Begin typing your search above and press return to search.

‘బిగ్ బాస్’ ఎవరికి ప్లస్?

By:  Tupaki Desk   |   25 Sep 2017 1:30 PM GMT
‘బిగ్ బాస్’ ఎవరికి ప్లస్?
X
అనేక సందేహాల మధ్య మొదలై.. అంచనాల్ని తలకిందులు చేస్తూ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న తెలుగు ‘బిగ్ బాస్’ తొలి సీజన్ అయిపోయింది. ముందు నుంచి ఉన్న అంచనాల్ని మారుస్తూ.. చివరికి ఈ షోలో శివ బాలాజీ విజేతగా నిలిచాడు. ఫేవరెట్ అనుకున్న హరితేజ మూడో స్థానానికి పరిమితమైంది. ఆదర్శ్ బాలకృష్ణ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. విజేతగా నిలిచిన శివబాలాజీకి రూ.50 లక్షల ప్రైజ్ మనీ దక్కగా.. మిగతా వాళ్లకు వాళ్లు ఎలిమినేట్ అయిన దశను బట్టి పేమెంట్లు జరిగాయి. ఐతే ఈ ఆర్థిక ప్రయోజనం సంగతి పక్కన పెడితే.. అసలు ఈ షో వల్ల వీళ్లకు కలిగిన అదనపు ప్రయోజనం ఏంటి.. వీళ్ల కెరీర్లకు ఈ షో ఏమేరకు ఉపయోగపడుతుందన్న చర్చ మొదలైందిప్పుడు.

‘బిగ్ బాస్’ షో వల్ల అందరికంటే ఎక్కువ గెయిన్ అయ్యేది హరితేజ అన్న అభిప్రాయం ఉంది. ఆమె సినిమాల్లో బాగా బిజీ అయ్యే అవకాశముంది. విజేత శివబాలాజీకి.. రన్నరప్ ఆదర్శ్.. నాలుగు.. ఐదు స్థానాల్లో నిలిచిన నవదీప్.. అర్చనల కెరీర్లు కూడా కొంచెం పుంజుకునే అవకాశాలున్నాయి. ఫైనల్ ముంగిట ఎలిమినేట్ అయిన ప్రిన్స్ కూడా బాగానే పాపులరయ్యాడు కాబట్టి అతడికీ అవకాశాలు పెరగొచ్చు. వాళ్లకు వచ్చిన గుర్తింపును ఫిలిం మేకర్స్ బాగానే వాడుకునే అవకాశముంది. ఐతే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుకు ఈ షో చేటే చేసింది. షో ఆరంభంలోనే రభస రభస చేసి నిష్క్రమించడంతో అతడి ఇమేజ్ దెబ్బతింది. అలాగే సింగర్ మధుప్రియ ఈ షోతో ‘ఏడుపుగొట్టు’ ఇమేజ్ తెచ్చుకుంది. అది ఆమెకు ప్రతికూలమే. అలాగే మరో సింగర్ కల్పన కూడా బ్యాడ్ ఇమేజ్ తెచ్చుకుంది. సమీర్.. ముమైత్ ఖాన్.. ధన్ రాజ్.. దీక్షా సేథ్ లకు ఈ షో వల్ల కొత్తగా వచ్చిందేమీ లేదు. అలాగే పోయిందేమీ కూడా లేదు. గతంలో పెద్దగా పేరు లేని కత్తి కార్తీక.. మహేష్ కత్తి లాంటి వాళ్లు కొంచెం గుర్తింపు సంపాదించారు కానీ.. దీన్ని వాళ్లు ఏమేరకు ఉపయోగించుకుంటారో చూడాలి.