసుకునే హీరోలెవ‌రూ మా ఎన్నిక‌ల వైపు చూడ‌రు. ఈ వ్య‌వ‌హారంపై ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. అయితే ఎన్నిక‌ల స‌మ‌యంలో అగ్ర హీరోలు అందుబాటులో లేకపోవ‌డం...ఔట్ డోర్ షూటింగ్ ల్లో ఉండ‌టంతో రాలేక‌పోతున్నామనే స‌మాధానాలు వినిపిస్తుంటాయి. ఇక ఈ ఏడాది అస‌లే క‌రోనా వెంటాడుతోంది కాబ‌ట్టి చాలా మంది ఎన్నిక‌ల‌కు స్కిప్ కొట్టేందుకే ఆస్కారం ఎక్కువ‌. ముఖ్యంగా అగ్ర హీరోలు .. టాప్ రేంజు స్టార్లు ఎన్నిక‌ల్లో పాల్గొన‌క‌పోవ‌చ్చ‌ని భావిస్తున్నారు.

దానికి అస‌లు కార‌ణం ఏది అయినా కానీ అలా అగ్ర హీరోలు డుమ్మా కొట్ట‌డం మాత్రం మా అసోసియేష‌న్ లో క‌నిపించే ప్ర‌ధాన లోపం. మ‌రి ఆ లోపం స‌వ‌రించ‌డంలో పెద్ద‌లు త‌డ‌బ‌డుతున్నారా? లేక హీరోలే కావాల‌ని ముఖం చాటేస్తున్నారా..? అన్న‌ది తెలియాల్సి ఉంది.

`మా ` అనేది ఆర్టిస్టుల సంక్షేమం కోసం ఏర్ప‌డ్డ అసోసియేష‌న్ . ద‌శాబ్ధాల చ‌రిత్ర క‌లిగిన‌ది. విదేశాల్లో సైతం ఈవెంట్లు జ‌రుపుకునే స్థాయిని నేడు `మా ` చేరుకుంది. కానీ సొంత భాష న‌టులే ఇలా ఓటింగ్ లో పాల్గొనక పోవ‌డం శోచ‌నీయం.

కోలీవుడ్ లో న‌డిఘ‌ర్ సంఘం ఎన్నికంటే అక్క‌డ ప్ర‌తీ అగ్ర హీరో ఓ బాధ్య‌త‌గా తీసుకుని త‌ప్ప‌క హాజరై ఓటు హ‌క్కును వినియోగించుకుంటారు. కానీ ఇక్క‌డ ఆ ప‌రిస్థితి లేదు. అయితే `మా` నిర్వ‌హించే సేవా కార్య‌క్ర‌మాలు..ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ కు సంబంధించి విరాళాలు ఇవ్వ‌డంలో మాత్రం టాలీవుడ్ అగ్ర హీరోలు ఎప్పుడూ ముందుంటారు అన్న‌ది వాస్త‌వం. విప‌త్తులొచ్చినా... మా మెంబ‌ర్ల‌ల‌లో ఎవ‌రికైనా వ్య‌క్తిగ‌త స‌హాయాలు చేయాల‌న్నా విష‌యం అగ్ర‌ హీరోల దృష్టికి చేరిందంటే స‌హాయం అనేది క‌చ్చితంగా అందుతుంది. మ‌రి ఈ ఏడాది జ‌రిగే `మా` ఎన్నిక‌ల్లో ఎంత మంది అగ్ర హీరోలు పాల్గొంటారో చూద్దాం.